న్యూఢిల్లీ: డీమానిటైజేషన్పై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.
నోట్ల రద్దు చర్యను ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4-1 తేడాతో సమర్థిస్తూ.. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. బెంచ్‌లో జస్టిస్ బీవీ నాగరత్న మాత్రం వ్యతిరేకించారు. నోట్ల రద్దు గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమైందని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. నోట్ల రద్దును చేపట్టాల్సిందని కేంద్రం కాదని అభిప్రాయపడ్డారు.
2016 నవంబర్ 8న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ చట్టవ్యతిరేకమని, పిటిషన్లు దాఖలు చేసినవారితో ఏకీభవిస్తున్నట్లు ఆమె తీర్పులో పేర్కొన్నారు. ఆర్బీఐలోని సెక్షన్ 26 ప్రకారం.. ఆ సంస్థ వ్యక్తిగతంగా నోట్ల రద్దు సిఫారసు చేసి ఉండాల్సిందని, ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు నోట్ల రద్దు చేయడం సరికాదన్నారు. తన అభిప్రాయంలో నవంబర్ 8న జారీ చేసిన నోటిఫికేసన్ చట్టవ్యతిరేకమని, కానీ 2016 నాటి సంఘటనపై ఇప్పుడు నిలుపుదల చేయలేమని పేర్కొన్నారు.
నోట్ల రద్దు అంశం చట్టం పరిధిలో జరగలేదని, అది అధికారంతో జరగిందని, అందుకే దాన్ని చట్టవ్యతిరేక నిర్ణయమని అభిప్రాయపడుతున్నట్లు తీర్పు సందర్భంగా తెలిపారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని అమలు చేసిన తీరు చట్ట ప్రకారం సాగలేదని, ఆర్బీఐ బోర్డు ఇచ్చే ప్రతిపాదన మేరకు నోట్ల రద్దు అమలు సాగాలని, కానీ నోట్ల రద్దు చేపట్టాలని కేంద్రం నవంబర్ 7న ఆర్బీఐ బోర్డుకు లేఖ రాసిందని, ఇది సరైన విధానం కాదని ఆమె అన్నారు.
పార్లమెంట్ ద్వారా నోట్ల రద్దు ప్రక్రియను చేపడితే బాగుండేదని, కానీ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్ సరిగా లేదని, కేంద్రం ప్రోద్బలంతోనే ఆ చర్య చేపట్టారన్న జస్టిస్ నాగరత్న.. ఆర్బీఐ వ్యక్తగత స్వేచ్ఛ ద్వారా జరిగినట్లు లేదని తీర్పులో తెలిపారు.