HomelatestGutta Sukender Reddy | కర్ణాటకం.. చూడండి..! ఆ రెండు పార్టీలను దూరం పెట్టండి.!...

Gutta Sukender Reddy | కర్ణాటకం.. చూడండి..! ఆ రెండు పార్టీలను దూరం పెట్టండి.! తెలంగాణ ప్రజలకు గుత్తా పిలుపు

విధాత: కర్ణాటకలో ప్రజా తిరస్కారానికి గురైన బీజేపీ ఓటమిని.. గెలిచిన కాంగ్రెస్ లో సీఎం కుర్చి కోసం సాగుతున్న అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరును తెలంగాణ ప్రజలు గమనించి రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలను దూరంగా పెట్టాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukender Reddy) సూచించారు.

మంగళవారం నల్గొండ లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులైనా ఇంకా సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసి ఆ పార్టీ కేడర్ సైతం బాధపడుతుందన్నారు. రాజస్థాన్ లో కూడా కాంగ్రెస్ లోని ఒక వర్గం అక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి ప్రజల్లో పాదయాత్రలు, దీక్షలు నిర్వహిస్తున్న తీరు కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల సంస్కృతికి నిదర్శనమన్నారు.

నిత్యం అంతర్గత కలహాలతో సాగే కాంగ్రెస్ కు తెలంగాణలో పొరపాటున ఓటేస్తే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరి అవుతుందన్నారు. నిన్న కర్ణాటక.. రేపు తెలంగాణ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో అధికారం కోసం పగటి కలలు కంటున్నారని గుత్తా ఎద్దేవ చేశారు. కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం ఇద్దరు నేతలు పోటీ పడితే తెలంగాణలో ఏకంగా 12 మంది పోటీలో ఉన్నారని, కనీసం అక్కడ ఎన్నికల్లోనైనా ఆ పార్టీ నేతలు కలిసి పని చేశారని, తెలంగాణ కాంగ్రెస్ లో ఆ పరిస్థితి కూడా లేదన్నారు.

మతోన్మాద బీజేపీని కర్ణాటక ప్రజలు తిరస్కరించినప్పటికీ బుద్ధి తెచ్చుకోని తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో హిందూ ఏక్తా యాత్ర పేరుతో విద్వేష రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. లౌకికవాద భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల మేలుకోరే వారికి ప్రజాదరణ ఉంటుందన్నారు.

కేంద్రం ఎంత సవతి తల్లి ప్రేమ చూపినప్పటికీ సీఎం కేసీఆర్ సెక్యులర్ పాలనలో ప్రజలు అభివృద్ధి పథంలో సాగుతున్నారన్నారు. మతోన్మాద బీజేపీకి, దిశలేని కాంగ్రెస్ లకు తెలంగాణలో స్థానం లేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రజలు మరోసారి బీఆర్ఎస్‌ను 100 సీట్లలో గెలిపించాల్సి ఉందన్నారు.

కర్ణాటక ఫలితాల నేపథ్యంలో కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు దూరంగా, కాంగ్రెస్ కు దగ్గరగా జరుగుతారా అన్న ప్రశ్నకు గుత్తా స్పందిస్తూ తెలంగాణలో వామ పక్షాల సహకారం లేకుండానే రెండుసార్లు బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో భాగంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో వామపక్షాలు, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయన్నారు. కేంద్రంపై పోరాటంలో సీఎం కేసీఆర్ ముందున్నారని లౌకికవాద, ప్రగతిశీల శక్తులైన వామపక్షాలు, బీఆర్ఎస్‌లు బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంతో మునుముందు కూడా కలిసి సాగుతాయన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular