- చెరుకు సుధాకర్‌ను, ఆయన కొడుకును చస్తారంటూ బెదిరించిన ఆడియో వైరల్
Komati Reddy Venkat Reddy in another controversy..
విధాత: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komati Reddy Venkat Reddy) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా టిపిసిసీ ఉపాధ్యాక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్(TPCC Vice President Dr. Cheruku Sudhakar)కుమారుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసి మీ ఇద్దరిని తన అభిమానులు చంపుతామని వంద వెహికిల్స్‌లో తిరుగుతున్నారని, వారం రోజుల్లో చంపేస్తారని తీవ్ర పదజాలంతో బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
తీవ్ర పదజాలంతో సుధాకర్‌ను తిడుతూ సుహాస్‌కు ఫోన్
ఆడియోలో వెంకట్‌రెడ్డి తీవ్ర పదజాలంతో చెరుకు సుధాకర్‌ను తిడుతూ.. మీ నాన్న వీడియో చూసావా అంటూ సుహాస్‌తో మాట్లాడారు. ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టాడని నెల రోజుల నుంచి ఓపిక పడుతున్నానని, వందకార్లలో తన అభిమానులు బయలుదేరారని, వాడిని ఎక్కడ దొరికితే అక్కడే చంపుతారని హెచ్చరించారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా.. వాడిని వదిలేది లేదన్నారు. వాడు క్షమాపణ చెప్పకపోతే వాడిని చంపుతారని, ఇంటి పార్టీ ఏందిరా.. అతను పిడి యాక్ట్
కేసులో జైల్లో పడితే తాను ఒక్కడినే వెళ్లి పరామర్శించానని, కౌన్సిలరర్‌గా గెలవనోడు పదే పదే నన్ను విమర్శించడం ఏమిటంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు.
బెదిరింపు ఆడియో ఫోన్‌కాల్ రికార్డు వైరల్
25 ఏళ్ల రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన నేను.. వారిలో చాలామంది ఇప్పటికే తనపై చెరుకు సుధాకర్ చేసిన విమర్శల పట్ల మండిపడుతూ అతడిని చంపుతామంటూ బయలుదేరారని, తాను ఎంతమందినని ఆపుతానని, నిన్ను కూడా చంపేస్తారు.. నీ హస్పిటల్ ఉండదు.. అని ఫోన్‌లో సుహాస్‌ను బెదిరించిన ఆడియో ఫోన్ కాల్ రికార్డు వైరల్‌గా మారిపోయింది.
కోమటిరెడ్డిని ఎద్దేవా చేస్తూ చెరుకు సుధాకర్ ఇంటర్వ్యూ..
రెండు రోజుల క్రితం చెరుకు సుధాకర్ ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిడబ్ల్యూసిలో అవకాశం ఇస్తే తాను మరింత బాగా పనిచేస్తానంటూ వెంకట్‌రెడ్డి చెప్పిన మాటలను ఎద్దేవా చేస్తూ విమర్శలు చేశారు. వెంకట్‌రెడ్డి పార్టీలో సీనియర్ అని, పార్టీ ఆయనతోనే లేచింది అన్న భ్రమలో ఉన్నారన్నారు. పార్టీ కోసం పని చేసేందుకు పదవి అవసరమా అంటూ వ్యాఖ్యానించారు. మునుగోడులో బిజెపిని, ఆయన తమ్ముడిని ఓడిస్తానంటే, నకిరేకల్‌లో కాంగ్రెస్‌ని గెలిపిస్తానంటే అక్కడి ప్రజలు ఆయనకు సిడబ్ల్యుసి వచ్చిందా అని ఏమీ అడగరు కదా అన్నారు.
ముందు విశ్వసనీయత నిరూపించుకోవాలని సూచన..
వెంకట్‌రెడ్డి సిడబ్ల్యూసిని అడిగే ముందు ఆయన దక్షిణ తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. అలాగే పార్టీలో ఆయన విశ్వసనీయత పెంచుకోవాలని, ముందుగా మునుగోడులో తన తమ్ముడి విజయం కోసం పని చేసిన కాంగ్రెస్ పార్టీ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయనే స్వయంగా రికమండ్ చేసి తన విశ్వసనీయత నిరూపించుకోవాలని సుధాకర్ అన్నారు. పార్టీ కోసం గట్టిగా పని చేసి విశ్వసనీయత నిరూపించుకొని, వెంకట్‌రెడ్డికి సిడబ్ల్యూసి దక్కితే తానే మొదట ఆయనకు దండ వేస్తాను అన్నారు.