HomelatestKazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని.. ఎన్నికల ఎజెండాగా మార్చిన ప్రధాన పార్టీలు

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని.. ఎన్నికల ఎజెండాగా మార్చిన ప్రధాన పార్టీలు

Kazipet |

  • రాజకీయ ప్రయోజనమే ఏకైక లక్ష్యం
  • బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పై విమర్శలు
  • అధికారంలో ఎవరున్నా ఇదే జాప్యం
  • దశాబ్దాలుగా కాజీపేటకు అదే శాపం
  • నేతల పర్యటనలతో పరస్పర విమర్శలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాజీపేట (Kazipet) లో రైల్వేపరిశ్రమల ఏర్పాటును మూడు ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్నికల ఎజెండాగా మార్చివేశాయి. అధికారంలో ఎవరన్నా ఒకే తీరుగా వ్యవహరిస్తూ పరస్పరం విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా అవసరమైన శ్రద్ధ పెట్టాలనేది నేతలు మరిచిపోయారు. ఎన్నికల ప్రయోజనముంటేతప్ప ఎజెండా పైకి తీసుకరావడం అధికార పార్టీలకు రివాజుగా మారింది.

రాజకీయ అవసరం పడితేనే అధికార పార్టీల నాయకులకు కోచ్​ ఫ్యాక్టరీ యాదికొస్తున్నది. చర్వితచరణంగా తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చిరకాల ప్రజాకాంక్షను ఓట్లకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోరాటం ద్వారా సమస్య పరిష్కారమైతుందని భావించే కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా, కార్మిక, రైల్వే సంఘాలు వీరి వలలో చిక్కుకుంటున్నాయి.

ఇటీవల బీజేపీ నాయకుడు నిరుద్యోగ మార్చ్‌కు బండిసంజయ్ హాజరైన సందర్భంగా, కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క పాదయాత్ర, తాజాగా మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కోచ్‌ఫ్యాక్టరీ అంశాన్ని అధికార, విపక్షాలు లేవనెత్తాయి. దీనికి దీటుగా కేటీఆర్ ప్రతి విమర్శ చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ హనుమకొండ పర్యటన సందర్భంగా కోచ్‌ఫ్యాక్టరీ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు వేదికైంది.

ఆరు నెలలుగా పరస్పర విమర్శలు

గత ఆరు నెలలుగా మరోసారి కాజీపేటలో రైల్వే పరిశ్రమల ఏర్పాటు ను అన్ని రాజకీయ పక్షాలు కల్పి పట్టాలెక్కించాయి. ప్రస్తుతం కాంగ్రెస్, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా వరంగల్లో పర్యటిస్తే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఊసేత్తకుండా వారి ఉపన్యాసాలు సాగడం లేదు

ముఖ్యంగా బీజేపీపై బీఆర్ఎస్ పై బీజేపీ రెండు పార్టీలపై కాంగ్రెస్, ఇతర ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల కాజీపేటలో జరిగిన ధర్మదీక్ష శిబిరంలో అధికార పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ నాయకుల విమర్శలతోనే ముగిసిపోయింది. ఈ వేదికను కూడా తమ ఆధిపత్యానికి అనువుగా మార్చుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

రాజకీయ ఎ‘జెండా’గా కోచ్​ ఫ్యాక్టరీ

దశాబ్దంన్నర కాలంగా కోచ్​ ఫ్యాక్టరీ రాజకీయ ఎజెండాగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీతో బీఆర్​ఎస్​ అంటకాగినంత సేవు ఈ విషయాన్ని మరుగుపడిందనే ఆరోపణలున్నాయి. అయితే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దాస్యం వినయ్ భాస్కర్ మాత్రం ఈ అంశాన్ని విడిచిపెట్టకుండా బీజేపీపై ఒత్తిడి చేసే ప్రయత్నం మాత్రం కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్​ఎస్ పార్టీ కాంగ్రెస్​ను లక్ష్యంగా చేసుకుని అడుగులు ముందుకు వేసి సఫలీకృతమైంది.

ముఖ్య2018లో జరిగిన పార్లమెంట్​ ఎన్నికల్లో టీఆర్​ఎస్​కు అనుకూలంగా విభజన హామీలు, కోచ్​ ఫ్యాక్టరీని ఎజెండా చేసి కాజీపేట కేంద్రంగా పోరాటాన్ని ఎక్కుపెట్టారు. బీజేపీ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పోరాటం చేపట్టామని ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత షరా మాములుగా ప్రాధాన్యత మారిపోయి పోరాటం నీరుగారి పోయింది.

వరంగల్​ కార్పొరేషన్​ ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని కేంద్రీకృతం చేసి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వామ్యం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించి ఒక దశలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి ఆఖరి నిమిషంలో వెనుకంజ వేసి ఉద్యమాన్ని చల్లార్చారు.

ఇప్పుడు బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందినతర్వాత మళ్ళీ ఎన్నికలు రానున్నందున నెమ్మదిగా కోచ్‌ఫ్యాక్టరీని పట్టాలెక్కిస్తున్నారు.

అధికార పార్టీల ఆటలో ‘కోచ్’పావు

తాజాగా రాష్ట్రంలో బీజేపీ, బీఆర్​ఎస్​ మధ్య అధికార జూదానికి ఆరాటం పెరిగిన నేపథ్యంలో మరోసారి ‘కోచ్’ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో చీఫ్‌విప్​ వినయ్​ బీజేపీపై విమర్శలు పెంచారు. దీనికి కౌంటర్​గా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

బీఆర్​ఎస్​ భూమి కేటాయించకుండా జాప్యం చేస్తుందంటూ ప్రతివిమర్శ చేశారు. మూడు పార్టీల రాజకీయ క్రీడలో కోచ్​ ఫ్యాక్టరీ, స్థానిక ప్రజల ఆశలు గల్లంతైతున్నాయి. విచిత్రం ఏమిటంటే బీజేపీ రాష్ట్రంలో విపక్ష పార్టీగా విమర్శలు చేస్తున్నప్పటికీ కేంద్రంలో అధికార పార్టీగా కొనసాగుతున్నామని అంశాన్ని అవసరానికి అనుకూలంగా విస్మరించడం విచిత్రం.

ఈ నేపథ్యంలో మరోసారి పోరాటానికి కార్యాచరణ చేపట్టాలని బీఆర్ఎస్ సిద్ధమైతున్నట్లు భావిస్తున్నారు. ఈ తరుణంలోకాంగ్రెస్ రెండు పార్టీలు బీజేపీ, బీఆర్​ఎస్​ పై ఒత్తిడి తెస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవాలనే ​పార్టీలో అభిప్రాయం వ్యక్తమైతుంది.

ఇదిలాఉండగా తమ ఓట్ల ప్రయోజనం నెరవేరగానే కాడెత్తేయడం ఈ పార్టీల నేతలకు అలవాటైందంటున్నారు. అందుకే అప్రమత్తతతో వ్యవహరించాలని ఇతర పక్షాలకు సూచిస్తున్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న రాజకీయ పక్షాలు, సంఘాలు మరో ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular