Komatireddy | వేణుగోపాల్ హామీలేమయ్యాయి బీజేపీతో సాన్నిహిత్యమే కారణమా విధాత, హైద్రాబాద్ : మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి పార్టీ పదవుల విషయంలో మొండిచేయి చూపడం అనుచర వర్గాల్లో నిరాశ పరిచింది. తాజాగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ, స్క్రీినింగ్ కమిటీలోనూ, సీడబ్ల్యూసీలోనూ తనకు స్థానం కల్పించలేదని అలిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అధిష్టానం మరోసారి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కొత్తగా వేసిన 8 కమిటీల్లోనూ స్థానం కల్పించకపోవడం […]

Komatireddy |

  • వేణుగోపాల్ హామీలేమయ్యాయి
  • బీజేపీతో సాన్నిహిత్యమే కారణమా

విధాత, హైద్రాబాద్ : మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి పార్టీ పదవుల విషయంలో మొండిచేయి చూపడం అనుచర వర్గాల్లో నిరాశ పరిచింది. తాజాగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ, స్క్రీినింగ్ కమిటీలోనూ, సీడబ్ల్యూసీలోనూ తనకు స్థానం కల్పించలేదని అలిగిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అధిష్టానం మరోసారి తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కొత్తగా వేసిన 8 కమిటీల్లోనూ స్థానం కల్పించకపోవడం ఆయన వర్గీయులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది.

పార్టీ పదవుల విషయమై తనకు అన్యాయం జరుగుతుందంటూ అలకబూనిన వెంకట్‌రెడ్డిని ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్‌, సీఎల్పీనేత భట్టి విక్రమార్కలు బుజ్జగించారు. కేసీ వేణుగోపాల్ భవిష్యత్తులో వెంకట్‌రెడ్డికి పార్టీలో తగిన గుర్తింపు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు.

ఇదంతా మరువకముందే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిటీలలో ఎందులోనూ స్థానం కల్పించకపోవడం వెనుక మతలబు ఏమిటన్న దానిపై పార్టీలోనూ, కోమటిరెడ్డి వర్గీయుల్లోనూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో పార్టీ పరంగా కీలకమైన ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, మ్యానిఫెస్టో కమిటీలకు మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌ బాబులను చైర్మన్‌లుగా, షబ్బీర్ అలీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించారు. మొత్తం 8 కమిటీల్లోనూ ఏ కమిటీలో కోమటిరెడ్డి పేరు లేకపోవడం కాంగ్రెస్ కేడర్‌ను సైతం విస్మయ పరిచింది.

Komatireddy Venkat Reddy modi

బీజేపీతో సాన్నిహిత్యమే కారణమా..

కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యతనివ్వకపోవడానికి ఆయన అనుసరించిన వైఖరినే కారణమన్నవాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరడం, తర్వాతా తాను కూడా బీజేపీ అగ్రనేతలతో మంతనాలు చేయడం దృష్టిలో పెట్టుకునే ఆయనను కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసంలోకి తీసుకోకుండా దూరం పెడుతుందన్న అంతర్గత చర్చ సాగుతుంది.

సీఎంలకు కూడా సాధ్యం కానీ రీతిలో అడిగిందే తడవుగా ప్రధాని మోదీ అపాయింట్మెంట్లను సాధించి ఆయనతో పదేపదే భేటీ అయిన నేపథ్యానికి తోడు అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో తరుచూ భేటీయైన నేపధ్యం వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి అపనమ్మకాన్ని పెంచిందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాస్ లీడర్‌గా జనంలో పేరున్నప్పటికి తరుచు పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలపై అసమ్మతి వ్యక్తం చేయడం, పార్టీ మార్పు లీక్‌లు, నిలకడలేమి వ్యాఖ్యలు, సహచర నాయకులపై విమర్శలు వంటివన్ని కూడా వెంకట్‌రెడ్డికి పార్టీ పరంగా మైనస్‌గా మారుతున్నాయని కేడర్ అభిప్రాయ పడుతుంది.

తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్ వంటి ఉన్నత స్థాయి నాయకుడు వెంకట్‌రెడ్డికి ఇచ్చిన హామీలు సైతం ఎందుకు అమలు కాలేదన్న సందేహం అనుచర వర్గాల్లో వ్యక్తమవుతుంది. అసలు వెంకట్ రెడ్డితో వేణుగోపాల్ ఏం చర్చించారు…ఏ హామీలిచ్చారన్న దానిపై కూడా అయోమయం నెలకొంది.

Updated On 12 Sep 2023 5:40 AM GMT
krs

krs

Next Story