- అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డి
- పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ౩౦% కమీషనా?
- పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
- కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని సీఎంకు బహిరంగ లేఖ
Revanth Reddy । కల్వకుంట్ల అవినీతికి నందిపేట సెజ్ బలై పోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పాదయాత్రలో భాగంగా నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని పరిశీలించారు. 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్‌కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చి, 421 ఎకరాల భూమిని కేటాయించి సెజ్ ఏర్పాటు చేసిందన్నారు.
విధాత: పరిశ్రమల ఏర్పాటును వేగంగా ముందుకు తీసుకెళతామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను మర్చిపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ఒక తెలంగాణ పారిశ్రామిక వేత్త పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan Reddy) ఆయనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారని ఆరోపించారు.
కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు 30శాతం కప్పం కట్టాల్సిందేనని అంటున్నారట అని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
బీజేపీ సర్కారూ మాట మర్చింది
ఈ సెజ్‌లో పసుపు, మొక్కజొన్న, సోయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016లో కేంద్రంలోని బీజేపీ (BJP)ప్రభుత్వం మాట ఇచ్చి మరిచిందని రేవంత్ ఆరోపించారు. బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.
గతంలో పతంజలి (Pathanjali) కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కవిత పెద్ద ప్రచారం చేశారని, కానీ ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదన్నారు. రాందేవ్ బాబా (Ramdev Baba) తో మాట్లాడి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇక్కడి బీజేపీ ఎంపీ కృషి చేయాలన్నారు. తక్షణమే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై కేసీఆర్ రివ్యూ చేయాలని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలన్నారు.
KTRను బర్తరఫ్ చేయాలి: CMకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఐటీ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఉన్న ఆయన ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. తక్షణమే టీఎస్పీఎస్సీ (TSPSC) బోర్డుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీఎస్పీఎస్సీ అన్ని వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీ స్పందనను బట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.