Tuesday, January 31, 2023
More
  Homelatestపోలీసు పడగ నీడలో కామారెడ్డి బంద్.. అడుగడుగునా అరెస్టులు

  పోలీసు పడగ నీడలో కామారెడ్డి బంద్.. అడుగడుగునా అరెస్టులు

  • షబ్బీర్ అలీ, ఏనుగు రవీందర్ రెడ్డి సహా పలువురి అరెస్ట్
  • స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రజలు

  విధాత, నిజామాబాద్: పోలీస్ పహారా మధ్య కామారెడ్డి పట్టణ బంద్ ఉద్రిక్తంగా సాగింది. పంట భూములను ఇండస్ట్రియల్ జోన్ లోకి చేర్చడంపై రైతులు దశలవారీగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా శుక్రవారం కామారెడ్డి పట్టణ బంద్ కు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది.

  ఈ మేరకు వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రోడ్ల మీదికి వచ్చి దుకాణాలను మూసి వేయించారు.

  బంద్ కు మద్దతుగా వచ్చిన కార్యకర్తలను పట్టుకొని వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉదయమే ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేయగా నిజాంసాగర్ చౌరస్తా వరకు రైతులు వచ్చి రాస్తా రోకో నిర్వహించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను వ్యాన్ లోకి ఎక్కించి ఠాణాకు తరలించారు.

  పట్టణంలోని ఎన్ హెచ్ 7 రోడ్, స్టేషన్ రోడ్, సిరిసిల్ల రోడ్ తో పాటు ప్రధాన రోడ్లలో ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అనుమానం కలిగినా వారిని పట్టుకొని స్టేషన్ కు తరలించారు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారులు, ప్రజలు బంద్ కు సహకరించి సాయంత్రం వరకు దుకాణాలు మూసి ఉంచారు. బంద్ వల్ల గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులను పోలీసులు అరెస్ట్ చేసి ఇతర పోలీస్ స్టేషన్ లకు తరలించారు. కాగా బంద్ సందర్భంగా బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సహా పార్టీ కౌన్సిలర్లు, నాయకులను ఉదయం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ను కలిసేందుకు మున్సిపల్ కార్యాలయం గోడ దూకి లోనికి ప్రవేశించి ధర్నా నిర్వహించారు. వెంటనే పోలీసులు రవీందర్ రెడ్డి ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అదే విధంగా బీజేపీ నాయకులు గుజ్జుల ప్రేమిందర్ రెడ్డి కూడా కామారెడ్డి చేరుకొని బంద్ ను పర్యవేక్షించారు.

  కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ పార్టీ సీనియర్ నాయకుడు కోదండరెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం షబ్బీర్ అలీతో పాటు కైలాస్ శ్రీను తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.

  బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ అనోన్య, డిఎస్పీ సోమనాథం, పట్టణ సిఐ నరేష్ ఆధ్వర్యంలో అదనపు బలగాలను మోహరించారు. బంద్ సందర్బంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

  కాగా అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను సాయంత్రం పోలీసులు వదిలి పెట్టారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ కామారెడ్డికి రాక సందర్బంగా ఆయనకు స్వాగతం పలికెందుకు భిక్నూర్ మండలం బస్వాపూర్ గ్రామం వద్ద కు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular