- ఆ విషయం చెప్పినందుకు సిగ్గు పడటం లేదు
- మహిళలు తమకు జరిగింది చెప్పాలి
- తండ్రి లైంగిక వేధింపులపై ఖుష్బూ
Khushbu On Abuse By Father । తనను తన తండ్రి లైంగికంగా వేధించారని చెప్పడం ద్వారా సంచలనం సృష్టించిన ఖష్బూ తాను చెప్పిన దానికి ఏమీ సిగ్గు పడటం లేదని పేర్కొన్నారు. మహిళలందరూ తమకు జరిగింది చెప్పాలనే ఉద్దేశంతోనే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టానని తెలిపారు.
విధాత : చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించారని బయటపెట్టిన సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ.. (Khushbu Sundar) తాను ఆ విషయం వెల్లడించినందుకు సిగ్గుపడటం లేదని అన్నారు. మహిళలందరూ తమకు జరిగింది బయటపెట్టాలని కోరుకున్నానని, అందుకే తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పానని తెలిపారు.
ఖుష్బూ ఈ మధ్యే జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women) సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. చిన్నతనంలో తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘నేనేమీ వింతైన స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. నిజాయితీతో చెప్పాను. ఇలా చెప్పినందుకు కూడా నేనేమీ సిగ్గుపడటం లేదు.
ఎందుకంటే అది నాకు జరిగింది. అందుకు కారణమైన వ్యక్తి సిగ్గుపడాలని నేను భావించాను కాబట్టే వెల్లడించాను’ అని ఆమె ఒక వార్తా సంస్థకు చెప్పారు. నేను చెప్పడం ద్వారా మహిళలు తమకు జరిగింది చెప్తారని భావించానని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఇటువంటి విషయాల్లో గట్టిగా ఉండాలని, మీపై మీరే పట్టు కలిగి ఉండాలనే సందేశాన్ని ఇవ్వదల్చుకున్నానని ఆమె తెలిపారు.