HomelatestKarnataka CM | రాహుల్‌ చాయిస్ సిద్ధరామయ్యే?

Karnataka CM | రాహుల్‌ చాయిస్ సిద్ధరామయ్యే?

  • ఇప్పటికే నిర్ణయించిన అధిష్ఠానం?
  • సంప్రదింపుల తర్వాతే పేరు వెల్లడి!
  • ఆచితూచి అడుగులేస్తున్న పెద్దలు
  • కన్నడ సీఎంపై తొలగని ఉత్కంఠ
  • ఢిల్లీలో నేతల ఎడతెగని మంతనాలు

విధాత : కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) ఎంపికలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు, ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న డీకే శివకుమార్‌తో పార్టీ పెద్దలు మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే.. సిద్ధరామయ్య వైపే రాహుల్‌గాంధీ మొగ్గు చూపుతున్నారని తెలుస్తున్నది. డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య బయటకు ఏం చెబుతున్నా.. ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి డీకే శివకుమార్‌ చేరుకున్నారు.

ఖర్గేను సిద్ధరామయ్య కలవటానికి గంట ముందు డీకే అక్కడికి చేరుకోవడం ఆసక్తి రేపింది. ఈ సమావేశాలకు ముందు మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలిశారు. ఆ సమయంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయమైపోయిందని అంటున్నారు. కానీ.. ఇద్దరు నేతలు పట్టు వీడని నేపథ్యంలో నిర్ణయాన్ని ప్రకటించడంలో జాప్యం జరుగుతున్నదని సమాచారం. ఖర్గే, డీకే మధ్య దాదాపు 30 నిమిషాలపాటు చర్చలు నడిచినట్టు చెబుతున్నారు. కాగా సీఎం ఎవ‌ర‌నే దానిపై ప్రకటన బెంగళూరులోనే వెల్లడించ‌నున్న‌ట్లు తెలుస్తోంది

రాహుల్‌ చాయిస్‌ సిద్ధరామయ్యే?

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నదని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని రాహుల్‌ గాంధీ భావిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకే ఎక్కువ మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే.. ముఖ్యమంత్రిని నిర్ణయించే క్రమంలో ఇద్దరు నేతలను సంతృప్తిపర్చేలా డిప్యూటీ సీఎం, క్యాబినెట్‌ బెర్తుల్లో వాటా వంటి పలు ఫార్ములాలపై అధిష్ఠానం పెద్దలు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ముఖ్యమంత్రి విషయంలో సోనియా గాంధీ మనసులో మాట తెలుసుకునేందుకు డీకే ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది. ఫలితాల రోజున సోనియా తనను నమ్మారని, దానిని తాను నెరవేర్చానని డీకే పేర్కొన్న విషయం తెలిసిందే.

సీఎం పీఠం తనకే దక్కాలన్న కోరికను పరోక్షంగా డీకే ఈ విధంగా బయటపెట్టారనే చర్చ ఆ రోజే జరిగింది. కేసుల విషయం డీకేకు అడ్డంకిగా మారుతుందనే చర్చకూడా ఉన్నది. దానితోపాటు లింగాయత్‌ల ప్రాబల్యం నేపథ్యంలో సిద్ధరామయ్యకే అవకాశం ఇస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరువునష్టం కేసు వేస్తా : డీకే

ఇదిలా ఉంటే.. డీకే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారని వదంతులు చెలరేగాయి. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన డీకే.. ఆ వార్తలను ఖండించడమే కాకుండా.. ఇటువంటి కథనాలను ప్రసారం చేసే మీడియా సంస్థలపై పరువు నష్టం కేసు వేస్తానని కూడా హెచ్చరించారు.

పార్టీ తనకు తల్లిలాంటిదని, వైదొలిగే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారమే డీకే ఢిల్లీ రావాల్సి ఉన్నా.. తన ప్రయాణాన్ని ఆయన రద్దు చేసుకోవడంతో సిద్ధరామయ్యకే సీఎం పీఠం దక్కుతుందనే సంకేతాలు డీకేకు అంది ఉంటాయన్న చర్చ నడిచింది. అయితే.. అది అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే చర్య అని కొందరు అభిప్రాయపడ్డారు.

ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా చెప్పారు. ‘ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం అనేది సులభమైన పని కాదు. దానిని ఢిల్లీ నుంచి రుద్దలేం. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో భాగస్వాములైన అందరి అభిప్రాయాలు తీసుకుని, ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయిస్తాం’ అని ఆయన చెప్పారు. కొత్త మంత్రివర్గం ఈ నెల 18న ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular