Saturday, April 1, 2023
More
    HomelatestCongress | యథా సీనియర్.. తథా జూనియర్! రెచ్చిపోయి.. క్షమాపణలు చెప్పిన కైలాష్!

    Congress | యథా సీనియర్.. తథా జూనియర్! రెచ్చిపోయి.. క్షమాపణలు చెప్పిన కైలాష్!

    విధాత: అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా కనిపించే కాంగ్రెస్ పార్టీ (Congress party) లో సీనియర్ల అసమ్మతి మాటల మంటలు జూనీయర్లను కూడా బాగానే ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల రేవంత్ హఠావో కాంగ్రెస్ బచావో (Revanth Hathao Congress Bachao) అంటూ ఆవేశంతో ప్రకటనలు చేసిన సీనియర్లు హైకమాండ్ బుజ్జగింపులు, హెచ్చరికలతో సీనియర్లు వెనక్కి తగ్గడం విదితమే.

    ఇక మరో సీనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) అయితే ఎన్నికల పిదప బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్‌ల మధ్య పొత్తులు ఉంటాయని చెప్పి హైకమాండ్ సీరియస్ కావడంతో తాను అలా అనలేదంటూ నాలుక మడుతేశారు. అది మర్చిపోకముందే సొంత పార్టీ నేత చెరుకు సుధాకర్ గౌడ్‌ను చంపుతాను అంటూ బెదిరించి భావోద్వేగంతో మాట్లాడానని, ఇంతటితో వదిలేయాలంటూ మరోసారి వెంకట్ రెడ్డి నాలుక కరుచుకున్నారు.

    సీనియర్ల కథ ఇలా ఉంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లుగా తామేమి సీనియర్లకు తక్కువ కాదన్నట్లుగా కాంగ్రెస్ లోని జూనియర్ నాయకులు కూడా ఆవేశంతో తమకు నచ్చని నాయకులను తిట్టడం.. ఆ వెనుక క్షమాపణలు చెప్పడం అలవాటు చేసుకుంటున్నారు.

    మునుగోడు (Munugodu) ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో అద్దంకి దయాకర్ (Addanki Dayakar) దూషించి అధిష్టానం ఆదేశాలతో క్షమాపణలతో సరి పెట్టేశారు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంకే చెందిన పున్న కైలాష్ (Punna Kailash) నేత తానేమి సీనియర్లకు తీసిపోను అన్నట్లుగా వెంకటరెడ్డిని పరుష పదజాలంతో దూషించి క్షమాపణల మంత్రం పఠించారు.

    సొంత పార్టీ నేత చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) ను వెంకట్ రెడ్డి ఫోన్లో దూషించి, బెదిరించిన వివాదంలో తల దూర్చిన పున్న కైలాష్ మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాల నేతను వెంకటరెడ్డి అలా బెదిరించడం సరికాదంటూనే ఆయనపై తీవ్ర పదజాలంతో నోరు పారేసుకున్నారు.

    దీనిపై వెంకటరెడ్డి అనుచరులు, ఆయన మద్దతుదారుల్లోని బీసీ నాయకులు సోషల్ మీడియా వేదికగా కైలాష్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతూ హెచ్చరించారు. దీంతో వెంకటరెడ్డిని విమర్శించే క్రమంలో తాను ఆవేశంలో అదుపుతప్పి ఉపయోగించిన పరుషమైన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని, తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నానంటూ కైలాష్ మళ్లీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు.

    ఇలా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు ఎట్లా పడితే అట్లా అన్ పార్లమెంటరీగా పరుష పదజాలంతో పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో, ప్రత్యర్థి పార్టీలలో పలుచనవుతున్నారు. అధికారం కోసం సాటి పార్టీలతో పోటీ పడాల్సిన కాంగ్రెస్ నాయకులు తమలో తాము కలహించుకుంటు తిట్టుకోవడంలో పోటీపడుతున్నారంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular