Karnataka | Hijab
- ఆ దిశగా కసరత్తు చేస్తున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు
- స్కూళ్లు, ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో ఎత్తివేతకు చర్యలు
విధాత: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేసేందుకు కసరత్తు చేస్తున్నది. స్కూళ్లు, ప్రీ యూనివర్సిటీ కాలేజీల్లో హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిని ఉపసంహరిస్తామని ప్రకటించింది.
అలాగే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే భజరంగ్ దళ్ వంటి సంస్థలపై కూడా నిషేధం విధిస్తామని హెచ్చరించింది. రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ.. @ కర్ణాటకను స్వర్గంగా మలుస్తామని మా ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించాం. ఒకవేళ ఎవరైనా శాంతికి విఘాతం కలిగించాలని చూస్తే సహించబోము. భజరంగ్‌దళ్ లేదా ఇతర సంఘ్ పరివార్ సంస్థలపై కూడా నిషేధం విధిస్తాం* అని హెచ్చరించారు.
వాటి ఆటలు ఇక సాగబోవు
ఎవరైనా నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. రాష్ట్రంలో కొన్ని శక్తులు నాలుగేండ్లుగా స్వేచ్ఛగా, విచ్చలవిడిగా అరాచకాలు చేశాయి. ఇకపై వాటి ఆటలు ఎంతమాత్రం సాగబోవు. హిజాబ్ నిషేధ ఉత్తర్వులను సమీక్షిస్తాం. కొత్త పాఠ్య పుస్తకాలు తేవడంపై సమీక్షిస్తాం. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మత అల్లర్లకు, ఘర్షణలకు కారణమైన ఉత్తర్వులను సమీక్షించి, కొత్త నిబంధనలు తీసుకొస్తాం* అని ప్రియాంక్ ఖర్గే తెలిపారు.