విధాత: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం నియంతలాగా పాలన సాగిస్తుందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వంట వార్పులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వమే పంచాయతీ కార్యదర్శులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని, సాక్షాత్తు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణపై ప్రకటన చేశారన్నారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే సమ్మె చేస్తున్నారని, సమ్మె పట్ల అణిచివేత విధానాన్ని అనుసరిస్తూ వారి ఉద్యోగాలను తొలగిస్తామంటూ బెదిరించడం అప్రజాస్వామికమన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె మొదలుకొని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె వరకు కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా కాకుండా రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కులను కాలరాచే విధంగా నియంతృత్వంగా ప్రవర్తిస్తుందన్నారు.
పంచాయతీ కార్యదర్శుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్, టిజెఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డితో పాటు సూర్యాపేట జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.