- కింగ్ మేకర్ జేడీఎస్‌యే.. జాతీయ పార్టీల మంతనాలు
- 113 మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకపోతే ఏం చేద్దామని ఇరు పార్టీల నేతల మల్లగుల్లాలు
విధాత: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Karnataka Assembly Election Result 2023) రేపు (శనివారం) వెల్లడి కానున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తునందున ఈ ఫలితాలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత దాదాపుగా అన్ని సర్వేలు హంగ్ అసెంబ్లీ ఏర్పాటుకానున్నట్టు జోస్యం చెప్పాయి.
దీంతో అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు సైతం హంగ్ భయం పట్టుకున్నది. అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సీట్లు 113 వస్తే ఓకే.. ఒకవేళ రాకపోతే ఎలా? ఏమి చేద్దాం. ఎవరితో చేతులు కలుపుదాం అని జాతీయ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.
మరోవైపు జేడీఎస్‌కు 20 పైచిలుకు సీట్లు వస్తాయని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. దాంతో జాతీయ పార్టీలకు తామే దిక్కదని జేడీఎస్ నేతలు సంబుర పడుతున్నారు. సీఎం సీటునే డిమాండ్ చేయవచ్చని ప్లాన్ వేసుకుంటున్నారు. ఉంటే కింగ్ లేదంటే కింగ్‌మేకర్ తామేనని ధైర్యంగా ఉన్నారు.
కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండొచ్చేమో!
కాంగ్రెస్‌కు ఫుల్ మెజార్టీతో 120కిపైగా సీట్లు వస్తే ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. అలాంటప్పుడు బీజేపీకి 80 కంటే తక్కువగా సీట్లు వస్తే భవిష్యత్తులో కూడా హస్తం పార్టీకి ఎలాంటి థ్రెట్ ఉండదు.
ఒకవేళ 105 సీట్లు మాత్రమే వస్తే, బీజేపీకి 70-75 సీట్లు వస్తే జేడీఎస్ నుంచి కాంగ్రెస్ భేషరతుగా మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ బీజేపీకి 95 సీట్లు వస్తే ఆ పార్టీయే తిరిగి అధికారం చేపట్టే చాన్స్ ఉంటుంది. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌కు రిక్తహస్తం ఎదురుకావచ్చు.
బీజేపీకి కష్టమే కావచ్చేమో!
బీజేపీకి క్లీయర్ మెజార్టీ 113 సీట్లు వస్తే ఓకే. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 105-100 సీట్లు వస్తే ఇండిపెండిట్లు, లేదా జేడీఎస్ నుంచి కమలం పార్టీ మద్దతు కోరే అవకాశం ఉంటుంది. ఇది అధికార బీజేపీ పెద్ద విషమేమీ కాకపోవచ్చు. కానీ, బీజేపీకి 80 కంటే తక్కువ సీట్లు, జేడీఎస్‌కు 25 కంటే తక్కువ సీట్లు వస్తే అధికారం పీఠం చేజారినట్టే. ఒక వేళ బీజేపీ 75 స్థానాల సాధిస్తే జేడీఎస్ కాంగ్రెస్ కలిసి అధికారాన్ని పంచుకొనే అవకాశం ఉంటుంది. బీజేపీ కల నీరగారుతుంది.
జేడీఎస్‌ది కీలక స్థానమే
ఒకవేళ జేడీఎస్ 50కి పైగా సీట్లు సాధిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సీటును డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. 35 స్థానాలు గెలుచుకుంటే మహారాష్ట్ర సర్కారు ఏర్పాటులో కింగ్ మేకర్ అవుతుంది. ఒకవేళ జాతీయ పార్టీలకు మెజార్టీ సీట్లు వస్తే జేడీఎస్ ఎలాంటి ప్రభావం చూపబోదు. 25 అంతకంటే ఎక్కువ సీట్లు వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలను భయపట్టే పరిస్థితి ఉంటుంది.
కర్ణాటక 2018 ఎన్నికల్లో ఏం జరిగిందంటే..
2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 104 సీట్లు సాధించింది. అధికారం చేపట్టడానికి 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది. అదే సమయంలో 78 సీట్లు సాధించిన కాంగ్రెస్, 37 సీట్లు సాధించిన జేడీఎస్ జట్టు కట్టింది. సీఎం పోస్టును జేడీఎస్ నేత కుమారస్వామికి హస్తం పార్టీ కట్టబెట్టింది. కానీ, వారి సంకీర్ణ ప్రభుత్వం ఏడాదిపాటు మాత్రమే కొనసాగింది. తర్వాత చీలిక రావడంలో బీజేపీ అధికారం చేపట్టింది. బీఎస్ యెడ్యురప్ప ముఖ్యమంత్రి పగ్గాలు చేతిలోకి తీసుకున్నారు