KONDA | కాంగ్రెస్ లో తగ్గిన ప్రాధాన్యత ఆశావహుల పోటీతో ఆత్మ రక్షణ తొలిసారి ఇబ్బందికరమైన పరిస్థితి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలుగా చెప్పుకునే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు దంపతులు రాజకీయ అభద్రతా భావంలో ఉన్నారనిపిస్తోంది. కాంగ్రెస్ లో మాకంటే ఎవరు సీనియర్ అంటూ తరచూ ప్రశ్నించే వీరికి, పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి […]

KONDA |

  • కాంగ్రెస్ లో తగ్గిన ప్రాధాన్యత
  • ఆశావహుల పోటీతో ఆత్మ రక్షణ
  • తొలిసారి ఇబ్బందికరమైన పరిస్థితి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేతలుగా చెప్పుకునే వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు దంపతులు రాజకీయ అభద్రతా భావంలో ఉన్నారనిపిస్తోంది. కాంగ్రెస్ లో మాకంటే ఎవరు సీనియర్ అంటూ తరచూ ప్రశ్నించే వీరికి, పార్టీలో ప్రాధాన్యత తగ్గిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు ఈ చర్చకు ఆస్కారం ఇస్తుండగా, బుధవారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కొండా సురేఖ మాట్లాడిన అంశాలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.

అ సందర్భంగా కొండా సురేఖ ఈ సమావేశంలో టికెట్ విషయాన్ని లేవనెత్తుతూ, తనలాంటి నాయకురాలు టికెట్ ఆశిస్తున్న వరంగల్ తూర్పులో కూడా మరికొందరు తమకే టికెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారని మాట్లాడడం విడ్డూరంగా మారింది. వాస్తవానికి కాంగ్రెస్ అగ్రనేతల రాక సందర్భంగా హైదరాబాద్ తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభ విజయవంతం కోసం జరిగిన సమావేశంలో.. టికెట్ అంశాన్ని లేవనెత్తడం పట్ల కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

పార్టీలో తగ్గిన పలుకుబడి?

గతంలో తాము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రభావితం చేస్తామంటూ, తమకు అన్ని నియోజకవర్గాలలో బలమైన అనుచరులు ఉన్నారని కొండా దంపతులు చెబుతూ వచ్చారు. ఒక దశలో తమ కుటుంబానికి మూడు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలంటూ ప్రకటిస్తూ వచ్చారు. భూపాల్ పల్లి, పరకాల, నర్సంపేట ఆ తర్వాత క్రమంలో వరంగల్ తూర్పు వీరి ప్రాధాన్యత స్థానాలలో చేరిపోయాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో, ఆ తర్వాత బీఆర్ఎస్ లో మూడు టికెట్ల డిమాండ్ ను ముందుకు తెచ్చారు.

భూపాల్ పల్లి నుంచి కొండా మురళి, పరకాల నుంచి కొండా సురేఖ, వరంగల్ తూర్పు నుంచి తమ కుమార్తె కొండా సుష్మితా పటేల్ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రకటిస్తూ వచ్చారు. అలాంటి దశ నుంచి ఇప్పుడు తమకే టికెట్ వస్తుందో .. లేదోననే ఆందోళనతో కూడిన ఆవేదన వ్యక్తం చేయడం కాంగ్రెస్ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో బండ్లు ఓడలు .. ఓడలు బండ్లయితాయని సామెత! కొండా దంపతుల విషయంలో నిజమైందంటున్నారు.

ఎదుగుదలకు కాంగ్రెస్ దోహదం

సాధారణ స్థాయి నుంచి ప్రారంభమైన కొండా సురేఖ, మురళి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగారు. సురేఖ ఎమ్మెల్యేగా, మురళి ఎమ్మెల్సీగా ఎన్నికవుతూ వచ్చారు. వీరి రాజకీయ ప్రస్థానంలో పరకాల నియోజకవర్గం ఎంతో సహకరించింది. వైయస్ హయాంలో కొండా సురేఖ మంత్రిగా, మురళి ఎమ్మెల్సీగా కొనసాగారు. ఆ తరువాత పార్టీ, నియోజకవర్గం మార్చి వరంగల్ తూర్పుకు చేరుకున్నారు. కాంగ్రెస్ లో మంత్రిగా ఉంటూ, వైఎస్ మరణానంతరం మంత్రి పదవికి రాజీనామా చేసి వైయస్సార్సీపీతో జగన్ అనుచరులుగా పయనించారు.

మానుకోట లాంటి సంఘటనలో కీలక పాత్రధారులుగా నిలిచారు. 2011లో పరకాల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తలపడ్డారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మొలుగూరి బిక్షపతి చేతిలో కొండ సురేఖ పరాజయం చవిచూశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి వైయస్సార్సీపీకి రాజీనామా చేసి జగన్ కు గుడ్ బై చెప్పారు. కొంతకాలం సైలెన్స్ పాటించి, 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజులకే కాంగ్రెస్ కి చెయ్యిచ్చి, అనూహ్యంగా అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి నియోజకవర్గాన్ని కూడా మార్చి వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి బసవరాజు సారయ్యను ఓడించి గెలుపొందారు. కొండా మురళికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.

టీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడా తమ ప్రభావం 3 నియోజకవర్గాల్లో ఉంటుందంటూ ప్రకటిస్తూ వచ్చారు. తిరిగి 2018 ఎన్నికల సమయంలో అప్పటికే టీఆర్ఎస్ పై అసంతృప్తి కొనసాగించారు. ఈ సమయంలో ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖ పేరు కేసీఆర్ ప్రకటించలేదు. ఈ దశలో టీఆర్ఎస్ కి, ఎమ్మెల్సీకి కొండా మురళి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈసారి మళ్లీ సిటింగ్ స్థానమైన వరంగల్ తూర్పు నుంచి మకాం మార్చి, పరకాల సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2018 ఓటమి తర్వాత చాలా కాలం రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సైలెన్స్ పాటిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొండా దంపతులు పార్టీ మారుతారని అనేక ఊహగానాలు వచ్చాయి. చివరికి గత ఎన్నికల్లో పోటీ చేసిన పరకాలను పెద్దగా పట్టించుకోకుండా కొద్ది కాలంగా తిరిగి వరంగల్ తూర్పులో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇపుడు పరకాల నుంచి మురళి, తూర్పు నుంచి సురేఖ టికెట్ ఆశిస్తున్నారు.

పరకాల-వరంగల్ మధ్య చక్కర్

పరకాల, వరంగల్ తూర్పు మధ్య వీరి రాజకీయ జీవితం కొనసాగింది. ప్రస్తుతం వీరి రాజకీయ కార్యకలాపాలు కూడా ఈ రెండు నియోజకవర్గాల చుట్టూ తిరుగుతూ డోలాయమాన పరిస్థితులో ఉన్నారు. ఈ స్థితిలో గత ఎన్నికల్లో కొండా సురేఖకు మద్దతు తెలిపిన పరకాల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఇనుగాల వెంకటరామిరెడ్డి నియోజకవర్గాన్ని వీడకుండా పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ పట్టు కొనసాగిస్తున్నారు.

తనకే టికెట్ కావాలంటూ పట్టుదలతో ఉన్నారు. మళ్లీ ఎన్నికలు రావడంతో గత ఎన్నికల్లో సురేఖ పోటీ చేసిన పరకాల టికెట్ ఆశిస్తూ మురళి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. విశేషమేమిటంటే మురళి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఎప్పుడు పోటీ చేయలేదు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకేసారి జడ్పీటీసీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాంటి మురళి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలోకి పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ప్రవేశించారు. ఈ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎన్నారై సెల్ ప్రతినిధిగా ఉన్న ప్రదీప్ కుమార్ అనే నాయకుడు, మరో మైనార్టీ నేత, మాజీ డిప్యూటీ మేయర్ యెంబాడి రవిందర్ తదితరులు కూడా తూర్పు నియోజకవర్గంలో దృష్టి సారించారు.

ఇక ఒకప్పుడు భూపాలపల్లి పై తమకు పట్టు ఉందంటూ చెబుతూ వచ్చినా, ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా పోయింది. ఇప్పుడు అటు పరకాల ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో వీరికి సొంత పార్టీ నుంచి పోటీ పెరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో తాము అనుకున్నది సాధించిన కొండా దంపతులు అభద్రతలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ అసంతృప్తి వల్ల సురేఖ నిన్నటి సమావేశంలో మాట్లాడినట్లు భావిస్తున్నారు.

పార్టీల మార్పు కూడా కారణం

కొండా దంపతుల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ తొలినుంచి ఉపయోగపడ్డది. కానీ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరడం, ఆ తర్వాత టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం, గత కొంతకాలంగా సైలెన్స్ గా ఉండడంతో పార్టీలో వీరిపై నమ్మకం తగ్గింది. ఈ క్రమంలోనే పార్టీ ప్రాధాన్యత పదవుల్లో అవకాశం దక్కలేదు.

ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొంత సహకరిస్తున్నప్పటికీ అధిష్టానం దగ్గర పలుకుబడి తగ్గినట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది. ఈ కారణంగానే టికెట్ గ్యారెంటీ అనే పరిస్థితి లేకుండా పోయిందని అనుకుంటున్నారు. అందుకే అసహనం వ్యక్తం చేస్తున్నారని వీరంటే గిట్టని వారంటున్నారు.

Updated On 14 Sep 2023 11:51 PM GMT
krs

krs

Next Story