- జర్నలిస్టులకు త్వరలలో ఇళ్ల స్థలాలిస్తామని ప్రకటన
- మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేస్తానని హామీ
- 37 టీఎంసీల నిల్వతో సీతమ్మ ఆనకట్ట నిర్మాణం
- 481 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు మంజూరు చేస్తానని ప్రకటన
విధాత: అద్భుతమైన చైతన్యం ఉన్న ఖమ్మం జిల్లా ప్రజలే తనను కాపాడారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కమ్యూనిస్టు విప్లవ భావాలతో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రగతిశీల కార్యక్రమాలు చేపట్టిన జిల్లా ఖమ్మం అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తనను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైల్లో పెడితే కాపాడింది మీరే అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ అందరి ఆశీర్వాద బలం, ఐక్యపోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఎనిమిదేండ్ల క్రితం ఉన్న తెలంగాణకు, ఇవ్వాల్టీ తెలంగాణకు పొంతన కూడా లేదని ఉద్ఘాటించారు. తలసరి ఆదాయంతో పాటు జీఎస్డీపీ పెరిగిందన్న కేసీఆర్.. దేశంలోనే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
మనం తాలిబన్లలాగా తయారైతే.. పెట్టుబడులు వస్తాయా..?: సీఎం కేసీఆర్
కొత్తగూడెం పట్టణం నుంచి ప్రవహించే ముర్రెడు వాగును కోత నుంచి కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్న పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 40 కోట్ల చొప్పున నిధులు, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. అదే విధంగా జిల్లా పరిధిలో ఉన్న 481 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధులను అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు.
ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న కరువును తరిమేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. భద్రాద్రి దేవాలయానికి సమీపంలోనే 37 టీఎంసీల నిల్వతో సీతమ్మ ఆనకట్ట నిర్మిస్తున్నామని తెలిపారు. ఇది సముద్రాన్ని తలపించబోతున్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. యావత్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తేల్చిచెప్పారు.
కొత్తగూడెం కలక్టరేట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉన్నది. భద్రాద్రి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. కొత్తగూడేనికి కొత్త జిల్లా వచ్చింది. వైద్య కళాశాల, కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. కొత్తగూడెం మైనింగ్ ఇనిస్టిట్యూట్ ను పూర్తిస్థాయి ఇంజినీరింగ్ కళాశాలగా మారుస్తామని చెప్పారు.
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
భద్రాద్రి కొత్తగూడెంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం గురువారం జరిగింది. కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ముఖ్యమంత్రికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్రావు స్వాగతం పలకగా, నూతన కలెక్టరేట్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సాయంత్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.