Karnataka | కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) కుమారుడు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 40 లక్షలు తీసుకుంటూ లోకాయుక్త (Lokayukta ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో తనిఖీలు చేయగా రూ. 6 కోట్ల నగదు బయటపడింది.
కర్ణాటక దేవనాగరి జిల్లా చన్నగిరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే మదాల్ విరుపాక్షప్ప (Madal Virupakshappa) కుమారుడు ప్రశాంత్ మదాల్ (Prashanth Madal).. బెంగళూరు వాటర్ సప్లయి సీవరేజ్ బోర్డు (BWSSB)లో చీఫ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.
అయితే కర్ణాటక సోప్స్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కంపెనీ( KSDL) నుంచి రూ. 40 లక్షలు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు ప్రశాంత్‌ను పట్టుకున్నారు. అనంతరం ఆయన కార్యాలయంలో తనిఖీలు చేయగా రూ. 1.7 కోట్లు బయటపడ్డాయి. ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి మొత్తం రూ. 6 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సబ్బులు, ఇతర డిటర్జెంట్ల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా ఒప్పందం కోసం కాంట్రాక్టర్ నుంచి ప్రశాంత్ మదాల్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ లోకాయుక్త అధికారులకు సమాచారం అందించి, మదాల్‌ను అడ్డంగా బుక్ చేశాడు.