విధాత: నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి సొంత పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ పిల్లి రామరాజు ప్రత్యర్థిగా మారాడు. రానున్న ఎన్నికల్లో టికెట్ లక్ష్యంగా మరోసారి తన జన్మదిన వేడుకల వేళ నియోజకవర్గ రాజకీయాల్లో హంగామా చేశారు.
సొంతంగా పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న పిల్లి రామరాజు వ్యవహార శైలి రాజకీయంగా తనకి ఇబ్బందికరంగా మారడంతో కంచర్ల ఆయనను కౌన్సిలర్ పరిధిలోనే రాజకీయాలు చేసుకోవాలని గతంలో కట్టడి చేశారు. ఇప్పుడు పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుండి పిల్లిని తప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి కంచర్లతో పాటు చేరిన పిల్లి రామరాజు ఇటీవల దాకా కంచర్ల రాజకీయ ఎదుగుదలలో కీలకంగా పని చేశారు. కొన్ని నెలలుగా కంచర్లపై తిరుగుబాటు చేస్తున్న రామరాజు కౌన్సిలర్ పరిధిలోకే పరిమితం కావాలన్న కంచర్ల మాటలు లెక్కపెట్టకుండా ఏకంగా నియోజకవర్గం అంతా కంచర్లకు పోటీగా బిఆర్ఎస్ పార్టీలో తన రాజకీయ కార్యకలాపాలు ముమ్మరం చేస్తున్నాడు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రేసులో తాను సైతం ఉన్నానంటూ జనంలోకి దూసుకెళ్తున్నారు. తాజాగా తన జన్మదిన వేడుకల పేరుతో నియోజకవర్గం అంతా ఎమ్మెల్యే కంటే అధికంగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి జనంలో హల్ చల్ చేశారు. తరచూ తనకు మంత్రి జగదీష్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయంటూ చెబుతున్న రామరాజు ఇటీవల సీఎం కేసీఆర్ ను, మంత్రి హరీష్ రావును కలిశాక నియోజకవర్గ రాజకీయాల్లో తన స్పీడ్ పెంచారు.
టికెట్ రేసులో ఉన్న సొంత పార్టీ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, చాడ కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, బండా నరేందర్ రెడ్డి కంటే ఎక్కువగా పిల్లి రామరాజు నిత్యం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు పోటీగా అన్నట్లుగా తన కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు.
తనకు పోటీగా నియోజకవర్గంలో పిల్లి రామరాజు చేస్తున్న కార్యక్రమాలను సీరియస్‌గా తీసుకున్న కంచర్ల భూపాల్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించే విషయంలో సమస్యలు లేకుండా ఉండాలంటే సొంత పార్టీ ప్రత్యర్ధుల దూకుడుకు అడ్డుకట్ట వేయాలని పావులు కదుపుతున్నారు.
ముందుగా తనకు నియోజకవర్గం కేడర్‌లో సవాల్‌గా తయారైన పిల్లి రామరాజును పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు కంచర్ల పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఇప్పటికే తనకంటూ సొంత వర్గాన్ని, జనంలో గుర్తింపును సాధించుకున్న రామరాజును అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే నియోజకవర్గంలో కంచర్ల మరింత ప్రతికూలతను ఎదుర్కోక తప్పదని పిల్లి వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు.
అదిగాక పార్టీలో కంచర్లకు ప్రత్యర్ధులైన గుత్తా సుఖేందర్ రెడ్డి, చాడా కిషన్ రెడ్డి, చకిలం అనిల్ కుమార్, బండలతో పిల్లికి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా కంచర్ల పార్టీలో చర్యలు తీసుకుంటే వారితో కలిసి కంచర్లపై పార్టీలో అసమ్మతి మరింత రాజేసే అవకాశం కనిపిస్తుంది.
నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు పోటీగా ఆయన ప్రత్యర్థులు సాగిస్తున్న రాజకీయాలను గమనిస్తున్న జిల్లా మంత్రి జి.జగదీష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకత్వం పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుండి పిల్లి రామరాజును తప్పించే విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలో తర్జనభజన పడుతుంది.
అయితే పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి పిల్లిని తప్పించే వ్యూహంలో కంచర్ల తెలివిగా ఎమ్మెల్సీ కవిత వర్గీయుడు, తనకు విధేయుడైన జాగృతి నేత భువనగిరి దేవేందర్‌ను పట్టణ పార్టీ అధ్యక్ష పదవి రేసులో తెర మీదకి తెచ్చారు. అయినా పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి పిల్లిని తప్పించినంత మాత్రాన రాజకీయంగా పిల్లి దూకుడుకు అడ్డుకట్ట పడుతుందా లేక మరింత స్వేచ్ఛగా పిల్లి రామరాజు పార్టీలోని కంచర్ల వైరి వర్గాన్ని బలోపేతం చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారనుంది.