Kamareddy | గజ్వేల్‌, కామారెడ్డి నుంచి బరిలోకి ముఖ్యమంత్రి ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ సిద్ధాంతం కేసీఆర్‌ మదిలో కూడా ఇదే ఉన్నదా? లేక బిడ్డ క‌విత కోసం వ్యూహాత్మ‌క నిర్ణయమా? విధాత‌: తన సిటింగ్‌ స్థానం గజ్వేల్‌ను వదిలి.. కామారెడ్డికి వెళతారన్న చర్చకు ముగింపు పలికిన సీఎం కేసీఆర్‌.. రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్నది. గ‌జ్వేల్‌లో ఓట‌మి […]

Kamareddy |

  • గజ్వేల్‌, కామారెడ్డి నుంచి బరిలోకి ముఖ్యమంత్రి
  • ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ సిద్ధాంతం
  • కేసీఆర్‌ మదిలో కూడా ఇదే ఉన్నదా? లేక
  • బిడ్డ క‌విత కోసం వ్యూహాత్మ‌క నిర్ణయమా?

విధాత‌: తన సిటింగ్‌ స్థానం గజ్వేల్‌ను వదిలి.. కామారెడ్డికి వెళతారన్న చర్చకు ముగింపు పలికిన సీఎం కేసీఆర్‌.. రెండు స్థానాల నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆంతర్యమేంటన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్నది. గ‌జ్వేల్‌లో ఓట‌మి ఖాయ‌మ‌ని అర్థమైనందుకే కామారెడ్డిని ఎంచుకున్నారా? లేక ఇందులో ఏదైనా రాజకీయ వ్యూహం ఉన్నదా? అనే చర్చ నడుస్తున్నది.

ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధాని లేదా ఎవరైనా నాయకుడు రెండు చోట్ల పోటీ చేయ‌డం కేసీఆర్‌తోనే ప్రారంభం కాదు.. కేసీఆర్‌తోనే ముగింపూ కాదు. గతంలోనూ ఎంద‌రో జాతీయ నేత‌లు ఈ ప్ర‌యోగం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ అదే ప్రయోగం చేయడానికి వెనుక మూడు ప్ర‌ధాన కార‌ణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మొదటిది ఓట‌మి భ‌యమైతే.. రెండోది ప్ర‌తిప‌క్షాల‌కు త‌న సత్తా చాట‌డం. మూడోది కూతురు క‌విత‌కు సీటును రిజ‌ర్వ్ చేసిపెట్ట‌డమని వారు అంటున్నారు. గ‌జ్వేల్.. కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం. నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేశారు కూడా. ఇక్కడ ఆయన గెలుపునకు ఢోకా ఏమీ లేదు. అయినా రెండోచోట పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కూతురు కోసమే కామారెడ్డి?

గ‌జ్వేల్‌లో ఓట‌మి భ‌యం లేకపోయినా కామారెడ్డిని ఎంచుకోవడం వెనుక పొరుగు నియోజకవర్గాలపై ప్రభావం చూపడంతోపాటు.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కామారెడ్డిని తన కూతురు, ఎమ్మెల్సీ కవితకు కేటాయించి.. తన గజ్వేల్‌ను తాను దగ్గర పెట్టుకోవడమని అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన క‌విత‌.. బీజేపీ నేత అర‌వింద్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఓట‌మి భారంతో కొంత‌కాలంపాటు నిజామాబాద్ ప‌రిస‌రాల్లోకి కూడా వెళ్ల‌లేక‌పోయార‌న్న‌ చర్చకూడా నడిచింది. అనంత‌ర ప‌రిణామాల్లో కూతురును మ‌రోలా సంతోష పెట్టేందుకు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చిన కేసీఆర్‌.. మ‌రోసారి క‌విత‌ను చట్టసభల్లోకి తెచ్చారు.

ఈసారి కూడా అలాంటి ప‌రిణామ‌మే ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన సీఎం కేసీఆర్‌.. ముంద‌స్తు ఆలోచ‌న‌తో నిజామాబాద్ జిల్లాను ఎంచుకున్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. పూల‌మ్మిన చోట క‌ట్టెలు అమ్మ‌లేమన్న నానుడిని బాగా అర్థం చేసుకున్న కేసీఆర్‌.. కూతురు ఓడిన ప్రాంతం నుంచే మ‌ళ్లీ గెలిపించేందుకే నిజామాబాద్ జిల్లాను ఎంచుకున్న‌ట్టు విశ్లేష‌కులు చెప్తున్నారు. మ‌రోసారి నిజామాబాద్ నుంచి క‌విత‌ను ఎంపీగా రంగంలోకి దింపాల‌ని తీర్మానించుకున్న కేసీఆర్‌.. ఈసారి కూడా ప్ర‌జ‌లు ఆద‌రించ‌క‌పోతే.. ఆమెను అసెంబ్లీకి పెంపేందుకు వీలుగా కామారెడ్డిని రిజర్వ్‌ చేసి పెడతారని అంటున్నారు.

Updated On 31 Aug 2023 1:20 PM GMT
somu

somu

Next Story