- బాధితులను విస్మరించిన ప్రభుత్వం.. పరిహారం అందించని వైనం
- రెండో విడత అప్రమత్తంగా ఉండాలని.. అధికారులకు, డాక్టర్లకు హెచ్చరిక
- రెండవ విడత కార్యక్రమం ప్రారంభించిన మంత్రులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కండ్ల సమస్యలు పోయి కంటికి వెలుగొస్తుందనుకుంటే ఉన్న చూపూ పోయి గుడ్డివారిగా మార్చిన విషాద సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాలుగేళ్ళ క్రితం తొలి విడత కంటివెలుగు సందర్భంగా జరిగింది. కంటి వెలుగు అంటేనే ఒంట్లో వణుకు పుట్టి 18 మందిని అంధులుగా మార్చిన సంఘటన తాజాగా గుర్తుకు వస్తోంది.
తొలి విడత కంటి వెలుగు పథకం సందర్భంగా కూడా ప్రభుత్వం ఇప్పటి మాదిరిగా అర్బాటంగానే ప్రచారం చేసింది. నిన్న ఖమ్మం జిల్లా కేంద్రంలో నలుగురు ముఖ్యమంత్రుల సమక్షంలో రెండో విడత కంటి వెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తొలి విడతలో వరంగల్లో జరిగిన పొరపాటు రెండో విడతలో జరగకుండా చూడాలని పలువురు హెచ్చరిస్తున్నారు. గురువారం రాష్ట్రంలో రెండవసారి కంటివెలుగు ప్రారంభమైన విషయం తెలిసిందే.
కంటి చూపు కోల్పోయిన బాధితులు
2018 సెప్టెంబర్ 26 చీకటి రోజుగా మారి ఈ 18 మంది కండ్లు కనిపించక నాలుగేండ్లుగా బతుకులీడుస్తున్నారు. వారి వివరాలిలా ఉన్నాయి.
కందుల మల్లయ్య(హనుమకొండ), కక్కెర్ల సరోజన(హనుమకొండ), బొమ్మకల్లు వెంకటయ్య (వరంగల్), గోరంట్ల సుజాత(వరంగల్), గోపరాజు బుచ్చమ్మ(ఎల్లాపూర్), సోమాని లక్ష్మి (వరంగల్), మంద శాంతమ్మ (హనుమకొండ), మారపాక లక్ష్మి(వరంగల్), బి.సరోజ (పులిగిల్ల, పరకాల), మార్క చంద్రమౌళి (ఆత్మకూర్), హరిదాస్యం పద్మ(గిర్నిబావి), గుగులోతు భగవాన్ (ఖానాపూర్,వరంగల్), అజ్మీరా మేగ్య (బాంజీపేట, నర్సంపేట), అల్లం కొమురమల్లు (చౌళ్లపల్లి,ఆత్మకూర్), అజ్మీరా జానకి (చంద్ర తండా నర్సంపేట), దూడపాక కొమురయ్య (సుభాష్ కాలనీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా), ముడిక రాజయ్య (వేశాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా), మేషబోయిన కొమురమ్మ (ములుగు) ఉన్నారు.
చూపు కోల్పోయిన బాధతో భూపాలపల్లికి చెందిన ముడిక రాజయ్య అప్పట్లోనే చనిపోయారు. కొద్ది రోజుల
క్రితం వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన బొమ్మకల్లు వెంకటయ్య కూడా కన్నుమూశారు. మిగిలిన బాధితుల జీవితాలు ఆగమయ్యాయి. ఏ పనిచేసుకోలేని దుస్థితి ఏర్పడింది.
సంచలనం సృష్టించిన సంఘటన
కంటివెలుగు పథకం అనగానే రాష్ట్రంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఎలాంటి పొరపాటు మరోసారి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదేపదే సూచిస్తున్నారు.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రెండవ పర్యాయం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో చేదు సంఘటనను తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఒక హెచ్చరికగా ఈ సంఘటనను మరోసారి గుర్తు చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సంఘటనలో అంధత్వం వచ్చిన వారిని ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోగా కనీసం పరిహారం కూడా చెల్లించకపోవడం విషాదం.
నాలుగేళ్ల తర్వాత కంటివెలుగు
2018 ఆగస్టు 15న కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. కండ్ల సమస్యలతో బాధపడేవారికి ఆపరేషన్లు చేయించి చూపును ప్రసాదిస్తామని, ప్రభుత్వ ఖర్చుతో క్యాంపుల్లో పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తామని, ఆపరేషన్లు చేయిస్తామని ఇప్పుడు చెప్పినట్లుగా తొలివిడత కంటివెలుగు సందర్భంగా ఢంకా బజాయించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్యాంపుల్లో టెస్టు చేసి ఆపరేషన్ అవసరమైన వారిని 2018 సెప్టెంబర్
26న హన్మకొండలోని జయ హాస్పిటల్లో సర్జరీలు చేశారు. ఆపరేషన్లు వికటించి 18 మంది కంటిచూపు కోల్పోయారు. తర్వాత బాధితులను హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పిటల్కు తరలించారు. మరో రెండు, మూడు సర్జరీలు చేయించినా కంటిచూపు దక్కలేదు.
ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. డాక్టర్ల నిర్లక్ష్యం, ఆపరేషన్ థియేటర్లో వాతావరణం సరిగ్గా లేక ఇన్ఫెక్షన్ కారణమని తేల్చిన అధికారులు హాస్పిటల్ నిర్వాహకులపై కనీస చర్యలు తీసుకోలేదు. ఇప్పటివరకు బాధితులకు పరిహారం ఇవ్వలేదు. బాధితుల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన వారు ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.
డొంక తిరుగుడు సమాధానం
వరంగల్ సంఘటన పై చిత్తశుద్ధి లేని ప్రకటనలు చేస్తూ డొంక తిరుగుడు సమాధానాలతో బాధితులను ఏమార్చారు. థియేటర్ సీజ్ చేసి డీఎంహెచ్ విచారణ చేపట్టి ఆపరేషన్ థియేటర్, ఇతర వసతులు సరిగా లేవని చెప్పారు. అపరిశుభ్ర వాతావరణం, డాక్టర్ల నిర్లక్ష్యం ఉందన్నారు.
ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం, అధికారులు, ఆపరేషన్లు చేసిన జయ హాస్పిటల్తో కుమ్మక్కై ఈ విషయాన్ని మరుగు పరిచారు. బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. రెండో దఫా కంటి వెలుగు పథకాన్ని అయినా పకడ్బందీగా అమలు చేయాలని పేదల కంటి చూపుతో ఆడుకోవద్దని పలువురు సున్నితంగా నైనా హెచ్చరిస్తున్నారు.
తొలివిడత కంటివెలుగులో…
వరంగల్ ఘటనతో పథకానికి బ్రేక్ పడినప్పటికీ తొలిసారి కంటి వెలుగు పథకంలో భాగంగా రాష్ట్రంలో 9887 గ్రామాల్లో దాదాపు 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశామని అప్పుడు వెల్లడించారు. 6,42,290 మందికి కంటి శుక్లాల ఆపరేషన్లు, మరో 3,16,976 మందికి ఉన్నత స్థాయి చికిత్సలు అవరమని తేల్చింది.
రూ.2 కోట్లతో రాష్ట్రంలో 19 ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆపరేషన్లు నిర్వహించేలా థియేటర్లను ఆధునీకరిస్తామని ప్రకటించారు. వరంగల్ ఘటనకు కంటి వెలుగు స్కీంకు సంబంధం లేదని కంటి వెలుగు పథకాన్ని ఆపేశారు.
ప్రారంభమైన రెండవ విడత కంటివెలుగు
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, డాక్టర్ గోపివరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్లు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.