Tuesday, January 31, 2023
More
  Homelatestఅన్ని పార్టీల్లో KCR కోవర్టులు: ఈటల సంచలన వ్యాఖ్యలు

  అన్ని పార్టీల్లో KCR కోవర్టులు: ఈటల సంచలన వ్యాఖ్యలు

  • KCR విష కౌగిలిలో తెలంగాణ‌ పార్టీలు
  • ఎప్పటికప్పుడు BRS అధినేతకు సమాచారం
  • పార్టీలో ఉంటూ అసమ్మతి రాగాలు
  • ఎన్టీఆర్ ట్రస్టు భవన్ విషయాలు కూడా..

  విధాత‌, హైదరాబాద్: తినేది మొగుడి సొమ్ము పాడేది…. పాట అనే సామెత తెలంగాణలో సుపరిచితం. అదే విధంగా తమ పార్టీలో ఉంటూ అధికార పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారనే మాటలు కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. తెలంగాణలో అన్నం పెడుతున్న పార్టీకి సున్నం పెడుతున్న నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు.

  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికార భారత రాష్ట్ర సమితి (పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి) అధినేత కె.చంద్రశేఖర్ రావు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లో కోవర్టులను నియమించు కున్నారని నిన్న మొన్నటి వరకు విన్నాం. కాని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే, పూర్వ తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య నాయకుడు ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. అన్ని పార్టీల్లో ఆయనకు కోవర్టులు ఉన్నారని, ఏ పార్టీ అతీతం కాదని ప్రకటించడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నది.

  ఈటల రాజేందర్ టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నెపం నెట్టి బహిష్కరించిన విషయం కూడా తెలిసిందే. ఆ తరువాత ఆయన బిజెపిలో చేరి సర్వశక్తులు ఒడ్డి హుజూరాబాద్ నుంచి విజయం సాధించారు.

  ఈటల రాజేందర్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు పై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు రాజకీయ వర్గాలు, ప్రజల్లో నానుతున్న మాటలను నిజమనే విధంగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బిజెపి, టిడిపిలో కెసిఆర్ కు నమ్మినబంట్లు, కోవర్టులు ఉన్నారన్నారు. వారు తమ పార్టీలో పనిచేస్తూనే ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ అధినేతకు సమాచారం చేరవేస్తారని తెలిపారు.

  ఇలా ఎందుకు చేస్తున్నారనే విషయం అధిష్టానానికి తెలియదా అంటే తెలియకపోవచ్చు. తెలిసినా ఏమి చేయలేని స్థితిలో ఉండవచ్చు. ఉదాహ‌రణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే పలు సందర్భాలలో పీసీసీ అధినేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోవర్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, పార్టీ జెండా కింద ఎదిగిన నాయకులు కోవర్టులుగా పనిచేసే బదులు బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవచ్చంటూ ప్రకటనలు చేశారు.

  ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి సమాచారం చేరవేయడం అంటే అన్నం పెట్టే పార్టీకి సున్నం పెట్టడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికి మీరు చేసింది చాలు, కాంగ్రెస్ పార్టీపై ఇష్టం లేనట్లయితే వెళ్లిపోవచ్చని రేవంత్ స్పష్టం చేశారు. అయినప్పటికీ పార్టీలో ఉంటూ అసమ్మతి రాగాలు తీయడం, రేవంత్ కు పొగబెట్టడం, పత్రికలకు ఎక్కి పరువుతీయడం చేస్తునే ఉన్నారు.

  పార్టీ వీడకుండా రేవంత్‌ను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో సుమారు రెండు డజన్ల మందికి పైగా ముఖ్యనాయకులు కోవర్టులుగా పనిచేస్తున్నారని, వారికి ప్రతినెలా కొంత మొత్తం ఫించన్ రూపంలో అందుతున్నదని కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మరికొందరికి ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.

  తెలుగుదేశం పార్టీలో కూడా బిఆర్ఎస్ కోవర్టులు ఉన్నారు. చాపకింద నీరులా వారు ఇప్పటికీ పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వచ్చినా కోవర్టులు మాత్రం తమ పని ఇంకా కొనాసాగిస్తునే ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగే కార్యకలాపాలు, ముఖ్య విషయాలు ఎప్పటికప్పుడు కేసీఆర్కు చేరుతున్నాయని అంటున్నారు.

  నిన్న మొన్నటివ‌ర‌కు ఇక్కడి పార్టీలో అధినేతగా ఉంటూ ఫిరాయించి పెద్ద పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా తెలంగాణ టిడిపి నాయకత్వం కోవర్టుల విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఇళ్లు చక్కదిద్దుకుంటే మంచిదని తమ్ముళ్లు అంటున్నారు.

  ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణలో మాత్రం సిఎం కెసిఆర్ కుటుంబంపై కస్సు బుస్సుగా ఉంది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నిత్యం కెసిఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాదే ఎన్నికలు ఉండడంతో బండి సంజయ్ దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా చెలరేగుతున్నారు. అయితే ఈ పార్టీలో కూడా కెసిఆర్ కోవర్టులు గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తున్నారనే వాదన ఉంది.

  ఇప్పటికే బిజెపి జాతీయ నాయకత్వం కొందరు నాయకులను పక్కన పెట్టింది. మేమే తెలంగాణ నాయకులం అని గొప్పలు చెప్పుకున్న వారిని రాష్ట్ర పార్టీ కార్యాకలాపాలకు దూరం పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కూడా కార్యకర్తలు చర్చించుకుంటున్న అంశం ఏమంటే విమర్శలు చేయడం కాదు కెసిఆర్ ను అష్ట దిగ్భంధనం చేయడంలో విఫలమయ్యారంటున్నారు.

  పత్రికల్లో విమర్శలు చేయడం వల్ల ప్రతిష్ట మసకబారవచ్చని, చట్టపరంగా శిక్షించే అవకాశం లేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ధరణి ఫోర్టల్‌లో రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఈ విషయంపై ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, టీడీపీలో కేసీఆర్ అనుకూల, వ్యతిరేక గ్రూపులు పనిచేస్తున్నాయనేది ఈటల రాజేందర్ విమర్శలను బట్టి స్పష్టమవుతున్నది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular