విధాత: జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలను చూశాం. వీటికి ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలని అది రైతు ప్రభుత్వం కావాలని ఆయన కోరుకుంటున్నారు. అదే తెలంగాణ నమూనా ప్రభుత్వం దేశంలో రావాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
ఇక్కడ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, ఇక్కడి రైతులకు అందుతున్న సాగునీటి ఫలాలు దేశవ్యాప్తంగా రైతులకు అందాలని కేసీఆర్ అనేక సందర్భాల్లో చెబుతున్నారు. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా జాతీయ రైతు సంఘం నేత గుర్నాంసింగ్‌ను నియమించారు.
అలాగే రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అంటున్నా.. దానికోసం కూడా కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం. జనవరిలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన నూతన సచివాలయం ప్రారంభించి ఎన్నికలకు వెళ్లొచ్చు అంటున్నారు.
మునుగోడు ఫలితం తర్వాత విపక్షాలు బలపడకముందే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఒకవైపు జాతీయ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రణాళికలు, కార్యాచరణ రూపొందిస్తుంటే ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ మాత్రం బీఆర్ఎస్ గురించి బైట పెద్దగా మాట్లాడటం లేదు.
కేటీఆర్ కాబోయే సీఎం అని కొంతకాలం కిందట ప్రచారం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ మధ్య కొన్నిరోజుల పాటు టీవీల్లో పెద్ద చర్చే జరిగింది. కారణాలు ఏమిటో తెలియదు. కానీ ఆ ప్రయత్నం జరగలేదు. కానీ ఈసారి ఎన్నికల తర్వాత తగిన మెజారిటీ వస్తే ఆయనే సీఎం అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అందుకే ఆయన రాష్ట్ర రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు తప్పా జాతీయ రాజకీయాల గురించి గాని, బీఆర్ఎస్ గురించి గాని ఎక్కడా ప్రస్తావించడం లేదు. తాను జాతీయ రాజకీయాలవైపు వెళ్లిన తన తనయుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారిస్తాడనే సంకేతాన్ని కేసీఆర్ పరోక్షంగా ఇస్తున్నారా? అందుకే కేటీఆర్‌ను బీఆర్ఎస్ కార్యకలాపాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ చేయనివ్వడం లేదా? ఇదంతా ఆయన వ్యూహంలో భాగమా? అంటే అవుననే అంటున్నారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీలో తెలంగాణ ఆత్మ లేదని విపక్ష నేతలు విమర్శిస్తున్న వేళ కేసీఆర్ కావాలనే కేటీఆర్‌ను బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతున్నట్టు కనిపిస్తున్నది. ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకుని రావడం, కేటీఆర్‌కు పాలనా పగ్గాలు అప్పగించడం, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్తో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోటీ చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారని అంటున్నారు.
ఇందులో భాగంగానే కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో కేటీఆర్ మినహా అందరూ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నా.. కేటీఆర్ మాత్రం వారిలా పెద్దగా స్పందించడం లేదు. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే కేటీఆర్ దీనిపై పెద్దగా స్పందించడం లేదనే చర్చ జరుగుతున్నది. అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి.. కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు.