- తమ సమస్యలను శాసనమండలిలో వినిపించని వ్యక్తికి ఓటు ఎందుకయ్యాలి?
- కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు (Telangana State Government Employees) నేడు ఆత్మగౌరవంగానే బతుకుతున్నారా? అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy, Minister of Tourism, Culture) అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (Teachers Quota MLC Elections)ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మారుమూల ప్రాంతాలలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయుల (Teachers) సమస్యల గురించి పట్టించుకునేవారు లేకపోయారని అన్నారు. తమకంటూ ప్రాతినిథ్యం వహించే వ్యక్తి ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఉపాధ్యాయుల తరఫున పెద్దల సభకు ఒకరిని ఎన్నుకునే వారని చెప్పారు.
కానీ నేడు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వారి గళాన్ని వినిపించలేని వ్యక్తులకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఉపాధ్యాయులంటే సమాజాన్ని జాగ్రత్తపరిచే వ్యక్తులని, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని, సమాజంలో వారికి మంచి గౌరవం ఉంటుందని అన్నారు. అలాంటి వారికి అస్తిత్వమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెలనెలా జీతం (Salaries) సమయానికి వస్తుందో లేదో అని ఎదురుచూసే దీనస్థితి నేడు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా దివాలా తీస్తే ..కల్వకుంట్ల (Kalvakuntla) కుటుంబం ఆస్తులు మాత్రం దండిగా పెరిగాయని ఆరోపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ (BJP) మద్దతుతో నిలబడిన ఏబీఎన్ రెడ్డిని గెలిపించాని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి పీ చంద్రశేఖర్, ఇతర నేతలు శాంతి కుమార్, నర్సింలు, సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ వర్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.