Karimnagar
- ఆపరేషన్ చేయూత ద్వారా సాయమందిస్తామని హామీ
విధాత బ్యూరో, కరీంనగర్: మావోయిస్టు పార్టీ డీసీఎం నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు ఎదుట లొంగిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లి గ్రామానికి చెందిన జ్యోతి సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో విప్లవ గీతాలకు ఆకర్షితులైంది.
2004 లో అప్పటి మావోయిస్టు దళ కమాండర్ రఘు ద్వారా దళంలో చేరింది. కొంతకాలం సిరిసిల్ల ప్రాంతంలో పనిచేసి, మానాల ఎన్‌కౌంటర్ అనంతరం ఆదిలాబాద్ జిల్లా మంగిదళంలోకి వెళ్ళింది.
2011లో ఆదిలాబాద్ జిల్లా కర్రిగుట్ట ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత జంపన్న తో కలిసి ఒడిశా రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ కమిటీ సభ్యురాలుగా పనిచేసింది.
పార్టీలోనే ఉద్యమ సహచరుడు ఎర్రగుళ్ల రవి అలియాస్ దినేష్ ను పెళ్లి చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో మూడు రాష్ట్రాలలో వివిధ హోదాల్లో పనిచేసింది. మావోయిస్టు పార్టీ అనాలోచిత, అనాగరిక ఆలోచనలు పార్టీలోని మహిళా సభ్యుల పట్ల అనుసరిస్తున్న తీరుతో అసహనం చెంది పోలీసులకు లొంగిపోయినట్లు తెలిపింది. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన తీవ్రవాదులు, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అందిస్తున్న సహకారంతో జనజీవన స్రవంతిలో కలసి సాధారణ జీవితం గడపడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలతో, ఆదివాసీలను ప్రలోభపెట్టి మైనర్లను కూడా
తమలో కలుపుకుంటూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించింది.
ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదని, అమాయకపు ఆదివాసులను మావోయిస్టులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించింది.
చదువు రానివారు, అమాయక ప్రజలు, పార్టీ భావజాలం, సిద్ధాంతాలు తెలియని వ్యక్తులను
పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపింది. చైనా, రష్యా లాంటి దేశాలు మార్క్సిజం, లెనినిజం ఇలాంటి సిద్ధాంతాలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య విధానాలతో అభివృద్ధి వైపు దూసుకు వెళ్తుండగా, మావోలు
తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం అనే బూజు పట్టిన సిద్ధాంతాన్ని నేటికీ అమలు చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉండగా లొంగిపోయిన జ్యోతి పై ఉన్న ఐదు లక్షల రివార్డు, ప్రభుత్వం తరఫున పునరావాసం, ఆమెకు అందజేస్తామని సిపి తెలిపారు.