KCR | లీకులు ఉన్నందునే లేఖతో వార్నింగ్‌ బడాయి ! విధాత: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు, కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు పెట్టబోతుందా? అందుకే సీఎం కేసీఆర్‌ బీఆరెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీర్మానించి ప్రధాని మోడీకి లేఖ రాశారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో పలు మార్లు పార్లమెంటు సమావేశాల్లో గానీ, కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలను గానీ ముందుగానే సీఎం కేసీఆర్‌ తెలుసుకుని దానిని […]

KCR |

లీకులు ఉన్నందునే లేఖతో వార్నింగ్‌ బడాయి !

విధాత: ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ, మహిళా రిజర్వేషన్ల బిల్లు, కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు పెట్టబోతుందా? అందుకే సీఎం కేసీఆర్‌ బీఆరెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తీర్మానించి ప్రధాని మోడీకి లేఖ రాశారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

గతంలో పలు మార్లు పార్లమెంటు సమావేశాల్లో గానీ, కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలను గానీ ముందుగానే సీఎం కేసీఆర్‌ తెలుసుకుని దానిని ఇక్కడ ముందేసుకోని సదరు అంశాన్ని చర్చల్లో పెట్టడం పరిపాటి. అనంతరం మా పోరాటం వల్లే ఇదంతా జరిగింది, కేంద్రం దిగివచ్చిందంటూ ఢాంబికాలు పోవడం అందరికీ తెలిసిందే.

అయితే.. గత కొంతకాలంగా ప్రధాని మోడీ పైన, బీజేపీపైన పెద్దగా విమర్శలు చేయడం మానుకున్న సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా మోడీకి లేఖ పేరుతో డిమాండ్లు, వార్నింగ్‌లు ఇవ్వడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందన్న వాదన వ్యక్తమవుతుంది. 2014 అసెంబ్లీ సమావేశాల్లోనే తమ పార్టీ బీసీ, మహిళా రిజర్వేషన్ల కోసం తీర్మానాలు చేశామన్న సీఎం కేసీఆర్‌ దీనిపై ఇప్పుడు ప్రత్యేకంగా ప్రధానికి లేఖ సంధించడం వెనుక మతలబు ఏమిటన్నదానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

CM KCR | బీసీ బిల్లు, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులు తీసుకురండి.. కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ‌

కేంద్రం ఈ ప్రత్యేక సమావేశాల్లోనే బీసీ, మహిళా బిల్లు పెట్టాలన్న కేసీఆర్‌ డిమాండ్‌ వెనుక ఖచ్చితంగా ఆయనకు ఆ బిల్లులను ఈ సమావేశంలో కేంద్రం పెట్టబోతుందన్న లీక్‌ ఉందంటున్నారు. అందుకే ఆ బిల్లుల సాధనలో తాను చేసిన ప్రయత్నాలను ఏకరవు పెడుతూ ప్రధానికి లేఖ రాసి రానున్న ఎన్నికల్లో బీసీ, మహిళ వర్గాల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.

కేసీఆర్‌కు బిల్లుల లీకులకు సంబంధించిన వాదనకు మరింత బలం చేకూరేలా బీఆరెస్‌ వ్యతిరేకిస్తున్న కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లును తెస్తే తాను స్వయంగా ఢిల్లీకి వస్తానన్న వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పార్లమెంటులో పోరాడాలని కేసీఆర్‌ పిలుపు ఇవ్వడం గమనార్హం.

నిజానికి ఏడుగురు ఎంపీల సంఖ్యాబలమున్న బీఆరెస్‌ ఆ బిల్లులను అడ్డుకోవడంలో చేసేదేమి ఉండదు. ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై ఇటీవల గత పార్లమెంటు సమావేశాల్లో మణిపూర్‌ వివాదంపై పెట్టిన అవిశ్వాసం సందర్భంగా బీఆరెస్‌ పాత్ర తెలిసిందే.

ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లినా పరిస్థితుల్లో మార్పయితే ఉండదు. అయితే కామన్‌ సివిల్‌ కోడ్‌కు వ్యతిరేకంగా తాను కొట్లాడినట్లుగా తన మిత్రపక్షం ఎంఐఎంను, ముస్లిం వర్గాలను సంతృప్తి పరిచే.. ఎన్నికలలో వారి ఓట్లను కొల్లగొట్టే వ్యూహామే దాగి ఉందన్నది నిర్వివాదంశం.

Updated On 15 Sep 2023 1:57 PM GMT
krs

krs

Next Story