- రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు నిర్వహిస్తాం
- MSP రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌గౌడ్
Komati Reddy is not emotional
విధాత: చెరుకు సుధాకర్ గౌడ్(Cheruku Sudhakar Goud)ను పరుష పదజాలంతో దుర్భాషలాడి, చంపుతామన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Komatireddy Venkatreddy) వ్యాఖ్యలు భావోద్వేగంతో మాట్లాడిన మాటలుగా లేవని, అగ్రకుల అహంకారంతో మాట్లాడిన మాటలుగానే మహాజన సోషలిస్టు పార్టీ(Mahajana Socialist Party), ఎమ్మార్పీఎస్(MRPS) చూస్తుందని మహాజన సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్ అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని నవ్య హస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మహజన సోషలిస్టు పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి,
బిసి సంక్షేమ సంఘం, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం, మాల మహానాడు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, బీసీ విద్యార్థి సంఘం, బీసీ యువజన సంఘం, తెలంగాణ స్టూడెంట్ యూనియన్, తెలంగాణ గౌడ సంఘం, మున్నూరు కాపు సంఘం, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్వర్యంలో డాక్టర్ చెరుకు సుధాకర్‌కు, ఆయన కుమారుడు డాక్టర్ సుహాస్‌కు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రదీప్ గౌడ్(Pradeep Goud) మాట్లాడుతూ చెరుకు సుధాకర్(Cheuruku Sudhakar)ని పార్టీలకతీతంగా ఉద్యమకారుడిగా బహుజన వర్గాలకు చెందిన నాయకుడిగా సమాజం చూస్తుందన్నారు. సుధాకర్‌ను పార్టీగా చూడలేదని, సామాజిక శక్తి గా మాత్రమే ప్రజా సంఘాలు భావిస్తున్నాయన్నారు. చెరుకు సుధాకర్ కుటుంబాన్ని అంతం చేయడం భావోద్వేగమవుతుందా అని ప్రశ్నించారు. ఎదుగుతున్న బహుజన నాయకుడిని అణగదొక్కడానికి కుల అహంకారంతో బెదిరించిన మాటలుగానే వెంకట్ రెడ్డి మాటలను చూస్తాం అని అన్నారు.
సుధాకర్‌కు క్షమాపణలు ఎందుకు చెప్పలేదు..?
విధానపరంగా మాత్రమే చెరుకు సుధాకర్ మాట్లాడినాడు తప్ప వెంకట్‌రెడ్డి లాగా ఏనాడు వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. నల్లగొండలో ఎస్సి, ఎస్టి, బిసిల ప్రైవేటు దావాఖానాలు ఉండొద్దా.! ఉంటే
కూల్చేస్తారా..! ఆధిపత్య వర్గాల హాస్పిటల్స్ మాత్రమే ఉండాలా అని ప్రశ్నించారు. మీరు మాత్రం వందల కోట్ల కాంట్రాక్టులు, ఆస్తులు కూడబెట్టుకోవొచ్చు గాని, మేము మాత్రం ఎదుగొద్దా అని వెంకట్ రెడ్డిని నిలదీశారు. మా దళిత నాయకుడు అద్దంకి దయాకర్‌తో రెండుసార్లు క్షమాపణ చెప్పించుకున్న వెంకటరెడ్డి బడుగుల నేత చెరుకు సుధాకర్‌కు ఎందుకు క్షమాపణ చెప్పలేదు అని ప్రశ్నించారు. తక్షణమే వెంకట్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సస్పెండ్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీలో బహుజనులకు స్థానం లేనట్లుగానే భావిస్తామన్నారు. ఈ రోజు తెలంగాణలో ఎస్సీ, ఎస్టి, బిసి సంఘాలు సుధాకర్ కు వెన్నుదన్నుగా నిలబడ్డతీరు తెలంగాణ లో ఆయనకున్న ప్రజాశక్తికి నిదర్శనం అన్నారు.
చెరుకు కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పించాలి..
చెరుకు సుధాకర్ జైల్లో నిర్భంధించబడితే రాష్ట్ర వ్యాప్తంగా మంద కృష్ణ మాదిగ ఉద్యమించారన్నారు. కోమటిరెడ్డి ఏనాడు ఉద్యమంలో చెరుకు సుధాకర్ కు అండగా నిలబడలేదన్నారు. వెంకట్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం అణగారిన వర్గాలను తొక్కడమే పనిగా పెట్టుకున్నాడన్నారు. మా వర్గాల నుండి ఎదుగుతున్న సుధాకర్ ను భౌతికంగా అంతం చేయడానికి వెంకట్ రెడ్డి పన్నిన కుట్రను చిత్తు చేస్తాం అన్నారు. ప్రభుత్వం కూడా చెరుకు కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు రాస్తారోకోలతో అగ్గి రాజేస్తామన్నారు.
ఏనాడూ ఇలా మాట్లాడలేదు…
ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ మా కుటుంబం 40 ఏండ్లుగా అనేక కష్టాలను చూసిందన్నారు. నా జీవితంలో ఏనాడు ఇలాంటి మాటలు పడాల్సి వస్తదని కలలో కూడా ఊహించలేదన్నారు. వెంకట్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి నా కుమారుడిని, నన్ను తిట్టిన తీరు కన్న తల్లిని అవమానపర్చడమే అన్నారు. ఇలాంటి అనైతిక మాటలు మాట్లాడి న్యాయస్థానం పై గౌరవం ఉందని మాట్లాడుతుంటే సమాజం సిగ్గు పడుతుందన్నారు. ఇవాళ పున్నా కైలాష్ నేతను బెదిరిస్తున్నవారు ఏ పార్టీ లో ఉన్నరో గమనించాలన్నారు. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుపుకు డబ్బులు పంచింది మీరు కాదా అంటూ వెంకట్ రెడ్డి ని ప్రశ్నించారు.
క్షమాపణ అవసరం లేదు…
సోనియాగాంధీ సాధికారత కోసం తెలంగాణ ఇస్తే పాలేగాండ్ల గా బిసి, ఎస్సి, ఎస్టీలను చూస్తున్నారన్నారు. వెంకట్ రెడ్డి క్షమాపణ అవసరం లేదనీ, ఆయన తన ప్రవర్తన మార్చుకోవాలని, కోర్టుల మీద గౌరవం ఉంటే, రాజ్యంగం మీద గౌరవం ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నందునా ఆయన తమ వివాదంపై స్పందించాలన్నారు. ఉత్తమ్ ను వెంకట్ రెడ్డి గతంలో తిడితే తాము ఆనాడు బాధపడ్డామన్నారు. కోమటిరెడ్డి కి పాశ్చాతపం లేదని, ఏనాడు వారి వ్యాఖ్యలను పున:పరీశీలన చేసుకోలేదన్నారు. పార్టీకి అక్కరొచ్చే పని చేయమంటే కాళ్లల కట్టెలు పెడుతున్నడని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వెంకట్ రెడ్డినే కాదు జీవితంలో ఏనాడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదన్నారు. దీనిపై నిరూపిస్తే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తా అన్నారు. ఆధిపత్య, అహంభావంతో ఎవరూ అలాంటి దుర్భాషలు చేసినా బహుజనులు భరించడానికి సిద్దంగా లేరన్నారు.
గడియారం వద్ద చర్చకు సిద్ధమా…
వెంకట్ రెడ్డి కార్యకర్తగా ఉన్నప్పుడే 1991 లోనే మిర్యాలగూడ ఎంపిగా పోటి చేసి తాను 50,000 ఓట్లు తెచ్చుకున్నానని సుధాకర్ గుర్తు చేశారు. ఎప్పుడూ బడుగు వర్గాలు జిందాబాద్‌లు కొట్టి జెండాలు మోయాలనుకోవడం వెంకట్ రెడ్డి అవివేకం అన్నారు. మాజీ జడ్పిటిసీ తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మొదటి నుండి బహుజనులను అణగదొక్కుతున్నారన్నారు. దీనిపై నల్లగొండ గడియారం వద్ద ఆయన చర్చకు రావాలని, ఏ బహుజన నాయకుని ఎదగనిచ్చినివో చర్చిద్దామన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో బూడిద భిక్షమయ్య గౌడ్ ను, సుంకరి మల్లేశ్ గౌడ్, పుల్లెంల వెంకట్ నారాయణ గౌడ్ ల లాంటి అనేకమందిని అణగదొక్కారన్నారు. కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపిగా అయి అదే పార్టీ ని ఆగం చేయాలని చూస్తున్న నీకు ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారన్నారు.
పంచాయితీలకు తెరలేపుతున్న కోమటిరెడ్డి..
టీపీసీసీ జనరల్ సెక్రెటరీ కొండేటి మల్లయ్య మాట్లాడుతూ కోమటిరెడ్డి ఎస్సి, ఎస్టీ, బిసిల మధ్య ఇబ్బంది సృష్టిస్తున్నాడన్నారు. అనేక గ్రూపులు తయారుచేసి పంచాయితీలకు తెరలేపుతున్నాడని, కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి విధానం సరిగ్గా లేదన్నారు. సమావేశంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నకిరేగంటి కాశయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కడతమల్ల హుస్సేన్, ఎంఎస్పి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి ఆడెపు నాగార్జున, సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి యాతాకుల రాజయ్య, నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ పందుల సైదులు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఐతగోని జనార్దన్ గౌడ్, కనగల్ మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్, సామాజిక కార్యకర్త పలస యాదగిరి, తెలంగాణ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి,కొమిరే స్వామి, బొజ్జ చిన్న, మాదిగ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, కారింగ్ నరేష్ గౌడ్ కొంపెల్లి రామన్న గౌడ్ బొజ్జ దేవయ్య ఎరుకల శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.