Thummala | అనుచరులతో వరుస భేటీలు పాలేరులో కోరుతున్న తుమ్మల ఖమ్మం సూచిస్తున్న కాంగ్రెస్‌ స్థానంపై ఇంకా రాని స్పష్టత కాంగ్రెస్‌కు టచ్‌లో మైనంపల్లి! రేఖానాయక్, జలగం కూడా? విధాత, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో బీఆరెస్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సిద్ధమయ్యారు. పార్టీలో అసంతృప్త నేతగా ఉన్న తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని తెలుస్తున్నది. అన్నిఅనుకూలిస్తే సెప్టెంబర్‌ 5,6 తేదీలలో తన అనుచరులతో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. […]

Thummala |

  • అనుచరులతో వరుస భేటీలు
  • పాలేరులో కోరుతున్న తుమ్మల
  • ఖమ్మం సూచిస్తున్న కాంగ్రెస్‌
  • స్థానంపై ఇంకా రాని స్పష్టత
  • కాంగ్రెస్‌కు టచ్‌లో మైనంపల్లి!
  • రేఖానాయక్, జలగం కూడా?

విధాత, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో బీఆరెస్‌కు కోలుకోలేని షాక్‌ ఇచ్చేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సిద్ధమయ్యారు. పార్టీలో అసంతృప్త నేతగా ఉన్న తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారని తెలుస్తున్నది. అన్నిఅనుకూలిస్తే సెప్టెంబర్‌ 5,6 తేదీలలో తన అనుచరులతో కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. ఇందుకోసం చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది.

సెప్టెంబర్‌ 5వ తేదీన ఢిల్లీకి వెళ్లి రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను తుమ్మల కలుస్తారని ఆయన ముఖ్య అనుచరులు చెప్పారు. ఢిల్లీలో వారిని కలిసిన తరువాత మరుసటి రోజు గాంధీభవన్‌లో పెద్ద ఎత్తున అనుచరులతో తరలి వచ్చి కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ మేరకు సంకేతాలు అందడంతో ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు భారీ ఎత్తున తరలి రావడానికి అనుచరులంతా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వాహనాలను భారీ సంఖ్యలో బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తున్నది.

బీఆరెస్‌లో దక్కని ప్రాధాన్యం

2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్‌రావు ఓటమి చవిచూశారు. ఆ తర్వాత నుంచి సీఎం కేసీఆర్‌ తుమ్మలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కన పెట్టారు. కనీసం ఈ ఎన్నికల్లో టికెట్‌ ఇస్తారని ఆశించినా.. తుమ్మలకు ఆశాభంగమే అయ్యింది. ఈ నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లో పోటీలో నిలవాలని అనుచరులు ఆయనపై తీవ్ర వత్తిడి తెచ్చారు.

దారుణంగా అవమానించిన కేసీఆర్‌తో మనం ఉండాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్‌ తనను పట్టించుకోలేదన్న అసంతృప్తి, అనుచరుల నుంచి వస్తున్న వత్తిడితో తుమ్మల వరుసగా సమావేశాలు నిర్వహించారు. అందరి అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లో చేరదామని, అందుకు సిద్ధం కావాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు.

పాలేరు కోరుతున్న తుమ్మల

పాలేరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని తుమ్మల నాగేశ్వర్‌రావు భావిస్తున్నట్లు తెలిసింది. క్యాడర్‌ కూడా అదే కోరుతున్నారు. అయితే అక్కడ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోటీకి సిద్ధమవ్వడంతో తుమ్మలకు ఖమ్మం స్థానాన్ని కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. మరో వైపు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ప్రతిపాదన తెచ్చిన షర్మిల కూడా పాలేరు టికెట్‌నే ఆశిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

గోదావరి నీళ్లను తెచ్చి తన ప్రజల పాదాలను కడిగేందుకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన తుమ్మల కచ్చితంగా ఖమ్మం జిల్లా నుండే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

మరోవైపు తుమ్మల, పొంగులేటి వంటి వారు పార్టీకి దూరం కావడంతో అసలే ఖమ్మంలో అంతంతంగా మాత్రంగా ఉన్న బీఆరెస్‌కు ఎన్నికల్లో మరింత ప్రతికూలత కల్గించవచ్చని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ మాత్రం ఆ ఇద్దరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన జరిగే నష్టం ఏమీలేదని అంటున్నారని తెలిసింది.

కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తితో..

సీఎం కేసీఆర్ తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం జిల్లాలో బీఆరెస్‌కు గట్టి గుణపాఠం చెప్పాలన్న కసితో ఉన్నారని సమాచారం. పాలేరు టికెట్ విషయంలో తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా టికెట్ నిరాకరించడం, అనంతరం కూడా తనతో నేరుగా సంప్రదింపులు చేయకపోవడాన్ని తుమ్మల తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.

రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ ఇస్తామని బీఆరెస్ అధిష్ఠానం సంకేతాలు వదలటం కూడా తుమ్మలలో మరింత అసహనాన్ని పెంచింది. ఈ పరిణామాల మధ్య బీఆరెస్ అధినేతకు తగిన గుణపాఠం చెప్పాలని తుమ్మల పట్టుదలగా ఉన్నారని, అందుకే ఆలస్యం చేయకుండా కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని అనుచరవర్గాలు చెబుతున్నాయి.

కాంగ్రెస్‌కు టచ్‌లో మైనంపల్లి, రేఖానాయక్‌, జలగం వెంకట్రావు తదితరులు?

మరోవైపు తమ్మల బాటలోనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఉన్నట్లు తెలుస్తు న్నది. ఇప్పటికే మైనంపల్లి హన్మంతరావు బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్‌నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. ఆసిఫాబాద్‌ నుంచి పోటీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు.

కొత్తగూడెం టికెట్‌ తనకు కాకుండా ప్రత్యర్థి వనమాకు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జలగం వెంకట్‌రావు పార్టీ నాయకులకు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. తన అనుచరులు కూడా నిర్ణయం తీసుకోవాలని వత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

దీంతో వెంకట్‌రావు కూడా కాంగ్రెస్‌ టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నది. టికెట్ దక్కని సిటింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, నకిరేల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, సైతం కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం వినిపిస్తున్నది.

Updated On 31 Aug 2023 8:17 AM GMT
krs

krs

Next Story