- ప్రగతి భవన్‌లో అమరుల కుటుంబాలకే దిక్కులేదు ..
- నమ్మితే గొంతుకోసే కుటుంబం కేసీఆర్‌ది
- స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి
KCR cheated Bapuji himself: Revanth Reddy
విధాత : సిరిసిల్ల సభ అంటే భయపడ్డాను, మంత్రి కెటిఆర్‌కు భయపడి సభకు ఎవరూ రారని అనుకున్నా కాని ఇక్కడి జనాన్ని చూస్తే అత్యధికంగా హాజరయ్యారని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గం పద్మా నగర్ నుంచి సిరిసిల్ల నేతన్న చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించి, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
బాపూజీ చనిపోతే…
తొలి తెలంగాణ ఉద్యమంలో నేతన్నల బిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి హోదాను త్యాగం చేసిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. అప్పటి నుంచి తెలంగాణ వచ్చే వరకు బాపూజీ ఏ పదవి తీసుకోకుండా నిరంతరం తెలంగాణ కోసం పరితపించారన్నారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పెడతాను అంటే, సచివాలయం ఎదురుగా ఉన్న జలదృశ్యంను కార్యాలయం కోసం ఇచ్చి, ఆశీర్వదించారన్నారు. అలాంటి నాయకుడు చనిపోతే కనీసం దండ కూడా వేయని దుర్మార్గుడు, నీచుడు సిఎం కెసిఆర్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
కాపలా కుక్కగా ఉంటానన్న కేసీఆర్.. పిచ్చికుక్కలా…
2001 నుంచి 2009 వరకు కెసిఆర్ పార్టీకి డబ్బులు ఇచ్చి, ఆయన వాహనానికి డీజిల్ పోయించిన కె.కె.మహేందర్ రెడ్డికి సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా కెటిఆర్‌కు ఇచ్చి మోసం చేశారన్నారు. పదిహేను సంవత్సరాలు ఎంత కష్టమొచ్చినా, ఆస్తులు కరిగిపోయినా కె.కె మీకు తోడుగా ఉంటున్నారన్నారు. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ పిచ్చి కుక్కలా మారి కరుస్తున్నాడన్నారు. అలాంటి కుక్కను వచ్చే ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టాలన్నారు. ఇసుక మాఫియాకు అడ్డు వచ్చిన దళితులను పోలీసుల బూట్ల కింద మంత్రి కెటిఆర్ నలిపేస్తున్నాడన్నారు.
ప్రగతిభవన్‌కి ప్రజలని రానివ్వని కేటీఆర్
పార్లమెంటులో తెలంగాణ బిల్లును ఆమోదించిన స్పీకర్ మీరా కుమార్ సిరిసిల్లకు వస్తే అవమానించిన దుర్మార్గుడు కెసిఆర్ అన్నారు. నేరెళ్ల దళితుల దాడిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ నివేదికను బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్ని రోజుల్లో నివేదిక బయటపెడతావు, ఎప్పటిలోగా దాడులు చేయించిన వారిని శిక్షిస్తావో చెప్పాలని సంజయ్‌ను ప్రశ్నించారు. నాలుగు కోట్ల మంది నా కుటుంబ సభ్యులు అని చెబుతున్న డ్రామారావు ప్రగతి భవన్ కు ప్రజలను ఎందుకు రానివ్వడం లేదని, 1500 మంది అమరుల కుటుంబాల్లో ఒక్కరిని కూడా పిలిచి భోజనం ఎందుకు పెట్టడం లేదని రేవంత్ అడిగారు.
కేటీఆర్ మీ ప్రాంత వాడు కాదు..
భోజనం పెట్టలేనోడివి నీవు తెలంగాణ బిడ్డ ఎలా అవుతావని ప్రశ్నించారు. ఉద్యమకారులు ఆస్తులు, బిడ్డలను పోగొట్టుకుంటే డ్రామారావులకు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ వచ్చేందుకు గేట్లు బద్దలు కొడితేనే తెలంగాణ బిడ్డవు అవుతావని డ్రామారావుకు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా చింతమడక నుంచి వచ్చిన కెటిఆర్ మీ ప్రాంత వాడు కాదని అన్నారు. నమ్మితే ప్రాణాలు ఇచ్చే గుణం తెలంగాణ వాసులకు ఉందని, నమ్మితే గొంతు కోసే రకం కెసిఆర్ కుటుంబానిదని అన్నారు.