Karnataka Results |
విధాత: కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka Results) కమ్యూనిస్టులకు బలాన్నిచ్చాయట…అంటే కర్ణాటకలో కమ్యూనిస్టుల బలోపేతం గురించి కాదట.. తెలంగాణలో కమ్యూనిస్టుల గూర్చి అంటూ ఎర్ర దండు సైనికులు మురిసిపోతున్నారు.
తెలంగాణకు పొరుగు రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనేక కోణాల్లో తెలంగాణ సిపిఐ, సిపిఎంలకు కలిసొచ్చే విధంగా ఉన్నాయంటూ కామ్రేడ్లు అంచనాలు వేసుకుంటున్నారు. తమ సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ ఓడిపోవడం ఒకటైతే, అధికార పార్టీ ప్రభుత్వం గద్దె దిగిపోవడం, కాంగ్రెస్ గద్దె నెక్కడం తమకు తెలంగాణలో అనుకూలమవుతుందంటూ కామ్రేడ్లు విశ్లేషిస్తున్నారు.
వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న క్రమంలో ఆ పార్టీ మళ్లీ ఎన్నికల పోరులో మేజిక్ ఫిగర్ సీట్లు గెలవాలంటే కమ్యూనిస్టులతో పొత్తు అనివార్యం అంటూ వామపక్ష వర్గాలు భావిస్తున్నాయి. లేదంటే కర్ణాటకలో అధికార పార్టీ ఐదు శాతం ఓట్లతో ప్రభుత్వాన్ని కోల్పోయినట్లుగా తెలంగాణలో బీఆర్ఎస్‌కు గడ్డి పరిస్థితి తప్పదని అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య చీలిపోయి తమకు మేజిక్ ఫిగర్ సీట్లు వస్తాయనుకుంటున్న బీఆర్ఎస్ లెక్కలు తప్పకుండా ఉండాలంటే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాల్సిందే అంటూ కామ్రేడ్లు చెబుతున్నారు. తెలంగాణలో వామపక్షాలు కోరిన సీట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్‌తో పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడితే జాతీయస్థాయిలో సమీకరణల మార్పుల క్రమంలో ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో జతకట్టే అవకాశం ఉండనే ఉందంటూ కమ్యూనిస్టులు ధీమాగా ఉన్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోరాడిన సంగతిని కమ్యూనిస్టులు గుర్తు చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ ఇవ్వడం గులాబీ పార్టీలో గుబులు రేపుతుంది. పైకి తెలంగాణలో తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నప్పటికీ కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ లో నెలకొన్న కొత్త జోష్ ఎక్కడ తమ అధికార పీఠాన్ని కదిలిస్తుందోనన్న గుబులు ఆ పార్టీ అధినాయకత్వంలో లేకపోలేదు.
ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ఒంటరిగా తలపడే కంటే ఉభయ కమ్యూనిస్టులకు కలిపి పది సీట్లు ఇచ్చేస్తే గెలుపు పై నమ్మకంతో బీఆర్ఎస్ ఎన్నికల పోరుకు సిద్ధమవ్వచ్చని లేదంటే హంగ్ పరిస్థితులు తప్పవని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే తమ సిట్టింగ్ స్థానాలు కోల్పోవాల్సి వస్తుందన్న బెంగ బీఆర్ఎస్‌ని వేధిస్తుంది. పొత్తులో వామపక్షాలకు వదిలేసే సిట్టింగ్ స్థానాల్లో బీఆర్ఎస్ రెబల్స్ బెడద మరో సమస్యగా మారి పార్టీలో అసమ్మతిని పెంచనుందన్న ఆందోళన సైతం గులాబీ వర్గాలను కలవర పెడుతుంది. మొత్తంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు పొత్తులు.. సీట్ల కేటాయింపు దిశగా బీఆర్ఎస్‌పై ఒత్తిడి పెంచేందుకు కమ్యూనిస్టులకు సాధనాలుగా మారాయని వామపక్ష శ్రేణులు సంబరంగా ఉన్నాయి.