Rahul Gandhi | బీజేపీ సర్కారుకు.. బీఆరెస్‌ అండ! మోదీ కోరుకున్నప్పుడల్లా కేసీఆర్‌ మద్దతు అందుకే కేసీఆర్‌ అవినీతిపై కేసులు లేవు బీఆరెస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ సమితి తెలంగాణ హామీ ఇచ్చి.. నెరవేర్చిన సోనియా సోనియా ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గరు కాంగ్రెస్‌ సర్కారులో ఆరు హామీల అమలు రాష్ట్రం ఇస్తే కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి కాంగ్రెస్‌ పోరు.. బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎంపై అవి వేర్వేరుగా కనిపించినా.. చేసేది […]

Rahul Gandhi |

  • బీజేపీ సర్కారుకు.. బీఆరెస్‌ అండ!
  • మోదీ కోరుకున్నప్పుడల్లా కేసీఆర్‌ మద్దతు
  • అందుకే కేసీఆర్‌ అవినీతిపై కేసులు లేవు
  • బీఆరెస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ సమితి
  • తెలంగాణ హామీ ఇచ్చి.. నెరవేర్చిన సోనియా
  • సోనియా ఇచ్చిన మాటపై వెనక్కి తగ్గరు
  • కాంగ్రెస్‌ సర్కారులో ఆరు హామీల అమలు
  • రాష్ట్రం ఇస్తే కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది
  • కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి
  • కాంగ్రెస్‌ పోరు.. బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎంపై
  • అవి వేర్వేరుగా కనిపించినా.. చేసేది ఒక్కటే
  • కాంగ్రెస్‌ విజయ భేరి సభలో రాహుల్‌ గాంధీ

విధాత: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ మూడు రాజకీయ పార్టీలపై పోరాడుతున్నదని ఆ పార్టీ ముఖ్యనేత రాహుల్‌గాంధీ చెప్పారు. తెలంగాణలో బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎం.. ఈ మూడు కలిసి పనిచేస్తున్నాయని, వాటిపై కాంగ్రెస్‌ పోరాడుతున్నదని అన్నారు. ‘ఎవరితో పోరాడుతున్నాం? మన ఎదుట నిలబడి ఉన్న శక్తి ఏమిటి? అనే విషయం అర్థం చేసుకోవడం రాజకీయాల్లో ఎంతో అవసరం. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్క బీఆరెస్‌తోనే పోరాడటం లేదు. బీఆరెస్‌తోపాటు.. బీజేపీ, ఎంఐఎంతో కూడా పోరాడుతున్నాం. ఇవి పైకి వేర్వేరు పార్టీలుగా కనిపిస్తున్నా.. అవి కలిసే పనిచేస్తున్నాయి’ అని చెప్పారు.

తాను లోక్‌సభలో బీఆరెస్‌ వ్యవహారాన్ని నేరుగా చూశానన్న రాహుల్‌.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎప్పుడు అవసరం ఎదురైతే అప్పుడు బీఆరెస్‌ మద్దతుగా నిలిచిందని విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో, జీఎస్టీ విషయంలో మోదీకి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం పార్టీలు వేర్వేరు కార్యక్రమాలు పెట్టుకున్నాయని అన్నారు. కానీ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నదన్న రాహుల్‌.. కాంగ్రెస్‌ను ఎవరూ ఏమీ చేయలేరని ఈ సభ నిరూపిస్తున్నదని చెప్పారు.

దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకుల్లో ఎవరోఒకరిపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెడుతున్నారన్న రాహల్‌.. ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తు చేశారు. ఎంఐఎం పైనా కేసులు లేవని చెప్పారు. ప్రధాని మోదీ తన సొంత మనుషులపై కేసులు పెట్టరని, అందుకే కేసీఆర్‌, ఒవైసీలపై ఎలాంటి కేసులు లేవని విమర్శించారు. వారిద్దరినీ తన సొంత మనుషులుగా మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. బీఆరెస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధువు) సమితి అని రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు.

సోనియా మాట ఇస్తే నిలబెట్టుకుంటారు

సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తామని చెప్పిన సోనియాగాంధీ.. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం మీరు నెత్తురు చిందించారో, బలిదానం చేశారో.. ఆకాంక్షలను నెరవేర్చారని చెప్పారు. తాము ఇక్కడి పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు బాగుపడాలని తెలంగాణ ఇస్తే.. వారికి బదులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ నుంచి బాగుపడుతున్నదని విమర్శించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే బాగుపడిందని రాహుల్‌గాంధీ విమర్శించారు. కానీ.. తాము ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కేసీఆర్‌ కుటుంబం బాగుపడటానికి కాదని స్పష్టం చేశారు. ఇక్కడి పేద ప్రజలు, రైతులు, కార్మికులు, బలహీనవర్గాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ.. గడిచిన 9 ఏళ్లలో పేదలు, రైతులు, కార్మికులు, మహిళలకు, చిన్న వ్యాపారులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని గ్యారెంటీ ఇచ్చామని, ఆనాడు సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇక్కడ ఉన్నామని చెప్పారు.

అతి త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు

బీఆరెస్‌ సర్కారును ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని రాహుల్‌గాంధీ చెప్పారు. దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. ‘ఈ సర్కారు అతి త్వరలోనే మారబోతున్నది. ప్రజలు తరిమికొట్టబోతున్నారు. మోదీ, ఒవైసీ.. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని చెప్పారు.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆరు గ్యారెంటీలు

తెలంగాణ గ్యారెంటీ ఇచ్చి అమలు చేసిన పార్టీగా తాము ఈ రోజు ఆరు హామీలు ఇస్తున్నామని రాహుల్‌ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద.. సొంతిల్లు లేనివారికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షలు ఇస్తామని, తెలంగాణ కోసం కొట్లాడినవారికి 250 గజాల స్థలం ఇస్తామని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ వెయ్యి రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నారన్న రాహుల్‌.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500కే సిలిండర్‌ ఇస్తామని ప్రకటించారు.

కర్ణాటకలో మహిళలు ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, అదే విధంగా తెలంగాణలో మహిళలకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు అందిస్తామని ప్రకటించారు. యువకులకు ఐదు లక్షల వరకూ కోచింగ్‌ ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

తమ ప్రభుత్వంలో పెన్షన్లను రూ.4వేలకు పెంచబోతున్నామని ప్రకటించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రతి ఒక్కరికీ పది లక్షల ఆరోగ్య బీమా వర్తింపచేస్తామని తెలిపారు. చివరిగా.. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15వేల చొప్పున అందిస్తామని, అదే సమయంలో రైతు కూలీలకు 12వేలు అందిస్తామని ప్రకటించారు.

మా హామీలపై కర్ణాటకలో అడగండి..

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చబోదని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పారన్న రాహుల్‌.. ‘మేం కర్ణాటకలో గ్యారెంటీ ఇచ్చాం.. క్యాబినెట్‌ కొలువుదీరగానే ఐదు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చాం.. చెప్పినట్టుగానే తొలి క్యాబినెట్‌ సమావేశంలోనే అమలు చేశాం. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకాగానే.. ఇప్పుడు ఇచ్చి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు.

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి

బీఆరెస్‌ సర్కారు ఏళ్ల తరబడి ప్రజల సొమ్ము దోచుకున్నదని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఇక ధరణి పోర్టల్‌ కుంభకోణం ద్వారా ప్రజల భూములు లాక్కున్నారని ఆరోపించారు. దళితులను కూడా వదల్లేదని అన్నారు. రైతుబంధు పేరుతో పెద్ద రైతులకే లాభం కలిగిందని చెప్పారు. పేదలకు ఇళ్లిస్తామన్న బీఆరెస్‌ ప్రభుత్వం ఎంత మందికి ఇచ్చిందని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్లు లీక్‌ అయ్యాయని విమర్శించారు.

రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ ప్రజల సొమ్ము దోచుకునేందుకు అనుసరించిన వివిధ మార్గాలని ఆరోపించారు. ఇక తమ ప్రభుత్వం రాబోతున్నదని, బీఆరెస్‌ సర్కారు దోచుకున్న సొమ్మును కాంగ్రెస్‌ సర్కారు వాపస్‌ ఇవ్వబోతున్నదని ప్రకటించారు. తాము ఇచ్చిన హామీలపై పొరుగునే ఉన్న కర్ణాటకలో అడగాలన్న రాహుల్‌.. ఎవరిని అడిగినా.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పింది చేసి చూపిందనే చెబుతారని అన్నారు.

అదానీ కోసమే మోదీ..

అదానీకి లాభం చేకూర్చేందుకే మోదీ పనిచేస్తారని రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రతి కంపెనీలో అదానీకి లాభం చేయడం కోసమే ఆలోచిస్తారని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ ఎదిగాడని చెప్పారు. తాను అదానీ గురించి పార్లమెంటులో అడిగితే.. తన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. మోదీ ఎలాతైతే అదానీ కోసం పనిచేస్తారో.. ఇక్కడ కేసీఆర్‌ తన కుటుంబ లాభం కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తిని, ప్రభుత్వ సొమ్మును కుటుంబానికి పంచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీకి, కేసీఆర్‌కు భాగస్వామ్యం ఉన్నదని రాహుల్‌గాంధీ ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతిపై అనేక ఉదాహరణ చెప్పానన్న రాహుల్‌.. ఇంత జరుగుతున్నా కేసీఆర్‌ అవినీతిపై మోదీ సర్కార్‌ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అవసరం ఉన్న సమయంలో కేసీఆర్‌ బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తారని మోదీకి తెలుసు కాబట్టే ఆయనపై చర్యల్లేవని ఆరోపించారు. మరోవైపు తాము ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటామో.. అక్కడ ఎంఐఎం వచ్చి ఇబ్బంది పెడుతుందని రాహుల్‌ విమర్శించారు. ఇదీ ఆ మూడు పార్టీల పార్టనర్‌షిప్‌ అని ఎద్దేవా చేశారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. వారికే నష్టం చేస్తున్నదని రాహుల్‌ విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలు, గిరిజనులు, దళితులు, బలహీనులు, రైతులు, బలహీనవర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. తమ ద్వారాలు అందరికీ తెరిచే ఉంటాయని అన్నారు. బీజేపీ దేశంలో హింసను, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నదని రాహుల్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ మాత్రం ప్రేమ, ఐక్యత, సద్భావనతో ఉండాలని కోరుకుంటున్నదని తెలిపారు. అందుకే తాను ‘మేం విద్వేష బజార్‌లో ప్రేమ దుకాణం తెరిచాం’ అని చెబుతూ ఉంటానని అన్నారు. తెలంగాణను ఇచ్చాం.. ఇప్పుడు ఇచ్చిన ఈ ఆరు గ్యారెంటీలను కూడా నెరవేర్చితీరుతామని, అందుకు కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌న్న‌దే నా స్వ‌ప్నం: సోనియా గాంధీ

అధికారంలోకి రాగానే మ‌హా ల‌క్ష్మితో మొద‌లుపెట్టి అన్ని హామీలు అమ‌లు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స‌భికుల హ‌ర్ష‌ద్వానాల మ‌ధ్య ప్ర‌క‌టించారు. మ‌హా ల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ. 2500 ఇస్తామ‌న్నారు. అలాగే రూ. 500 గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తామ‌న్నారు. అలాగే ఆర్టీసీ బ‌స్సుల్లో ప్ర‌తి మ‌హిళ‌కు బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తామ‌న్నారు.

ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేస్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాతో పాటు నా స‌హ‌చ‌రులంతా కార‌ణ‌మ‌న్నారు. ఇప్ప‌డు మా వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లంతా ఉన్న‌త స్థాయిలో ఉండాల‌న్న‌దే త‌మ అభిమ‌త‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప‌గా ఉన్న‌త స్థాయికి తీసుకు పోతామ‌న్నారు.

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌న్న‌దే త‌న‌ స్వ‌ప్న‌మ‌న్నారు. స‌మాజంలో అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌న్నారు. నా ఈ స్వ‌ప్నానికి మీరంతా స‌పోర్ట్ చేస్తారా? అని అడిగారు. స‌భ‌కు హాజ‌రైన వారంతా చేతులూపుతూ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Updated On 17 Sep 2023 4:40 PM GMT
krs

krs

Next Story