Kamareddy
విధాత, కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజీవాడి గ్రామంలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. సంగోజీవాడి గ్రామపంచాయతీలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికుడు గ్రామపంచాయతీ బోరు మోటార్ ఆన్ చేయడానికి బోరు వద్దకు వచ్చే క్రమంలో ఎలుగుబంటి బాల్ సాయిలుపై దాడి చేసింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గ్రామస్తులు కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
ఉదయం గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల వెనక నుంచి ఎలుగుబంటి వెళ్తుండగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం చేరవేశాడు. అలాగే గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తున్న విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి అటవీశాఖ అధికారులు చేరుకొని రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేసి ఎలుగు బంటి కోసం గాలింపు చేపట్టారు.
అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ ఎలుగుబంటి ఎప్పుడు ఎవరి పై దాడి చేస్తుందో అని భయాందోళనలకు గురౌవుతున్నామని ఎలుగుబంటిని బంధించి తీసుకెళ్లాలని కోరారు.