Karnataka elections
- BJP, కాంగ్రెస్, JDSల మధ్యే పోటీ
విధాత: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్ ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 65.69 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా.. క్యూలైన్‌లో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రధాన పార్టీలకు చెందిన నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈసారి గతంలో ఎన్నడూలేని విధంగా ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొన్నది. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
బీజేపీకి చేదు ఫలితాలు: ప్రీపోల్ సర్వేలు
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్‌కు ముందు నుంచే ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం, సీనియర్ల తిరుగుబాటు తదితర అంశాలకు తోడు ఈసారి బీజేపీకి చేదు ఫలితాలే రానున్నాయని ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. దీంతో చివరి పది రోజులు ప్రచారం ఉధృతంగా జరిగింది.
బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ
ఇప్పుడు పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలపై ఆసక్తి నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఈసారి కూడా అక్కడ హంగ్ వస్తుందా? లేక స్పష్టమైన మెజారిటీ వస్తుందా అన్న అంశాలు కూడా ఉత్కంఠగా మారాయి.
కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు
కర్ణాటకలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు దక్కవచ్చని చెప్పాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని, జేడీఎస్ మరోసారి కింగ్‌మేకర్‌గా నిలిచే అవకాశం ఉన్నదని అంచనా కట్టాయి. అయితే మొత్తం ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ స్వల్ప మెజారిటీ దక్కుతుందని వెల్లడించాయి.
ఇది జేడీఎస్‌కు పెద్ద దెబ్బ: కుమారస్వామి
మరోవైపు కర్ణాటకలో ఎన్నికల పోలింగ్ ముగియకముందే జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి 25 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదన్నారు. ఎన్నికల్లో ఇతర పార్టీల ధనబలాన్ని తాము తట్టుకోలేకపోయామని ఆయన నిర్వేదం చెందారు. ఇది జేడీఎస్‌కు పెద్ద దెబ్బ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో కర్ణాటక ఓటరు నాడిపై సర్వే చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏం చెప్పాయి అన్నది పరిశీలిస్తే.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెప్పినా.. కాంగ్రెస్ పార్టీనే మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందని వివిధ సర్వేల ఫలితాలను బట్టి తెలుస్తోంది.
మొత్తం సీట్లు 224
రిపబ్లిక్ టీవీ సర్వే: బీజేపీ 85-100, కాంగ్రెస్ 94-108, జేడీఎస్ 24-32, ఇతరులు 2-6
టీవీ9 భారత్‌వర్ష్ సర్వే: బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
జీ న్యూస్ సర్వే: బీజేపీ 79-94, కాంగ్రెస్ 103-118, జేడీఎస్ 25-33, ఇతరులు 2-5
పోల్ స్ట్రాట్ సర్వే: బీజేపీ 88-98, కాంగ్రెస్ 99-109, జేడీఎస్ 21-26, ఇతరులు 0-4
ఇండియా టుడే: కాంగ్రెస్-122-140, బీజేపీ- 62-80, జేడీఎస్-20-25, ఇతరులు 0-3
టైమ్స్ నౌ : కాంగ్రెస్- 106-120, బీజేపీ- 78-92, జేడీఎస్-20-26, ఇతరులు 2-4
సీ ఓటర్ : కాంగ్రెస్- 100-112, బీజేపీ- 83-95, జేడీఎస్-21-29, ఇతరులు 2-6
పీపుల్స్ పల్స్ : కాంగ్రెస్- 107-119, బీజేపీ- 78-90, జేడీఎస్-23-29, ఇతరులు 1-3
జన్‌కీ బాత్ : కాంగ్రెస్- 91-106, బీజేపీ- 94-`117, జేడీఎస్-14-24