విధాత: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో ఏర్పడిన విభేదాలతో కొంత కాలంగా గాంధీ భవన్ కు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే రాక సందర్భంగా గాంధీభవన్ కి వెళ్లారు.
చాలా రోజుల తర్వాత గాంధీభవన్‌కు వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోనికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన గేటు నుంచి కాకుండా పాత గేటు నుంచి గాంధీభవన్‌లోకి వెళ్లారు.
గాంధీభవన్‌కి వెళ్లిన వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా మాణిక్ రావు ఠాక్రేతో పాటు రేవంత్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమావేశమై కొద్దిసేపు మంతనాలు సాగించారు. గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి ఉన్న రూమ్‌కి వెంకట్ రెడ్డి వెళ్లి ఆయనతో మాట్లాడడం విశేషం.
అనంతరం మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి తాను ఠాక్రే ఆహ్వానం మేరకు గాంధీ భవన్ కు వచ్చానని 30 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాల కోసం గాంధీభవన్‌కు వస్తూనే ఉన్నానన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై చర్చించేందుకు పార్టీ స్టార్ కంపెనయిర్గా ఉన్న నన్ను ఠాక్రే పిలవడం జరిగిందన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, పార్టీని అధికారంలో తీసుకురావడానికి పని చేస్తానన్నారు. నాలాంటి సీనియర్లతో హాత్ సే హాత్ జోడో విజయవంతానికి, అలాగే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై చర్చించడం అవసరమన్నారు.
ఖమ్మంలో బిఆర్ఎస్ సభ లాంటివి ఎన్నో సభలు కాంగ్రెస్ గతంలోనే నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
గాంధీభవన్‌కు కోమటిరెడ్డి..! రేవంత్‌తో సమావేశం https://t.co/a9BQRNAB87 pic.twitter.com/anZLPpBt6T
— vidhaathanews (@vidhaathanews) January 20, 2023