మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో భగ్గుమన్న అన్నదాతలు ఉదయం నుంచే పట్టణమంతా ఉద్రిక్తత, బారికేడ్లు ధ్వంసం   కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హై డ్రామా ముగ్గురికి గాయాలు, పోలీసుల అదుపులో ఇద్దరు  కలెక్టర్ రావాలని పట్టుబట్టిన రైతన్నలు రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేస్తాం రేపు పట్టణ బంద్‌కు రైతు జేఏసీ పిలుపు విధాత: కామారెడ్డి మున్సిపల్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌లో పలు గ్రామాలను గ్రీన్‌ జోన్లు, ఇండస్ట్రీయల్‌ జోన్లుగా ప్రకటించడంపై […]

  • మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా కామారెడ్డిలో భగ్గుమన్న అన్నదాతలు
  • ఉదయం నుంచే పట్టణమంతా ఉద్రిక్తత, బారికేడ్లు ధ్వంసం
  • కామారెడ్డి కలెక్టరేట్ వద్ద హై డ్రామా
  • ముగ్గురికి గాయాలు, పోలీసుల అదుపులో ఇద్దరు
  • కలెక్టర్ రావాలని పట్టుబట్టిన రైతన్నలు
  • రేపటి నుంచి ఆందోళనలు ఉధృతం
  • తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేస్తాం
  • రేపు పట్టణ బంద్‌కు రైతు జేఏసీ పిలుపు

విధాత: కామారెడ్డి మున్సిపల్ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌లో పలు గ్రామాలను గ్రీన్‌ జోన్లు, ఇండస్ట్రీయల్‌ జోన్లుగా ప్రకటించడంపై రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తమైంది. రోజంతా ఆ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ, సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలిగించాలని డిమాండ్‌ చేస్తు రైతులు వివిధ రూపాల్లో 20 రోజులుగా చేస్తున్న ఆందోళన గురువారం ఆగ్ర స్థాయికి చేరింది.

అయితే ఈ మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ అడ్లూరి గ్రామానికి చెందిన రైతు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. దాన్ని నిరసిస్తూ ఆ గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌ రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మాకు వంద ఫీట్ల రోడ్లు వద్దు, ఇండస్ట్రియల్‌, గ్రీన్‌ జోన్లు వద్దని అడ్లూరు, లింగాపూర్‌, ఎల్లారెడ్డి తదితర గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. పరిశ్రమల పేరుతో సాగు భూములను లాక్కోవద్దని, మేము కష్టపడి సంపాదించుకున్న భూములన్నీ కోల్పోతే మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని బాధిత గ్రామాల రైతులు, వారి కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.

మేము ఇంతవరకు ఎలా బతికామో అట్లనే బతుకుతామని, ఈ కొత్త ప్లాన్ వల్ల పంటలు పండించే భూములు సుమారు 2 వేల 500 ఎకరాల భూమి ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్ పరిధిలోకి వెళ్తుందని, దీంతో తమ బతుకులు రోడ్డున పడుతాయని రైతులు ఆవేదన చెందారు. రాళ్లు, రప్పలు వున్న భూములను కాదని సారవంతమైన భూములను ఇండస్ట్రియల్ జోన్, వంద అడుగుల రోడ్డు ప్రతిపాదనలను కుట్ర పూరితంగా తయారు చేశారని రైతులు ఆరోపించారు. అబ్దుల్లానగర్, లింగాపూర్, పాతరాజంపేట గ్రామాల్లో పంటలకు అనువైన భూములు లేవని, అలాంటి భూముల్లో శ్రీవారి వెంచర్‌తో పాటు కబ్జాలు చేశారని ఆరోపించారు.

కానీ మాకు రోడ్లు వద్దని మా భూములు మాకే కావాలని ర్యాలీలో పాల్గొన్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. మా ప్రాణాలను పణంగా పెట్టైనా మా భూములను కాపాడుకుంటామని నినదించారు. దాదాపుగా నెలరోజులుగా మేము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వల్ల రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. ఫలితంగా ఒక నిండు ప్రాణం బలైందని మండి పడుతున్నారు.

ఈ క్రమంలో గురువారం కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తలకు దారి తీసింది. మొదట సీఎస్‌ఐ మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కామారెడ్డి కలక్టరేట్‌ వద్ద దిష్టి బొమ్మను రైతులు దగ్ధం చేశారు. రైతులు కలెక్టరేట్‌ ఎదుట ర్యాలీ చేపట్టడంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ రైతులు వాటిని తోసుకుంటూ.. కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు.

విరిగిన బారికేడ్ల మధ్య నుంచి మహిళలు కలెక్టర్ కార్యాలయంలోకి చోచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో ముగ్గురు రైతులకు గాయాలు కాగా వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు నిరసనగా రైతులు పోలీసులను చుట్టుముట్టారు. రైతులు సాయంత్రం వరకు అక్కడే ఉండి భోజనాలు చేసి విస్తరాకులను కలెక్టర్ కార్యాలయంలోకి విసిరేశారు.

కలెక్టర్ వచ్చే వరకు అక్కడి కదిలేది లేదని రైతులు భీష్మించడంతో అదనపు ఎస్పీ అన్యోన్య ఐదుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తామనడంతో రైతులు ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు యత్నించగా. బారికేడ్లు కింద కూలిపోయాయి. మరోసారి డీఎస్పీ సోమనాథం అదే ఐదుగురి మాట చెప్పడంతో రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి, డీఎస్పీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.

ఇవాళ సుమారు ఐదు వేల మంది రైతులు ర్యాలీకి వచ్చారని, ఇది ప్రారంభం మాత్రమేనని, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పోరాడామో అంతకంటే రెట్టింపు సంఖ్యలో ఉద్యమం చేయడానికి సిద్ధమని రైతులు తెలిపారు. రైతుల ఆందోళలనకు స్పందించకపోతే వేలాది మంది రైతులం వస్తామని, ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు.

సర్పంచ్‌పై గ్రామ మహిళల దాడి..

అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకున్న స్పందించలేదని అగ్రహించిన ఆ గ్రామ మహిళలు సర్పంచ్ జనార్దన్‌పై దాడి చేశారు. కామారెడ్డి పాతబస్టాండ్ ప్రాంతంలో సర్పంచ్‌ను అడ్డగించి దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.

ఆందోళనలు ఉధృతం చేస్తాం

8 గంటల పాటు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన కొనసాగించిన రైతులు తాత్కాలికంగా విరమించారు. ఈ రోజు ఉదయం నుంచి ధర్నా చేపట్టిన రైతులు కలెక్టరేట్‌ వద్ద దిష్టిబొమ్మకు వినతిపత్రం ఇచ్చి గేటుకు వేలాడ దీశారు. రేపు కామారెడ్డి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి భవిష్యత్తు కార్యాచరణ మొదలవుతుందని రైతు జేఏసీ నేతలు ప్రకటించారు. కలెక్టర్‌ వచ్చి వినతిపత్రం తీసుకోవాలని వేలాది మంది రైతులు కోరినా.. ఆయన రాలేదని రైతు సంఘం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని, ఇంకా ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.

రైతులు సమస్యలు చెప్పుకొవచ్చు.. వినతి పత్రం ఇవ్వొచ్చు: కామారెడ్డి జిల్లా కలెక్టర్‌

రైతులతో మాట్లాడేందుకు సిద్ధమే అని, రైతుల ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ అన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రైతులు తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సూచించారు. రైతుల తరఫున 10 మంది వచ్చి వినతి పత్రం ఇవ్వవచ్చు. మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల్లో కొందరు భయం సృష్టించారు. ఇండస్ట్రియల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నదని కలెక్టర్‌ చెప్పారు.

ట్విట్టర్ టిల్లు స్పందించాలి: ఎమ్మెల్యే రఘునందన్

కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌పై రైతులు చేస్తున్న ఆందోళనపై ట్విట్టర్ టిల్లు కేటీఆర్ స్పందించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. మాస్టర్ ప్లాన్ విషయమై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ వెనక్కి తీసుకునే వరకు రైతులకు మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Updated On 5 Jan 2023 5:57 PM GMT
krs

krs

Next Story