Karnataka Elections |
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ మొదలైంది. శనివారం ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా బెల్గాం జిల్లాలో 18 అసెంబ్లీ స్థానాల నుంచి గరిష్ఠంగా 187 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 1,087 మంది కోటీశ్వరులు ఉన్నారు.
నలుగురి వద్దనే రూ.6వేలకోట్ల సంపద..
కర్ణాటక సంపన్న అభ్యర్థులు భారీగా ఉన్నారు. ఆయా అభ్యర్థుల సగటు సంపద రూ.12కోట్లపైగానే ఉన్నది. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులున్న అభ్యర్థులు నలుగురు ఉన్నారు. 592 మంది అభ్యర్థులకు కోట్లలో ఆస్తులున్నాయి. 272 మంది అభ్యర్థులు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆస్తులు కలిగి ఉన్నారు.
493 మంది అభ్యర్థులకు రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు ఆస్తులున్నాయి. 578 మంది అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్‌లో తమకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆస్తులున్నట్లు ప్రకటించారు.
అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలు వీరే
యూసుఫ్ షరీఫ్ : బీబీఎంపీ సెంట్రల్ జిల్లాలోని చిక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యూసఫ్ షరీఫ్ కర్ణాటకలో అత్యంత ధనవంతుడు. యూసుఫ్ మొత్తం సంపద రూ.1,633 కోట్లు. రూ.85 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను కలిగి ఉన్నారు. యూసుఫ్‌కు రెండు కార్లు, రెండు స్కూటీలు ఉన్నాయి. రోల్స్ రాయిస్ కారు సైతం ఉన్నది. దాని విలువ రూ.2కోట్లు అని తన అఫిడవిట్‌లో తెలిపారు.
ఎన్ నాగరాజు : బెంగళూరు రూరల్‌లోని హోసకోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ఎన్ నాగరాజు కర్ణాటకలో రెండో అత్యంత సంపన్న అభ్యర్థి. నాగరాజు మొత్తం ఆస్తులు రూ.1,609 కోట్లు. రూ.536 కోట్ల విలువైన చర, స్థిరాస్తులున్నాయి.
డీకే శివకుమార్ : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్రంలో మూడో సంపన్న అభ్యర్థిగా నిలిచారు. శివకుమార్ ఆస్తుల మొత్తం రూ.1,413 కోట్లు. రూ.273 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఆయనకు ఉన్నాయి.
ప్రియాకృష్ణ: బీబీఎంపీ సౌత్ జిల్లాలోని గోవిందరాజ్ నగర్ నుంచి పోటీ చేస్తున్న ప్రియాకృష్ణ ఆస్తుల విలువ రూ.1,156 కోట్లు. కాంగ్రెస్ టికెట్‌పై ప్రియాకృష్ణ పోటీలో ఉన్నారు. ప్రియాకృష్ణకు రూ.935 కోట్లకుపైగా చరాస్తులు, రూ.221 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
కోటీశ్వరులు..
శాంతినగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ ఏ హరీస్ వద్ద రూ.439కోట్ల ఆస్తులున్నాయి. బేలూరు బీజేపీ అభ్యర్థి హెచ్‌కే సురేష్‌కు రూ.345, బొమనహళ్లి జేడీఎస్ అభ్యర్థి కే నారాయణరాజుకు రూ.416కోట్లు, బెలార్ సిటీ జేడీఎస్ అభ్యర్థి అనిల్ హెచ్‌లాడ్‌కు రూ.380, హలియాల్ కాంగ్రెస్ అభ్యర్థి దేశ్ పాండే రాఘునాథ్‌కు రూ.363కోట్ల ఆస్తులున్నాయి.