విధాత: దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో ప్రస్తుత చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, పార్టీ కౌన్సిలర్ హనుమంత్ వెంకటేష్ గౌడ్‌ల‌ మద్య నెలకొన్న చెరో రెండున్నర సంవత్సరాల ఒప్పందం అమలు పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది. మున్సిపల్ ఎన్నికల అనంతరం చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.రవీంద్ర కుమార్ సమక్షంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు నరసింహ, వెంకటేష్ గౌడ్‌ల‌ మధ్య చైర్మన్ పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు నిర్వహించాలని ఒప్పందం జరిగింది. ముందుగా నరసింహ […]

విధాత: దేవరకొండ మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో ప్రస్తుత చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, పార్టీ కౌన్సిలర్ హనుమంత్ వెంకటేష్ గౌడ్‌ల‌ మద్య నెలకొన్న చెరో రెండున్నర సంవత్సరాల ఒప్పందం అమలు పంచాయితీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరింది.

మున్సిపల్ ఎన్నికల అనంతరం చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే ఆర్.రవీంద్ర కుమార్ సమక్షంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు నరసింహ, వెంకటేష్ గౌడ్‌ల‌ మధ్య చైర్మన్ పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు నిర్వహించాలని ఒప్పందం జరిగింది. ముందుగా నరసింహ రెండున్నర సంవత్సరాల పదవీకాలం పూర్తయ్యాక చైర్మన్ పదవిని వెంకటేష్ గౌడ్ కు అప్పగించాల్సి ఉంది.

అయితే రెండున్నర సంవత్సరాలు పూర్తయి మరో ఐదు నెలలు అదనంగా గడిచినప్పటికీ చైర్మన్ పదవి నుండి దిగేందుకు నరసింహ ససేమిరా అంటున్నారు. ఒప్పందాన్ని అమలు చేయాల్సిన స్థానిక ఎమ్మెల్యే ఆర్.రవీంద్ర కుమార్ ఈ విషయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరుడైన నరసింహను ఒప్పించలేకపోయారు.

ప్రస్తుతం నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఎమ్మెల్యే వర్గం వర్సెస్ గుత్తా వర్గంగా పార్టీ చీలిపోయింది. ఈ నేపథ్యంలో చైర్మన్ పదవి నుండి తప్పుకునేందుకు నరసింహ అంగీకరించకపోవడంతో రవీంద్ర కుమార్ ఈ వివాదాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వెంట వెళ్లిన వెంకటేష్ గౌడ్ చైర్మన్ పంచాయితీ సమస్యను మంగళవారం కేటీఆర్ కు వివరించారు. ఒప్పందం మేరకు వెంటనే తనకు చైర్మన్ పదవి కట్టబెట్టేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ను కోరారు. స్పందించిన కేటీఆర్ రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం అనుసరించి ఒప్పందం మేరకు వెంకటేష్ గౌడ్ కు చైర్మన్ పదవి ఇచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులైన ఆర్.రవీంద్ర కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు.

కాగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అలంపల్లి నరసింహ తన చైర్మన్ పదవిని వెంకటేష్ గౌడ్ కు అప్పగిస్తారా లేదా అనేది దేవరకొండ నియోజకవర్గం బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తాను కూడా మంత్రి కేటీఆర్ ను కలిసి చైర్మన్ పదవిలో తననే కొనసాగించేలా ఆయనను ఒప్పించాలని నరసింహ పట్టుదలగా ఉన్నారు.

దీంతో నియోజకవర్గ బీఆర్ఎస్ రాజకీయాల్లో నెలకొన్న గుత్తా వర్సెస్ రవీంద్ర కుమార్ గ్రూపుల మధ్య వైరాన్ని మున్సిపల్ చైర్మన్ పంచాయితీ మరింత పెంచనుందన్న ఆందోళన పార్టీ శ్రేణులలో వినిపిస్తోంది.

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, వెంకటేష్ గౌడ్ ల వెంట పట్టణ పార్టీ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, దేవరకొండ PACS చైర్మన్,BRS పార్టీ రాష్ట్ర నాయకుడు పల్లా ప్రవీణ్ రెడ్డి ఉన్నారు.

Updated On 27 Dec 2022 4:23 PM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story