Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌కంటివెలుగుతో అంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాలి: మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

  కంటివెలుగుతో అంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాలి: మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి

  విధాత, నిజామాబాద్: దృష్టి లోపాలను దూరం చేసే ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు-భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లో గల స్త్రీ స్వశక్తి భవన్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు.

  మంత్రి స్వయంగా ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకుని కంటి అద్దాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయం లేదని, ఓట్ల కోణం అసలే లేదని స్పష్టం చేశారు.

  ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా, గిన్నిస్ రికార్డును నమోదు చేసే తరహాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు. ప్రస్తుత సమాజంలో సామాజిక రుగ్మతగా మారిన కంటి సమస్యను పారద్రోలాలనే కృత నిశ్చయంతో 2018 లోనే కంటి వెలుగుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి గుర్తు చేశారు.

  తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కోటీ 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తే, మూడొంతుల మంది కంటి జబ్బులతో బాధ పడుతున్నారని నిర్ధారణ అయ్యిందని, యాభై లక్షల మందికి కంటి అద్దాలు అందించడం జరిగిందని వివరించారు.

  ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 7 లక్షల మందికి కంటి పరీక్షలు జరిపి, రెండు లక్షల మందికి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ప్రస్తుతం రెండవ విడతలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలు పంపిణీ చేసేలా విస్తృత చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

  జిల్లాలో 12 లక్షల పైచిలుకు మందికి స్క్రీనింగ్ నిర్వహించేందుకు 70 బృందాలను ఏర్పాటు చేశామని, వంద రోజుల పాటు ఈ శిబిరాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డులలో కొనసాగుతాయని తెలిపారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రతి ఒక్కరికి నాణ్యమైన సేవలందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

  ఏ.ఎన్.ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరాల్లో కంటి పరీక్షలు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. అన్ని వర్గాల వారు భాగస్వాములై కంటి వెలుగును విజయవంతం చేసి ప్రజలంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు.

  కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 12.30 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా 70 బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. మొదటి విడతలో 31 బృందాలు 160 రోజుల పాటు పని చేశాయని, ప్రస్తుతం వంద రోజుల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

  ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్ష చేయించుకునే వెసులుబాటు లేనివారికి కంటి వెలుగు శిబిరాలు ఎంతో గొప్ప అవకాశంగా నిలుస్తాయని, వీటిని పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

  కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్, మేయర్ నీతూ కిరణ్ పిలుపునిచ్చారు. నోడల్ అధికారిగా హాజరైన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త సంచాలకులు అంబర్ సింగ్ నాయక్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆకుల లలిత, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, డీ ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శన్, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular