జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌.. విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నలగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ రాజకీయాలు రేపుతున్న వేడి మరే నియోజకవర్గంలో లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టడం కంటే వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా బిఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ రాజకీయాలు సాగిస్తున్న సొంత పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కోవడమే పెద్ద తలనొప్పిగా […]

  • జిల్లా రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌..

విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో నలగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ రాజకీయాలు రేపుతున్న వేడి మరే నియోజకవర్గంలో లేదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టడం కంటే వచ్చే ఎన్నికల్లో తనకు పోటీగా బిఆర్ఎస్ టికెట్ ఆశిస్తూ రాజకీయాలు సాగిస్తున్న సొంత పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కోవడమే పెద్ద తలనొప్పిగా తయారైంది.

దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు..

కంచర్లకు పోటీగా టికెట్ ఆశిస్తున్న చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, గుత్తా అమిత్ రెడ్డి, పిల్లి రామరాజు జనంలో తమ బలం పెంచుకునేందుకు నిత్యం ఏదో ఒక కార్యక్రమాలతో హడావిడి చేస్తున్నారు. వారి దూకుడుకు కళ్లెం వేసేందుకు కంచర్ల సైతం ప్రభుత్వపరంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆసరాతో జనంలో పట్టు నిలుపుకునేందుకు నిత్యం పాట్లు పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో తాజాగా కంచర్ల తన రాజకీయ ప్రత్యర్థులపై డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ అస్త్రాన్ని సంధించడం నియోజకవర్గంలోనే కాదు.. జిల్లా రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది.

పోటీదారుల‌కు స‌వాల్‌..

మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి దరఖాస్తులను తీసుకోవాలంటూ కంచర్ల అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. కంచర్ల సంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అస్త్రం ఇప్పుడు ప్రత్యర్థి కాంగ్రెస్, బిజెపిలతో పాటు పార్టీలోని తన టికెట్ పోటీదారులకు గట్టి సవాల్ విసురుతుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు ప్రక్రియలో భాగంగా కంచర్ల ప్రత్యర్ధుల శిబిరాల్లోని పేద వర్గాలు కచ్చితంగా ఇళ్ల కోసం తమ నాయకులపై ఒత్తిడి తేవడం… లేదా కంచర్లను ఆశ్రయించడం చేయాల్సి ఉంటుంది.

ఎమ్మెల్యే ఆమోదం కోసం..

దీంతో బిఆర్ఎస్ టికెట్ ఆశావాహులైన రామరాజు, చకిలం, చాడ, అమిత్ వర్గీయుల్లో పేదలంతా ఇళ్ల కోసం తనను సంప్రదించాల్సిన అనివార్య పరిస్థితులను కంచర్ల సృష్టించగలిగారు. తమ వెనుక ఉండే పేదలకు, కార్యకర్తలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలంటే ఆశవాహ నాయకులంతా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ పరిణామాలను రామరాజు, చకిలం చాడ, అమిత్ లతోపాటు అటు విపక్ష కాంగ్రెస్, బిజెపి నాయకులు ఎలా అధిగమిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

బూమ్ రాంగ్ అయితే..

సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులపై పై చేయి సాధన దిశగా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ అస్త్రం తాను అనుకున్న లక్ష్యాలకు భిన్నంగా బూమ్ రాంగ్ అయి తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉందన్న వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అదే జరిగితే ఆయన డబుల్ బెడ్ రూమ్ అస్త్రంతో కంచర్ల సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అవుతుంది. మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూములు కేవలం 552 మాత్రమే ఉన్నాయి. వీటి పంపిణీకి భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని పురమాయించారు. కమిషనర్ సైతం ఈనెల 21 నుండి 26 సాయంత్రం వరకు దరఖాస్తులు అందించాలని మున్సిపాలిటీ ప్రజలకు సూచించారు. అర్హులైన వారిని ఆర్డీవో ఆధ్వర్యంలోని విచారణ బృందాలు పరిశీలించి లబ్ధిదారులకు ఎంపిక చేస్తాయి.

బ‌స్మాసుర హ‌స్త‌మ‌య్యేనా..!!

అయితే 552 ఇళ్లకు 10,000కు పైగా దరఖాస్తులు అందే పరిస్థితి ఉందని సాక్షాత్ మున్సిపల్ అధికారులే అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు చూస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీతో రాజకీయ లబ్ధి కంటే, ఇల్లు దక్కని మెజార్టీ దరఖాస్తుదారుల నుండి వ్యతిరేకత ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితి పొంచి ఉంది. ఈ పరిణామాలను కంచర్ల రాజకీయ ప్రత్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటికే జనంలో తన దుందుడుకు వైఖరితో పలచనబడిన కంచర్ల.. తన రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే లక్ష్యంతో సంధించిన డబుల్ అస్త్రం బస్మాసుర హస్తమై తననే రాజకీయంగా దెబ్బతీసే పరిస్థితులను సృష్టించవచ్చన్న చర్చ స్థానిక రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది.

ఆలేరు 'డబుల్' దుమారం..

ఇటీవల ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తన నియోజకవర్గంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ రేపిన దుమారం ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో గుబులు రేపింది. ఈ నేపథ్యంలో నల్గొండ మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ వ్యవహారం రాజకీయంగా ఆయనకు ఎంత మేరకు అనుకూల, ప్రతికూల ఫలితాలను ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Updated On 20 Feb 2023 6:44 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story