Kodandaram విధాత: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎవరి లెక్కల్లో వారు తలమునకలై ఉన్నారు. నియోజకవర్గాల్లో అప్పుడే పోటీ చేసేది నేనంటే నేను అని అధికారపార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ రచ్చబండ దగ్గర ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల గురించే చర్చ జోరుగా సాగుతున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలో పొత్తులపై రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న గన్‌పార్క్ వద్ద అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. […]

Kodandaram
విధాత: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు కూడా మారుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎవరి లెక్కల్లో వారు తలమునకలై ఉన్నారు. నియోజకవర్గాల్లో అప్పుడే పోటీ చేసేది నేనంటే నేను అని అధికారపార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ రచ్చబండ దగ్గర ఎన్నికలు, అభ్యర్థులు, పార్టీల గురించే చర్చ జోరుగా సాగుతున్నది. ఇదే సమయంలో రాష్ట్రంలో పొత్తులపై రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న గన్‌పార్క్ వద్ద అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఉద్యమ సమయంలో జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌తో పాటు కీలక భూమిక పోషించిన నేతలంతా నిన్న ఒక్క దగ్గర కనిపించారు. కొంతమంది అయితే వివిధ పార్టీల్లో చేరారు.
కాగా.. మరికొంతమంది గత రెండు ఎన్నికల్లో ఎవరికి వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వివిధ పార్టీల వెంట నడిచారు. తటస్థంగా ఉన్నవాళ్లంతా ఈసారి వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీని గద్దె దించాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అందుకే కోదండరామ్‌తో ఇప్పటికే అలాంటి వారు చర్చించినట్టు సమాచారం.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తర్వాత ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్ నేతృత్వంలో జనసమితి పార్టీ పురుడు పోసుకున్నది. తెలంగాణ ఆకాంక్షలు, ప్రయోజనాలే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తున్నది. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఆ పార్టీ తప్పుపట్టింది. నిరసన వ్యక్తం చేసింది. ప్రజల పక్షాన తన గొంతును వినిపిస్తున్నది. అయితే ఆపార్టీ ఆ మధ్య ఆప్‌లో విలీనమౌతుందనే వార్తలు వచ్చాయి.
కానీ అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణలో ఆప్ విస్తరణలో భాగంగా అధికార పార్టీకి వ్యతిరేకంంగా కలిసి పనిచేయాలని భావించారు. అయితే జాతీయ స్థాయిలో రాజకీయ ప్రయోజనాలో.. లిక్కర్ స్కాంలో ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలపై ఆరోపణలు రావడం, ప్రస్తుతం ఆ కేసు ఇంకా కొనసాగుతుండటం తో ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయి. దీంతో ఆ మధ్య ఆప్‌తో వెళ్లేకంటే స్వతంత్రంగా ఉండటమే ఉత్తమం అని ఆ పార్టీ నేతలు, కార్యకర్తుల అభిప్రాయపడ్డారట. అందుకే ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీల మధ్య పొత్తులు లేదా విలీనం వంటి అంశాలు తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జనసమితి కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, కాంగ్రెస్ పార్టీ అధిష్‌ఠానంతో తుది చర్చల తర్వాత నేతల అవగాహన కుదిరిన తర్వాత ఒప్పందానికి రావొచ్చని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేదా ఆ పార్టీలో జనసమితి విలీనమా అన్న విషయంపై త్వరలో స్పష్టత వస్తుంది అంటున్నారు. జన సమితి అధినేత కోదండరామ్ సహా ఆయన సూచించే మరికొంతమందికి టికెట్లు ఇవ్వడానికి రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం అంగీకరిస్తే కాంగ్రెస్, జనసమితి కలిసి నడుస్తాయని అని తెలుస్తోంది.
