విధాత: బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమాన్ని కేసీఆర్ వేగవంతం చేశారు. దానికి అనుగుణంగా ముందుగా ఏపీ పై దృష్టి సారించారు. ముఖ్యంగా ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించడం మొదలు సోమేశ్‌కుమార్ ఏపీకి రిలీవ్ కావాలని హైకోర్టు ధర్మాసన తీర్పు ఇవ్వడం, తర్వాత సీఎస్‌గా రకరకాల పేర్లు వినిపించినా సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎ. శాంతికుమారిని ఎంపిక చేయడంతో ప్రస్తుతం దీని పైనే చర్చ జరుగుతున్నది.
తెలంగాణలో కంటే ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువ. ఆ ప్రభావం ప్రతి నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఏపీలో టీడీపీ అంటే కమ్మ, కాంగ్రెస్ అంటే రెడ్లు అనే నానుడి ఉన్నది. ఈ రెండు కులాల నేతల మధ్యే ముఖ్యమంత్రి పీఠం ఉంటున్నది. దీంతో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్లు అనివార్యంగా టీడీపీతోనో, కాంగ్రెస్‌తోనో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వంగవీటి రంగ, హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి బలమైన కాపు నేతలు అక్కడ రాజకీయంగా ప్రభావం చూపినా అధికారంలోకి రావాలన్న ఆ సామాజికవర్గ నేతల ఆకాంక్ష ఇప్పటికీ నెరవేరలేదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆ ఆశలు మళ్లీ చిగురించాయి. అయితే అనతికాలంలోనే ఆయన జెండా ఎత్తేశారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన కాపు నేతలు ఏపీలో పట్టుకోసం యత్నిస్తూనే ఉన్నారు.
పవన్ కల్యాణ్ జనసేన స్థాపించడంతో ఆయన నిలబడుతారు, తమ కల నెరవేరుతుంది అనుకున్నారు. కానీ ఆయన చంద్రబాబు దత్తపుత్రుడు అనే వైసీపీ నేతల విమర్శలకు బలం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో ఉన్న ఆ వర్గ నేతలకు కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ ప్రకటన ఆశలు కలిగించింది.
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై అక్కడి రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. ఉత్తరాంధ్ర, కాపు నేతల్లో మాత్రం సానుకూల స్పందన వస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ చేసిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో పోరాడితేనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమౌతుందని పవన్ కల్యాణ్ వంటి నేతలు వివిధ సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
అక్కడి యువత కూడా ప్రస్తుతం అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్‌తోనే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం పూర్తి, రాజధాని, సచివాలయ నిర్మాణాలు ఆయనతోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు సామాజికవర్గ నేతలు, మాజీ ఐఏఎస్, ఐఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు.
తమ సామాజికవర్గ ఓట్లతో పాటు, ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను కలుపుకుని వెళ్లడంతో పాటు.. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, ఉచిత విద్యుత్ వంటి హామీలతో రైతులను ఆకట్టుకోవచ్చు మంచి ఫలితాలు దక్కవచ్చనే అంచనాలు వేస్తున్నారు.
వంగ వీటి రంగ హత్య తర్వాత ఆ సామాజికవర్గాలకు వైఎస్ పెద్ద దిక్కుగా మారారు. అందుకే వైఎస్ ఉన్నంత కాలం ఆ సామాజికవర్గ నేతలంతా ఆయన వెంటే నడిచారు. ఇంతకాలానికి కేసీఆర్ రూపంలో తమకు మరో నేత దొరికారని కాపు నేతలు అనుకుంటున్నారు.
తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి ఎంపిక కూడా తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందనే ఆ నేతల ఆలోచన అన్నట్టు అక్కడ చర్చ జరుగుతున్నది. ఏపీ కాపులకు కేసీఆర్ శాంతికుమారి ఎంపికతో మూడు రోజుల ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారని అనుకుంటున్నారు.