విధాత, సినిమా: టాలీవుడ్ వెండితెరపై నటీమణిగానే కాకుండా దర్శకురాలిగానూ కొందరు తారలు నిరూపించుకున్నారు. మెగా ఫోన్ పట్టి.. ఎన్టీఆర్, కృష్ణ వంటి వారిని కూడా డైరెక్ట్ చేశారు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. ఆ తర్వాత ప్రజంట్ జనరేషన్‌కి వస్తే.. నందినీ రెడ్డి, సుధా కొంగర, గౌరీ రోణంకి వంటి వారు ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నారు. వారు ఎడాపెడా సినిమాలు అయితే చేయడం లేదు కానీ.. సంవత్సరానికి ఒకటీ ఆరా సినిమాలతో అయితే మెప్పిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి రచయిత, దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ సోదరి కోన నీరజ (Kona Neeraja) కూడా చేరేందుకు సిద్ధమవుతోంది.
ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం.. నితిన్ తన ట్విట్టర్ వేదికగా హింట్ ఇచ్చాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆమె డైరెక్ట్ చేయబోతున్న సినిమాకు సంబంధించి వివరాలు బయటికి వచ్చాయి. కోన వెంకట్ సోదరి స్టైలిస్ట్‌గా అందరికీ పరిచయమే. నితిన్‌కి పర్సనల్ స్టైలిస్ట్‌గా ఆమె రంగంలోకి దిగింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ సమంత, శృతిహాసన్ వంటి వారికి ఆమె స్టైలిస్ట్‌గా పని చేసింది.
ఒకానొక స్టేజ్‌లో ఆమె పేరు మారుమోగింది. స్టైలిస్ట్‌గా కూడా ఇంత పేరును సంపాదించుకోవచ్చా? అనేలా తనలాంటి వారెందరికో ఆమె స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడామె డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి దిగుతోంది. స్వతహాగా ఆమె రచయిత కూడా. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ స్ర్కిప్ట్‌ని సిద్ధం చేసుకున్న నీరజ.. ఆ స్ర్కిప్ట్‌తో డైరెక్టర్‌గా మారేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి.
అతి త్వరలో ఆమె మెగా ఫోన్ పట్టబోతున్నారు. ఆమె డైరెక్ట్ చేసే చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు, తను డైరెక్ట్ చేయబోయే హీరో వివరాలు కూడా టాలీవుడ్ సర్కిల్స్ వైరల్ అవుతున్నాయి.
టిల్లు బాయ్ సిద్ధు జొన్నలగడ్డను ఆమె డైరెక్ట్ చేయబోతోందట. ప్రస్తుతం టిల్లు స్వ్కేర్ చిత్రీకరణలో ఉన్న సిద్ధు.. ఆ సినిమా పూర్తవగానే, నీరజతో చేసే సినిమాకు రెడీ అవుతారనేలా టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉన్నాయి.