Karnataka Elections | స్పష్టమైన మెజారిటీ వస్తుందంటున్న కాంగ్రెస్‌ హంగ్‌ రావాలని కోరుకుంటున్న బీజేపీ, జేడీఎస్‌ ప్రచారం చివరి పది రోజుల్లో కులం, మతం, తీవ్రవాదం, భావ్వేద్వేగాలే ప్రచారాస్త్రాలు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ఆ పార్టీ నేతలే స్పష్టంగా చెప్పలేని స్థితి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు వచ్చింది. మే 10 వ తేదీన (బుధవారం) 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో పోలింగ్‌ జరగనున్నది. ఓటర్లు ఇచ్చే తీర్పు ఫలితం మే 13న […]

Karnataka Elections |

  • స్పష్టమైన మెజారిటీ వస్తుందంటున్న కాంగ్రెస్‌
  • హంగ్‌ రావాలని కోరుకుంటున్న బీజేపీ, జేడీఎస్‌
  • ప్రచారం చివరి పది రోజుల్లో కులం, మతం, తీవ్రవాదం, భావ్వేద్వేగాలే ప్రచారాస్త్రాలు
  • బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? ఆ పార్టీ నేతలే స్పష్టంగా చెప్పలేని స్థితి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు వచ్చింది. మే 10 వ తేదీన (బుధవారం) 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో పోలింగ్‌ జరగనున్నది. ఓటర్లు ఇచ్చే తీర్పు ఫలితం మే 13న వెలువడనున్నది. ప్రచార గడువు దగ్గరపడిన చివరి పదిరోజులు ప్రధాన పార్టీల ప్రచార సరళి పూర్తిగా మారిపోయింది. ఎన్నికల షెడ్యూల్‌ రాకముందు నుంచే అక్కడ ప్రభుత్వ మార్పు తప్పదని వివిధ సర్వేలు చెప్పాయి. కర్ణాటక ఎన్నికల చరిత్ర చూస్తే గత 25 ఏళ్లలో 1999, 2013 లోనే ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.

ఈసారి సర్వేల్లోనూ కాంగ్రెస్‌ పార్టీకి స్పష్టమైన మెజారిటీ సాధించబోతున్నదని స్పష్టం చేశాయి. దీంతో కలవరానికి గురైన కమలనాథులు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి సీనియర్లను సైతం పక్కనపెట్టి 70 మందికిపైగా కొత్తవారికి అవకాశం కల్పించారు. దీంతో మాజీ సీఎం జగదీశ్‌ శెట్టర్‌, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్‌ సవది బీజేపీ అధిష్ఠాన వైఖరిని పై తమ అసంతృప్తిని వెళ్లగక్కి పార్టీని వీడారు. అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా కాషాయ పార్టీకి దూరమైన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ప్రచారంలో అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో కులం, మతం, తీవ్రవాదం భావోద్వేగాలు

వాస్తవానికి ఏ ఎన్నికైనా బీజేపీ నేతలు మోడీ, అమిత్‌ షా ల వ్యూహరచన, ప్రచారాన్నే నమ్ముకుంటున్నారు. ప్రధాని ఛరీష్మానే తమను గట్టెక్కిస్తుందని అనుకున్నారు. కానీ కర్ణాటకు వచ్చేసరికి నేతలు, కార్యకర్తలు ఢీలా పడ్డారు. ఎందుకంటే ఎన్నికల నగారా మోగే సమయానికి కన్నడ నాట బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. దీనికారణంగా కాంగ్రెస్‌ పార్టీ ఈసారి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతుందనే వాతావరణం ఏర్పడింది.

ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ముద్ర, లింగాయత వర్గంలో అసంతృప్తి అధికారపార్టీని కలవరపెట్టాయి. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో తర్వాత బీజేపీ అధిష్ఠానం దూకుడు పెంచింది. అంతకు ముందు కాంగ్రెస్‌ నేతలు సిద్ధరామయ్య లింగాయత ముఖ్యమంత్రులంతా అవినీతి పరులనీ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రధానిని విష సర్పంగా అభివర్ణించారు. వీటినే బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది.

అందుకే ప్రధాని ప్రచారంలో తనను ఇప్పటివరకు 91 సార్లు తిట్టిందని ఓటర్ల ముందు వాపోయి సానుభూతి ద్వారా ఓట్ల రాబట్టే ప్రయత్నం చేశారు. అలాగే మ్యానిఫెస్టోలో బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని పేర్కొనడానికి కూడా బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో పెట్టింది. ప్రధాని నుంచి ఆ పార్టీ కార్యకర్త వరకు కాంగ్రెస్‌పార్టీ ని ఇదే అంశంపై టార్గెట్‌ చేసి ప్రచారం తీరును మార్చారు.

మొదట్లో ఎక్కువగా కనిపించిన అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో కులం, మతం, తీవ్రవాదం భావోద్వేగాలు, చర్చనీయాంశాలయ్యాయి. ఇంత చేసినా ఇవి బీజేపీ అధికారాన్ని నిలబెడుతాయా? అంటే ఆపార్టీ నేతలే చెప్పలేని పరిస్థితి ఉన్నది. అయితే బీజేపీ తన గెలుపునకు అనుకూలతను సృష్టించుకోలేకపోయినా.. కాంగ్రెస్‌ సీట్లకు గంటికొట్టే పరిస్థితిని తీసుకుని రావడంతో కొంత సఫలమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

హంగ్‌పైనే బీజేపీ, జేడీఎస్‌ ఆశలు

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికి కూడా అనుకూల వాతావరణమే ఉన్నది. అయితే స్ఫషమటైన మెజారిటీ వస్తుందా? లేక హంగ్‌ వస్తుందా అన్న చర్చ కూడా జరుగుతున్నది. ప్రచారం చివర్లో ప్రధాని సహా బీజేపీ నేతలు చేసి ఉద్వేగపూరిత ప్రసంగాలు ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి హంగ్ రావాలని జేడీఎస్‌ కోరుకుంటున్నది. తద్వారా కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించాలని అనుకుంటున్నది. బీజేపీ కూడా తాము గెలవలేకపోయినా ఫరవాలేదు కానీ కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ రాకూడదని బలంగా కోరుకుంటున్నది.

ఎందుకంటే ఒకవేళ తమకు పూర్తి మెజారిటీ రాకపోతే జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఆ పార్టీ అధిష్ఠానం ఉన్నది. దీనిపై బీజేపీ పెద్దలు జేడీఎస్‌తో చర్చించారనే ప్రచారం జరిగింది. అయితే మే 10న కన్నడ ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇస్తారా? మళ్లీ హంగ్‌ వైపే మొగ్గు చూపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On 8 May 2023 11:33 AM GMT
krs

krs

Next Story