HomelatestKarnataka Assembly Elections | ఫలించని మోడీ మత విద్వేష మంత్రం

Karnataka Assembly Elections | ఫలించని మోడీ మత విద్వేష మంత్రం

Karnataka Assembly Elections

విధాత‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం, కాంగ్రెస్‌ రికార్డు విజయం వెనుక అనేక కారణాలున్నాయి. నలభై రోజుల ఉధృత ఎన్నికల ప్రచారం తోనే ఇది సాధ్యం కాలేదు. ప్రజా సమస్యలపై, అవినీతిపై కాంగ్రెస్‌ పార్టీ దీర్ఘకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై కర్ణాటక కాంట్రాక్ట్‌ అసోసియేషన్‌ ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ లేఖను విడుదల చేసింది.

పబ్లిక్‌ ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్‌ తీసుకుంటున్నదని ఆరోపించింది. ఈ సంఘం 2021లోనే బొమ్మై ప్రభుత్వ అవినీతిపై ప్రధానికి లేఖ రాసింది. నిత్యం ప్రచారంలో అవినీతి, కుటుంబపాలన అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని మోడీ బొమ్మై సర్కార్‌పై వచ్చిన ఆరోపణలపై స్పందించలేదు. పైగా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించడానికి మత ప్రచారం చేసి, విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నించారు.

ఈ రాష్ట్రంలో 13 శాతం ముస్లింలు ఉన్నారు. వారి మనోభావాలు దెబ్బతీసేలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు బొమ్మై ప్రభుత్వం వారికి ఉన్న 4 శాతం రిజర్వేషన్లు తొలిగించి లింగాయత్‌, వొక్కలిగ సామాజికవర్గాలకు కేటాయించింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది.

బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. అంతటితో ఆగకుండా పుండు మీద కారం చల్లినట్టు యడ్యూరప్ప, మాజీ మంత్రి ఈశ్వరప్పలు వారిని రెచ్చగొట్టేలా ప్రచార సమయంలో ముస్లిం ఓట్లు మాకు అక్కరలేదని చెప్పి విభజన రాజకీయాలకు తెరలేపారు. ప్రధాని కూడా ఓటు వేసిన తర్వాత జై భ‌జరంగ్‌దళ్‌ అనాలని ప్రచారం చేయడం వివాదాస్పదమైంది.

ఇలా మతం పేరుతో ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో చాలా కాలంగా బీజేపీ నేతలు కర్ణాటకలో హిజాబ్‌, హలాల్‌ కట్‌, అజాన్‌, గోవధ నిషేధ చట్టం, టిప్పు సుల్తాన్‌ వంటి అంశాలను తరుచూ ముందుకు తెస్తూ.. బీజేపీ మైనారిటీలకు పూర్తిగా దూరమైంది.

ప్రధాన మంత్రి తొమ్మిదేళ్లుగా తమ ఉగ్రవాదాన్ని అరికట్టడానికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించవచ్చు. కానీ అది చేయకుండా ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రచారంలో వాడుకోవడం వారి రాజకీయ దివాళాకోరు తనాన్ని చూపెట్టింది. సినిమాను సినిమాగా చూడాలి. కానీ బీజేపీ నేతలు కశ్మీరీ ఫైల్స్‌, కేరళ స్టోరీ లాంటి సినిమాల ద్వారా ఒక వర్గాన్ని దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తామే నిజమైన దేశభక్తులమని, అది వారి ఒక్కరి సొత్తే అన్నట్టు ప్రచారం చేసుకోవడం వంటి వాటిని కన్నడ ప్రజలు తిరస్కరించారు.

బీజేపీ నేతలు ముస్లిం మతంపై చేసిన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా భారత్‌ అభాసుపాలైంది. చివరికి అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకునే దుస్థితి ఏర్పడింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర‌ అమృతమహోత్సం వేళ దేశంలో బీజేపీ అనుసరించిన, అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. మత విద్వేషాలతో ఏ పార్టీ మనుగడ సాగించలేదని తమ తీర్పు ద్వారా తెలియజేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular