- విచారణకు మరో తేదీ ఇవ్వండి
- సుప్రీంకోర్టులో కేసు కారణాలతో ఈడీ అధికారులకు కవిత సమాచారం
- ఈడీ కార్యాలయంలో ఆమె తరఫున న్యాయవాదులు
- 11న విచారణకు సంబంధించిన డ్యాక్యుమెంట్స్ ఫ్రూఫ్స్ సమర్పణ
Delhi Liquor Case । ఢిల్లీ మద్యం కేసు విచారణలో భారీ ట్విస్ట్ చోటు చేసుకున్నది. మరికాసేపట్లో కవిత ఈడీ విచారణకు హాజరయ్యేందుకు బయటికి వస్తారని, మీడియాతో మాట్లాడి ఈడీ కార్యాలయానికి వెళతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఏకంగా తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు కవిత సమాచారం అందించారు. దీంతో ఈడీ అధికారులు పంపిన వాహనాలు కవిత బస చేసి ఉన్న కేసీఆర్ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయాయి.
విధాత: ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని ఈడీ (Enforcement Directorate) అధికారులకు ఎమ్మెల్సీ కవిత (MLC Kalvakuntla Kavitha) సమాచారం పంపారు. సుప్రీంకోర్టులో తన కేసు పెండింగ్‌లో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్న ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఈడీ అడిగిన పత్రాలను పార్టీ నేత, తన న్యాయవాది సోమా భరత్ ద్వారా పంపారు. దీనిపై స్పంధించిన ఈడీ నెల20వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీస్ లు జారీ చేసింది.
అరెస్టు చేస్తారా?
విచారణకు హాజరుకాలేనని, తనకు ఉన్న హక్కు మేరకు తన తరఫున న్యాయవాదిని పంపుతున్నానని కవిత పేర్కొన్న నేపథ్యంలో ఈడీ స్పందన ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కవిత పేర్కొన్న కారణాలను ఈడీ ఆమోదించక పోవచ్చునని, అదే జరిగితే విచారణకు హాజరు కావాల్సిందేనని ఆమెపై ఒత్తిడి చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అయినప్పటికీ ఆమె విచారణకు రాని పక్షంలో ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతున్నది. అరెస్టు చేసేందుకు అవకాశాలు లేకపోలేదని కూడా పలువురు న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Case) ఈ రోజు ఈడీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉన్నది. ఉదయం 11.30 గంటల వరకు కవిత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర కీలక నేతలతోపాటు తన లాయర్లతో భేటీ అయ్యారు. అనంతరం ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాననని, అది పెండింగ్‌లో ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేనని తెలిపారు.
సుప్రీంకోర్టు (Supreme Court) లో తాను ముఖ్యమైన విషయాలు లేవనెత్తానని, ఒక సాక్షిగా, మహిళగా తనకు ఉన్నటువంటి హక్కులు పరిరక్షించుకోవాల్సి అవసరం ఉన్నదని ఆమె పేర్కొన్నారు. సీఆర్‌పీసీ లో ఉన్నసెక్షన్ 160 ప్రకారం తాను నేరుగా విచారణకు హాజరుకావడంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు చెప్పామన్నారు. ఆ కేసు పెండింగ్‌లో ఉన్నదని అప్పటి వరకు విచారణను వాయిదా వేయాలని ఈడీ అధికారులకు కవిత ఈ మెయిల్ ద్వారా సమాచారం పంపినట్టు తెలుస్తోంది.
ఇదే సమయంలో కవిత న్యాయవాది భరత్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం ఈడీ కార్యాలయానికి చేరుకుని సంబంధిత పత్రాలను అధికారులకు అందజేశారు. ఈ నెల 11న విచారణ సందర్భంగా కవిత ఈడీ అధికారులకు అనేక అంశాలపై వివరణ ఇచ్చారు.
ఈ సమాధానాలకు సంబంధించిన డాక్యూమెంట్ ఫ్రూఫ్‌లను కవిత ఈడీ అధికారులకు పంపినట్టు న్యాయ నిపుణవర్గాలు వెల్లడించాయి. అందుకే ఈ రోజు తాను విచారణకు హాజరుకాలేకపోతున్నానని, తనకు మరో తేదీని ఇవ్వాలని కవిత అందులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
దీనిపై ఈడీ అధికారులు ఇప్పటివరకు కవితకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ప్రస్తుతం కవిత తరఫున న్యాయవాదుల బృందం ఈడీ కార్యాలయంలో డాక్యుమెంట్లు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోమా భరత్.. ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లో కవిత ఈడీ ఎదుట హాజరుకాలేరని తెలిపారు.
మహిళలను విచారించే సమయంలో ఈడీ అధికారులు నిబంధనలు పాటించలేదని, ఇంటికి వచ్చి విచారణ జరపకుండా కార్యాలయానికి పిలిచారని, ఆరు గంటల సమయం మాత్రమే ప్రశ్నించాల్సి ఉన్నప్పటికీ.. సుదీర్ఘంగా విచారించారని ఆరోపించారు.
ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకుంటామన్న సీజేఐ విచారణపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, వెంటనే విచారించేందుకు కూడా సుప్రీం నిరాకరించింది. పిటిషన్‌పై ఈ నెల 24న వాదనలు వింటామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
లేఖలో ఏమున్నదంటే..
చట్టంలో తనకు ఉన్న రక్షణల మేరకు విచారణకు హాజరుకావటం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్‌కు లేఖ పంపారు. ఈ రోజు విచారణకు తన ప్రతినిధిని పంపుతున్నట్టు అందులో పేర్కొన్నారు. చట్టం ప్రకారం తనను విచారణ కోసం నేరుగా ఈడీ కార్యాలయానికి పిలవ కూడదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
ఆడియో/వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు తను ఎల్లప్పడూ సిద్ధంగా ఉంటానని అందులో తెలిపారు. అందుకే గతంలో ఈడీ అధికారులను తన నివాసానికి ఆహ్వానించినట్టు గుర్తు చేశారు. తన విజ్ఞప్తిని తిరస్కరించినందున విచారణ కోసం 11వ తేదీన ఈడీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. ఆరోజు విచారణలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు. ఆ సమయంలో సమన్లలో పేర్కొనక పోయినా తన ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు.. తాను స్వచ్ఛందంగానే ఫోన్‌ను అప్పగించానని రాసుకున్నారని పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా పొద్దుపోయిన తర్వాత కూడా ఈడీ ఆఫీసులో ఉన్నానని, రాత్రి 8.30 గంటల సమయంలో తనను వెళ్లవచ్చని చెప్పి, 16వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. అందులో ‘వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా హాజరుకావచ్చని పేర్కొన్నారన్న కవిత.. అందుకే తన ప్రతినిధిగా సోమా భరత్‌కుమార్‌ను పంపుతున్నానని తెలిపారు.
11వ తేదీన విచారణకు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన ఇతరులతో కలిసి విచారిస్తామని చెప్పినా.. అటువంటిదేమీ జరుగకపోవడం ఆశ్చర్యకరమని కవిత తెలిపారు. తాము ప్లాన్లు మార్చుతామని దర్యాప్తు అధికారిణి చెప్పడంతో మొత్తం దర్యాప్తు ప్రక్రియపైనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.
అందుకే నాకు ఉన్న హక్కులను ఉపయోగించుకుని విచారణకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయడంపై తాను వేసిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అది పూర్తయిన తర్వాత విచారణకు పిలవాలని కోరారు.