Wednesday, March 29, 2023
More
    HomelatestKOMMALA Jatara: భక్తులతో పోటెత్తిన కొమ్మాల జాతర.. రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనలో పోటీ

    KOMMALA Jatara: భక్తులతో పోటెత్తిన కొమ్మాల జాతర.. రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనలో పోటీ

    • కోలాటాలు, డాన్సులు, డీజేలతో దద్దరిల్లిన పరిసరాలు
    • మొక్కలు సమర్పించుకున్న ఎమ్మెల్యేలు చల్లా, పెద్ది దంపతులు

    Kommala Jatara

    విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కొమ్మాల జాతర(Kommala Jatara) భక్త జనంతో పోటెత్తింది. రాజకీయ ప్రభ బండ్ల(Prabha bandlu)తో హోరెత్తింది. మూడు రోజులపాటు జరిగే జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాలలో గుట్ట సోరికలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Shri Lakshminarasimhaswamy)జాతర ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా ప్రారంభమై కన్నుల పండుగగా సాగుతోంది. ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాతో పాటు పరిసర జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొనేందుకు మొక్కులు సమర్పించేందుకు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు సంప్రదాయ పద్ధతిలో కుటుంబాలతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. వేలాదిమంది భక్తుల రాకతో కొమ్మాల జాతర పరిసరాలు హోరెత్తాయి.

    రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శన

    డిజె సౌండ్ లు, భక్తుల కోలాటాలు, డ్యాన్సుల మధ్య ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల పై రాజకీయ ప్రభ బండ్లను ఊరేగించడంలో నాయకులు, కార్యకర్తలు ఒకరిని మించి ఒకరు పోటీపడ్డారు. కొమ్మాల జాతర అంటేనే రాజకీయ ప్రభ బండ్ల ప్రదర్శనకు పోటీగా మారుతుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసే రాజకీయ ప్రభ బండ్లు ఒక విధంగా ఆకర్షణీయం కాగా మరోవైపు పరస్పరం రాజకీయ ఆధిపత్యం కోసం ఈ జాతరను వేదికగా వినియోగించుకోవడం దశాబ్దాలుగా వస్తోంది.

    నర్సంపేట ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం

    జాతర జరిగే కొమ్మాల ప్రాంతం పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ మండలంలో ఉండగా జాతరలో మాత్రం నర్సంపేట ప్రాంత రాజకీయ నాయకుల ప్రభ బండ్ల మధ్య పోటీ కొనసాగింది. అదేవిధంగా గీసుకొండ మండల భక్తులు కూడా ప్రభ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. డప్పుచప్పుల్లు, దరువుల మధ్య రాజకీయ పార్టీల జెండాలు రెపరెపలు, పాటలతో జాతర రాజకీయ రంగులను సంతరించుకుంది.

    గులాబీల ఆధిపత్యం

    కొమ్మాల జాతరలో గులాబీ ప్రభ బండ్లు ఎక్కువగా కనిపించినప్పటికీ కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టులు వారితో పాటు పోటీపడ్డారు. ఒకప్పుడు నర్సంపేట ఎమ్మెల్యేగా ఓంకార్ కొనసాగిన కాలంలో ఈ జాతరంతా ఎరుపు ప్రభ బండ్ల మయంగా కనిపించేది. ఒక్కో బండిని సాగనంపేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. రెండు రాజకీయ పార్టీల ప్రభ బండ్లు ఎదురెదురైతే ఉద్రిక్తతలు నెలకొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ కారణంగానే కొమ్మాల జాతరొచ్చిందంటే భక్తుల కిటకిటతోపాటు, రాజకీయ ప్రభల ఆధిపత్యం అడ్డుకునేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. ఈ పోటీని, ఉద్రిక్త పరిస్థితులను ఆపేందుకు గతంలో కొద్ది రోజులు ఈ రాజకీయ ప్రభ బండ్లను పోలీసులు నిషేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల అలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేనప్పటికీ రాజకీయ పార్టీల మధ్య పోటీ కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి వ‌ర‌కు కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభ బండ్ల ప్రదర్శన సాఫీగా కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

    ఎమ్మెల్యేల సందర్శన

    కొమ్మాల జాతరలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాతరను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం సాదాసీదాగా జాతర సాగింది. గురువారం భక్తజనంతో జాతర కిటకిటలాడింది. సాయంత్రం ప్రారంభమైన ప్రభ బండ్లు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతులు గులాబీ ప్రభను ప్రారంభించి అందులో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎం సి పి ఐ నాయకులు తమ తమ పార్టీల ప్రభ బండ్లతో ప్రదర్శనలు జరిపారు. ఈ జాతరకు స్థానికులే కాకుండా లంబాడా గిరిజనులు ఎక్కువ శాతంలో హాజరు కావడం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular