- ఇప్పటికే నాలుగు సార్లు అలైన్మెంట్ మార్పు
- నష్టపరిహారం చెప్పాకే భూముల సర్వేకు అంగీకరిస్తాం
విధాత, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణం కోసం రామడుగు మండలం వెదిర గ్రామ శివారులో రెవెన్యూ అధికారులు శనివారం భూసేకరణ చేయడానికి రావడంతో రైతులు అడ్డుకున్నారు. అధికారులు ఇష్టానుసారంగా భూసేకరణ పేరుతో కొలతలు చేపడుతున్నారని రైతులు ఆరోపించారు. గతంలో సూచించిన విధంగా కాకుండా ఇష్టారాజ్యంగా భూ సేకరణ చేయడం సరికాదన్నారు. ఇప్పటికే జాతీయ రహదారి నిర్మాణం కోసం భూసేకరణకు సంబంధించిన అలైన్మెంట్ లో నాలుగుసార్లు మార్పులు చేశారన్నారు.
బైపాస్ రహదారి నిర్మాణం విషయాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం ఉన్న రహదారి వెంట భూ సేకరణ చేసి విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డు నిర్మాణం వల్ల తమ విలువైన వ్యవసాయ భూములు పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోల్పోతున్న భూములకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో తెలియజేసిన తర్వాతేనే భూసేకరణ చేయాలని అధికారులతో వాగ్వివాదానికి దిగారు.
భూసేకరణ చేయడానికి వచ్చిన సర్వేయర్ రాకేష్, ఆర్ఐ రజనిలకు రైతులు తమ బాధలను తెలియజేశారు. రైతుల సమస్యలను పై అధికారులకు తెలియజేస్తామని రెవెన్యూ సిబ్బంది ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.