- దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌దే గెలుపు
- ఎర్రకోటపై జెండా ఎగురవేస్తాం
- భారత్ జోడో యాత్ర ఫలితంగానే
- కర్ణాటకలో స్పష్టమైన మెజార్టీ
- బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
- మీడియాతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
విధాత: తెలంగాణలో కూడా కర్ణాటక ఫలితమే పునరావృతం అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చెప్పారు. దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పునర్‌వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు.
బీజేపీ కుతంత్రాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కర్ణాటకలో స్పష్టమైన మోజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకెళ్తున్న తరుణంలో శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాలో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రభావంతో కర్ణాటకలో తమ పార్టీ గెలుగబోతున్నదని చెప్పారు.
శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలని హితవుపలికారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని మండిపడ్డారు. శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించబోరని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కరించారని వెల్లడించారు. కర్ణాటక తీర్పును కాంగ్రెస్ సాదరంగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
దేశంలో ఇవే ఫలితాలు
దేశంలో ఇవే ఫలితాలు రాబోతున్నాయని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలోనూ స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంఐఎం విధానాన్ని ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చిన జేడీఎస్ బీజేపీలో కలిసేందుకు ప్రయత్నిస్తున్నదని తెలిపారు. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.