విధాత: మంత్రి హోదాను.. అధికారిక కాన్వాయ్ ని సైతం ప్రక్కన పెట్టి సామాన్య కార్యకర్తలా మారి కార్యకర్తలతో జట్టు కట్టిన మంత్రి జి. జగదీష్ రెడ్డి బుధవారం ఖమ్మం లారీ ఎక్కి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు తరలి వెళ్లారు.
సూర్యాపేట మండలం సోలిపేట గ్రామం నుంచి కార్యకర్తల లారీలో తమలో ఒకడిగా తమతో ముచ్చటిస్తూ ఖమ్మం సభకు బయలుదేరిన జగదీష్ రెడ్డిని చూసి కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలతో , జిందాబాద్‌లతో ఖమ్మం బీఆర్ఎస్ సభకు సాగారు.
మంత్రిననే దర్పాన్ని, గర్వాన్ని ఏమాత్రం ప్రదర్శించకుండా కార్యకర్తలతో ముచ్చటిస్తూ తమతో ఖమ్మం ప్రయాణమైన జగదీష్ రెడ్డిని చూసి తొలుత కొంత విస్మయానికి గురైన కార్యకర్తలు అనంతరం ఆయనతో కలిసి జోష్‌గా ఖమ్మం బాట పట్టారు.
ఖమ్మం లారీ ఎక్కే ముందు మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2014కు ముందు రామరాజ్యం అని చెప్పిన బీజేపీ 9ఏళ్లుగా రాక్షస పాలన సాగిస్తుందంటూ ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు బీజేపీకి రాంరాం చెప్పి బిఆర్ఎస్ పట్టం కట్టే రోజులు రోజులు దగ్గర్లో నే ఉన్నాయన్నారు.
ఖమ్మం బీఆర్ఎస్ సభతో దేశంలో రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. బీజేపీ పాలనలో దేశంలో ఆకలి కేకలు మినహా ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. బీజేపీ హయంలో పేదలు మరింత పేదవాళ్ళుగా మారితే సంపన్నులు మరింత సంపన్నులు అయ్యారన్నారు.
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా విఫలమైందని విమర్శించారు.
తెలంగాణ అభివృద్ది నమూనాను యావత్ భారతావని కోరుకుంటుందన్నారు. దేశంలోని సహజ వనరులను వినియోగించుకొని దేశ ప్రగతికి పాటుపడేందుకు బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందన్నారు.
అభివృద్దికి ఆటంకం కల్పిస్తున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజలకు ఖమ్మం సభ ద్వారా వివరించబోతున్నా మన్నారు.