విధాత: ఖమ్మం సభ విజయవంతం కావడం దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఈ దేశానికి విముక్తి కలిగించడమే బీఆర్ఎస్ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారిన అనంతరం బుధవారం ఖమ్మం జిల్లా వెంకటాయపాలెంలో అశేష జనవాహినితో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ దేశ దుస్థితికి బీజేపీ, కాంగ్రెస్సే కారణమని కేసీఆర్ విమర్శించారు. ‘దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నది. తలుచుకుంటే చాలా బాధ కలుగుతుంది. రాజకీయాలు జరుగుతుంటాయి. నాయకులు ఓడుతుంటారు.. గెలుస్తుంటారు. అది సమస్య కాదు. ఇవాళ దేశం యొక్క లక్ష్యం ఏమిటి? ఇండియా తన లక్ష్యాన్ని కోల్పోయిందా? ఏం జరుగుతున్నది ఈ దేశంలో? అనేక రోజులుగా ఈ ప్రశ్న నన్ను కలచి వేస్తున్నది. మనమందరం దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచించాలి.
ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతం: సీఎం శ్రీ కేసీఆర్#BRSforIndia #AbkiBaarKisanSarkar pic.twitter.com/RqQZcTOYyV
— BRS Party (@BRSparty) January 18, 2023
దేశంలో ఎవర్నీ అడుక్కోవాల్సిన అవసరం లేకుండా, అపారమైన సహజ సంపద ఈ దేశ ప్రజల సొత్తు. లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉండి కూడా యాచకులం అవుతున్నాం. చైనా, అమెరికాలో వ్యవసాయ భూమి అతి తక్కువ మాత్రమే. మొత్తం భారత భూభాగం 83 కోట్ల ఎకరాల్లో ఉంది. అందులో 41 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉంది. అపారమైన జల సంపద ఉంది. అధిక వర్షపాతం నమోదు అవుతుంది. సాగునీరు పుష్కలంగా ఉంది. భూమి, నీరు, అద్భుతమైనటువంటి సూర్యకాంతి ఉంది. అద్భుతమైన ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి.
అన్నింటికి మించి కష్టపడి పనిచేసే జాతిరత్నాల్లాంటి ప్రజలు ఉన్నారు. ఇన్ని ఉన్న దేశంలో పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. బెస్ట్ ఫుడ్ చైన్ గా ఉండాల్సిన ఇండియా.. ఆహార వస్తువులను దిగుమతి చేసుకుంటున్నది. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది. జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీ పాలకులు రాష్ట్రాల మధ్య కొట్లాటలు పెట్టారు.
రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు వచ్చాయి. సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. కాంగ్రెస్ ఉంటే బీజేపీని తిట్టడం.. బీజేపీ ఉంటే కాంగ్రెస్ను తిట్టడం పనిగా ఉంది’ అని కేసీఆర్ చెప్పారు. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని పేర్కొన్నారు.