Congress Karnataka | పార్టీ గెలుపు కోసం నాయకత్వం సమిష్టి కృషి ఏడాది ముందే పక్కాగా ఎన్నికల ప్రణాళికలు కలిసొచ్చిన పాదయాత్రలు బీజేపీ అవినీతిపై పోరులో సక్సెస్‌ రాహుల్‌, ప్రియాంక ప్రచారాలతో జోష్‌ సీఎం అభ్యర్థిత్వం సమస్యను దూరం పెట్టిన నేతలు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలకు దిక్సూచి కర్ణాటక విజయం కష్టకాలంలో ఉన్నప్పుడు.. గెలవాల్సింది పార్టీ.. అంతేకానీ.. పార్టీలోని నాయకులు కాదు! ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పార్టీ గెలిచిన తర్వాత.. అంతేకానీ.. ఎన్నికలకు వెళ్లే ముందు కాదు! ఈ […]

Congress Karnataka |

  • పార్టీ గెలుపు కోసం నాయకత్వం సమిష్టి కృషి
  • ఏడాది ముందే పక్కాగా ఎన్నికల ప్రణాళికలు
  • కలిసొచ్చిన పాదయాత్రలు
  • బీజేపీ అవినీతిపై పోరులో సక్సెస్‌
  • రాహుల్‌, ప్రియాంక ప్రచారాలతో జోష్‌
  • సీఎం అభ్యర్థిత్వం సమస్యను దూరం పెట్టిన నేతలు
  • అన్ని రాష్ట్రాల కాంగ్రెస్‌ నేతలకు దిక్సూచి కర్ణాటక విజయం

కష్టకాలంలో ఉన్నప్పుడు.. గెలవాల్సింది పార్టీ.. అంతేకానీ.. పార్టీలోని నాయకులు కాదు! ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది పార్టీ గెలిచిన తర్వాత.. అంతేకానీ.. ఎన్నికలకు వెళ్లే ముందు కాదు! ఈ సూత్రం పునాదిగా కాంగ్రెస్‌ నాయకత్వం కర్ణాటకలో బ్రహ్మాండమైన విజయాన్ని సొంతం చేసుకున్నది. వాస్తవానికి కర్ణాటక విజయం.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ నాయకత్వాలకు ప్రత్యేకించి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఒక మార్గదర్శనం లాంటిది అనడంలో సందేహం లేదు.

విధాత: ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు దారుణంగా కొట్టుకుపోయాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రచారం ఎందుకూ పనికిరాలేదు. కర్ణాటకలో బీజేపీ ఘోర పరాజయం చవిచూసింది. పక్కా పనితీరుతో, ఆచరణాత్మక ప్రణాళికలతో, సమిష్టి నాయకత్వంతో కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అందుకున్నది. కింది స్థాయి కార్యకర్తలు మొదలు.. రాష్ట్ర నాయకత్వం, పార్టీ అగ్ర నాయకులైన రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వరకూ.. అందరూ కీలక పాత్రధారులే. ఇది ఏ ఒక్కరి విజయం కాదు.. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త, ప్రతి నాయకుడు పార్టీని గెలిపించడమే ఏకైక లక్ష్యంగా పనిచేయడంతో సాధ్యమైనందుకు లభించిన ఫలితం.

కలిసొచ్చిన ముందస్తు సన్నాహాలు

కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఏడాది నుంచే ఎన్నికలకు సిద్ధమైంది. దాంతో ఎన్నికల ప్రచార ప్రణాళికను రూపొందించుకోవడానికి ఆ పార్టీకి కావల్సినంత సమయం దొరికింది. ఈ క్రమంలోనే పార్టీ క్యాడర్‌పై దృష్టిపెట్టడంతో క్షేత్రస్థాయిలో ఓటు షేరును పెంచుకోవడానికి అవకాశం కలిగింది. వాస్తవానికి 2019లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినప్పుడు పార్టీ కార్యకర్తలు నిరాశలోకి వెళ్లిపోయారు. అధికార కూటమిలోని కాంగ్రెస్‌, జేడీఎస్‌ సభ్యుల వరుస రాజీనామాలతో 15 నెలలకే ప్రభుత్వం కుప్పకూలింది. దొడ్డిదోవన బీజేపీ అధికారంలోకి వచ్చింది.

మెకెదాటు పాదయాత్రతో క్యాడర్‌లో ఉత్సాహం

మెకెదాటు మంచినీటి ప్రాజెక్టు సాధనకు కాంగ్రెస్‌ ఈ ఏడాది చేపట్టిన పాదయాత్ర కూడా పార్టీని ప్రజలకు చేరువ చేసింది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయి, క్యాడర్‌ నిరాశలో ఉన్న నేపథ్యంలో వారిలో తిరిగి చైతన్యం తెచ్చేందుకు ఏమైనా చేయగలమా? అని తనను రాహుల్‌ అడిగారని, ఆ క్రమంలోనే పాదయాత్ర చేపట్టామని డీకే శివకుమార్‌ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో చెప్పారు. ‘మేం పాదయాత్ర చేపట్టాం. మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రలో నడిచారు. ‘బెంగళూరుకు విద్యుత్తు, తాగునీటి కోసం చేపట్టిన యాత్ర కావడంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చింది’ అని ఆయన తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 75వ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించడం కూడా కలిసొచ్చిందని కాంగ్రెస్‌ నేత పీసీ విష్ణునాథ్‌ చెప్పారు. వీటితోపాటు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తమ కార్యకర్తలకు నైతిక బలాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తలను చైతన్యం చేసే క్రమంలో కాంగ్రెస్‌ నాయకత్వం బూత్‌ స్థాయిలో వారిని ఆర్గనైజ్‌ చేయడం కూడా విజయంలో ముఖ్య భూమిక వహించింది.

బీజేపీ అవినీతిని ఎండగట్టడంలో సక్సెస్‌

కర్ణాటకలో ఎన్నడూ లేనంత స్థాయి అవినీతి బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నదన్న విమర్శలు బలంగా వినిపించాయి. బీజేపీ నాయకులకు, అధికారులకు 40 శాతం కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నదని కర్ణాటక కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ చేసిన ఆరోపణను కాంగ్రెస్‌ సద్వినియోగం చేసుకున్నది. ఈ క్రమంలోనే ‘40% కమీషన్ల సర్కారు’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. ‘పేటీఎం’ తరహాలో ‘పేసీఎం’ అంటూ సీఎం బొమ్మను క్యూఆర్‌ కోడ్‌ మధ్యలో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా బోర్డులు పెట్టి.. బీజేపీ అవినీతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది.

ఫలించిన సంక్షేమ మంత్రం

ఉచితాలు, సంక్షేమ పథకాలపై బీజేపీ కూడా ఇబ్బడిముబ్బడిగా హామీలు ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌నే విశ్వసించారు. నిరుద్యోగులకు స్టయిపెండ్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఏదలకు ఉచితంగా ప్రతి నెల 10 కేజీల బియ్యం సరఫరా వంటి హామీలు పేదల్లో ప్రభావం చూపాయి.

ఐక్యతతో సాధ్యమైన విజయం

నిజానికి 2022లో సిద్ధరామయ్య, శివకుమార్‌ ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని ప్రకటించుకున్నప్పుడు కాంగ్రెస్‌ విజయావకాశాలపై ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. ఇద్దరూ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. అయితే కేంద్ర నాయకత్వం వెంటనే రంగంలోకి దిగి, ఇద్దరికీ నచ్చజెప్పింది. ఫలితంగా భారత్‌ జోడో యాత్ర సమయానికే ఇద్దరు నాయకులు ఐక్యతారాగం వినిపించారు. పార్టీ విజయానంతరం సీఎల్పీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. దాంతో పార్టీ మళ్లీ సర్దుకోగలిగింది.

Updated On 14 May 2023 5:01 AM GMT
Somu

Somu

Next Story