Komatireddy Venkatareddy
- బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు వద్ద ఘనంగా జన్మదిన వేడుకలు
- కాంగ్రెస్‌కు 70 నుంచి 80 సీట్లు ఖాయం
విధాత: కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు తనను పదేపదే సీఎం అంటూ అనవద్దని, సీఎం అంటే అంతా కలిసి ఎమ్మెల్యే గానే నన్ను ఓడిస్తారంటూ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం బ్రాహ్మణ వెల్లంలా రిజర్వాయర్ వద్ద కృష్ణా జలాలకు పూజలు చేసి కేక్ కట్ చేసి తన 60వ జన్మదిన వేడుకలు జరుపుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేడుకలకు హాజరైన ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
నన్ను సీఎం అనవద్దని, సీఎం అని అనకుంటేనే సీఎం అవుతానని, సీఎం అంటే మాత్రం అంతా కలిసి ఎమ్మెల్యేగానే ఓడిస్తారంటూ పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలు, సొంత పార్టీలోని ప్రత్యర్థులు అంతా కలిసి తనను ఓడిస్తారంటూ అర్థం వచ్చేలా మాట్లాడారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలేసానని, తనకు ఏ పదవి ముఖ్యం కాదని, నాకు ప్రజలే ముఖ్యమని మీకోసం చావడానికైనా, చంపడానికైనా సిద్ధమన్నారు.
నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు నన్ను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి తన అభిమానాన్ని చాటారని, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు. చనిపోయాక ప్రజలు గుర్తుపెట్టుకునేలా ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. త్వరలో రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తనని ఎమ్మెల్యేగా నల్గొండ ప్రజలు ఎలాగూ గెలిపిస్తారని, కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకపోతే రాజీనామా చేస్తానన్నారు.
నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఈ నెల 26న కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ, ఖర్గేల సమావేశం ఉందన్నారు. వచ్చే ఎన్నికలకు రెండు నెలల ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తారన్నారు. వచ్చే వారం పది రోజుల్లో నల్గొండలో ప్రియాంక గాంధీ బహిరంగ సభ ఉంటుందన్నారు.
బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు నిర్మాణం తన జీవితాశయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 80% పనులు పూర్తి చేయగా, 20% పనులు బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని, ఇంకా 10% పనులు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. బ్రాహ్మణ వెల్లంల నిర్మాణం ఎవరి ఘనతనో ఇక్కడి ప్రజలకు తెలుసు అన్నారు.
అసెంబ్లీలో 100 సార్లు శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పటికైనా శ్రీశైలం సొరంగం, నక్కలగండి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల అసంపూర్తి పనులను పూర్తి చేయాలన్నారు. ఎన్నికల ముందు ప్రాజెక్టుల పేరుతో ఏం చేసినా ప్రజలు గమనిస్తారన్నారు.
పేపర్ల లీకేజీ, ప్రభుత్వ భూములు అమ్మకాలు, ధరణి పేరుతో భూ దందాలు, పార్టీ ఆఫీసులకు భూ కేటాయింపులు, ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, ధాన్యం కొనలేనటువంటి అసమర్థ, అవినీతి బిఆర్ఎస్ ప్రభుత్వంను గద్దె దించాలన్నారు. రైతులు, యువత, మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వంను తెచ్చుకోవాలని ప్రజలను కోరారు.